
రైలు కింద ఉన్న సింహాచలం సంఘటన స్థలంలో కూలబడిన బాధితుడు
శ్రీకాకుళం, కాశీబుగ్గ : ఏ కష్టం వచ్చిందో గానీ ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా రైలు పట్టాలపై పడుకున్నాడు. సరిగ్గా రైలు వచ్చిన సమయంలో భయం వేయడంతో మధ్యలో లేచే ప్రయత్నం చేశాడు. రైలు కిందిభాగం తగలగడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన పలాస రైల్వేస్టేషన్ సమీపంలో బుధవారం చోటుచేసుకుంది. సోంపేట మండలం ఇసుకపాలెం గ్రామానికి చెందిన సింహాచలం పాత్రో(62) వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధమయ్యాడు.
బుధవారం పలాస రైల్వేష్టేషన్ పరిధిలోని కాశీబుగ్గ రైల్వే ఎల్‌సీ గేటు వద్ద పట్టాలపై పడుకున్నాడు. టాటా ఎక్స్‌ప్రెస్ రైలు పలాస చేరుకుంటున్న తరుణంలో భయంతో లేచే ప్రయత్నం చేశాడు. ఈ ఘటనలో రైలుకింద భాగం తగలగడంతో చేతులు, కాళ్లకకు తీవ్రంగా దెబ్బలు తగలయ్యాయి. వ్యక్తి ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంటున్న సమయంలో కొందరు ప్రయాణికులు చూసి వెంటనే చెయిన్ లాగడంతో రైలు ఆగింది. కొందరు ప్రయాణికులు, గ్యాంగ్‌మెన్లు వెళ్లి క్షతగాత్రుడిని అతికష్టమ్మీద రైలు కింద నుంచి బయటకు తీశారు.
గంటపాటు నరకయాతన..
తీవ్రంగా గాయపడిన సింహాచలం సుమారు గంటంపావు సేపు నరకయాతన అనుభవించారు. స్థానికులు 108కు ఫోన్ చేయగా అందుబాటులో లేదని సమాచారం రావడంతో నొప్పితో విలవిల్లాడిపోయాడు. చాలాసేపటి తర్వాత మందస 108 అంబులెన్సు వచ్చి క్షతగాత్రుడిని పలాస సామాజిక ఆస్పత్రికి తరలించారు. రైల్వేపోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.