
నిజామాబాద్: కుటుంబ కలహాలు అతన్ని తీవ్ర నిర్ణయం తీసుకునేలా చేశాయి. బైకుతో సహా పట్టాలపై రైలుకు ఎదురెళ్లాడు. కాస్తుంటే అతనిప్రాణాలు గాల్లో కలిసిపోయేవే. కానీ, అతని టైం బాగుంది. రైలు ఆగింది. ప్రాణాలతో బయటపడ్డాడు. నవీపేట మండల కేంద్రంలో రైలును ఢీకొనేందుకు ఒక యువకుడు బైక్‌పై ఎదురెళ్లిన సంఘటన కలకలం రేపింది.
భీమ్‌గల్ మండల కేంద్రానికి చెందిన జగదీశ్ (34)కు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. దుబాయ్ లో డ్రైవర్‌గా పనిచేసే జగదీశ్ అప్పుడప్పు డు స్వగ్రామానికి వచ్చి వెళ్లేవాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో నెల కిందట మకాంను నవీపేటకు మార్చాడు. ఈ వ్యవధిలో ఇద్దరి మధ్య కలహాలు పెరిగాయి. దీంతో జీవితంపై విరక్తి చెందిన జగదీశ్ ఆత్మహత్య చేసుకోవాలని భావించాడు.
సాయినగర్ షిరిడీ–తిరుపతికి వెళ్లే వీక్లీ రైలును ఢీకొనాలని నిర్ణయించుకుని.. మండల కేంద్రంలోని రైలు పట్టాలపై బైక్‌పై ఎదురుగా వెళ్లాడు. ఇది గమనించిన గేట్‌మన్ కొద్ది దూరంలో ఉన్న మరో గేట్‌మన్‌కు సమాచారమివ్వగా గేట్ వేయలేదు. ఇది గమనించిన రైల్వే కో పైలట్ చాకచక్యంగా రైలును ఆపేశాడు. దీంతో జగదీశ్ ప్రాణాలతో బయటపడ్డాడు. జగదీశ్‌పై ఆర్పీఎఫ్ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి.
ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com