ఆస్తిపై కన్నేసి ఘాతుకం
సాధారణ మృతిగా చిత్రీకరించేందుకు ప్రయత్నం
పోలీసుల రాకతో బయటపడిన నిజం
బోధన్‌టౌన్(బోధన్): మామ ఆస్తిపై కన్నేసిన అల్లుడు అత్తతో కలిసి మామను హత్య చేసిన ఘటన బోధన్‌లో చోటు చేసుకుంది. వివరాలు.. పట్టణంలోని ఉద్మీర్‌గల్లీకి చెందిన క్యామొల్ల శంకర్(45) శనివారం రాత్రి గొర్రెల కొట్టం బయట నిద్రిస్తుండగా అల్లుడు రవి, అత్త చిన్నమ్మతో కలిసి గొంతు నులిమి చంపి ఇంట్లోకి తీసుకొచ్చి సాధారణ మృతిగా చిత్రీకరించేందుకు యత్నించారు. స్థానికులు ఒంటిపై ఉన్న గాయాలను గమనించి అనుమానంతో పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని, గొర్రెల కొట్టాన్ని పరిశీలించారు. గొంతు నులిమిన ఆనవాళ్లు, ఇతర గాయాలను గమనించి అల్లుడు, అత్తను అదుపులోకి తీసుకొని విచారించగా.. తామే హత్యకు పాల్పడినట్లు వారు అంగీకరించారని సీఐ వెంకట నారాయణ తెలిపారు. చెక్కీ క్యాంప్‌నకు చెందిన రవికి ఐదేళ్ల క్రితం శంకర్ పెద్దకూతురుతో వివాహం జరిగింది. అనంతరం రవిని వారు ఇల్లరికం తెచ్చుకున్నారు.
ఇటీవల ఇంట్లో అత్తమామకు జరుగుతున్న చిన్నచిన్న గొడవలను అదునుగా తీసుకొని ఈ హత్యకు పూనుకున్నాడు. మద్యం సేవించి కొట్టంలో మంచంపై పడుకున్న శంకర్‌ను చాతీపై పిడిగుద్దులు గుద్దడంతో పాటు గొంతు నుమిలి హత్య చేసినట్లు వారు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామని, చిన్న కూతురు సవిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ వెంకట నారాయణ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment