Kill People Due to Incessant Rains in Himachal Pradesh - Sakshi
Sakshi News home page

హిమాచల్, ఉత్తరాఖండ్‌లో భీకర వర్షం

Published Tue, Aug 15 2023 5:24 AM | Last Updated on Tue, Aug 15 2023 10:50 AM

Kill Peoples due to incessant rains in Himachal Pradesh - Sakshi

షిమ్లా/డెహ్రాడూన్‌:  హిమాచల్‌ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాలను భీకర వర్షాలు ముంచెత్తుతున్నాయి. కొంచచరియలు విరిగిపడుతుండడంపై పలు రహదారులపై రాకపోకలు నిలిచిపోయాయి. ఇళ్లు సైతం కూలిపోతున్నాయి. హిమాచల్‌ ప్రదేశ్‌లో ఆదివారం సాయంత్రం మొదలైన వర్షాలు ఎడతెరిపిలేకుండా కురుస్తున్నాయి. వర్షాలు, కొండచరియల ధాటికి రాష్ట్రంలో కనీసం 51 మంది మరణించారని అధికారులు సోమవారం ప్రకటించారు.

వీరిలో ఏడుగురు రాజధాని షిమ్లాలోని సమ్మర్‌ హిల్‌ ప్రాంతంలో శివాలయంపై కొండచరియలు విరిగిపడడంతో రాళ్ల కింద చిక్కుకొని సజీవ సమాధి అయ్యారని వెల్లడించారు. ఆలయం కూడా ధ్వంసమైంది. ఈ రాళ్ల కింద మరికొంత మంది ఉండొచ్చని భావిస్తున్నట్లు తెలిపారు. షిమ్లాలో ఈ శివాలయం ఎంతగానో ప్రసిద్ధిగాంచింది. నిత్యం పద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. అలాగే షిమ్లాలోని ఫగ్లీ ప్రాంతంలో కొండచరియల వల్ల ఐదుగురు మరణించారు.

ఇక్కడ శిథిలాల కింద చిక్కుకున్న 17 మందిని అధికారులు రక్షించారు. అంతేకాకుండా చాలా ఇళ్లు బురదలో కూరుకుపోయాయి. వర్షాల కారణంగా హిమాచల్‌ ప్రదేశ్‌లో సోమవారం కాలేజీలు, స్కూళ్లకు సెలవు ప్రకటించారు. ముందుజాగ్రత్తగా 752 రహదారులపై రాకపోకలను నిలిపివేశారు. సైన్యంతోపాటు ఎస్‌డీఆర్‌ఎఫ్, ఎన్డీఆర్‌ఎఫ్, ఐటీబీపీ సిబ్బంది, రాష్ట్ర పోలీసులు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. రాష్ట్రంలో అత్యధికంగా కాంగ్రాలో 273 మిల్లీమీటర్లు, ధర్మశాలలో 250 మిల్లీమీటర్లు, సుందర్‌నగర్‌లో 168 మిల్లీమీటర్లు, మండీలో 140 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో 12 జిల్లాలకుగాను 9 జిల్లాల్లో రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.  

అమిత్‌ షా దిగ్భ్రాంతి  
షిమ్లాలో కొండచరియలు విరిగిపడడం వల్ల ధ్వంసమైన శివాలయాన్ని ముఖ్యమంత్రి సుఖీ్వందర్‌సింగ్‌ సుఖూ సందర్శించారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని క్షేమంగా బయటకు తీసుకురావడానికి సహాయక చర్యలు ప్రారంభించినట్లు తెలిపారు. హిమాచల్‌ ప్రదేశలో వర్షాల వల్ల పెద్ద సంఖ్యలో జనం మరణించడం పట్ల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఎన్డీఆర్‌ఎఫ్‌ అధికారులను ఆదేశించారు.  

కేదార్‌నాథ్‌కు రాకపోకలు బంద్‌  
ఎడతెరిపిలేని భారీ వర్షాలతో ఉత్తరాఖండ్‌ రాష్ట్రం చిగురుటాకులా వణికిపోతోంది. కొండచరియలు విరిగి పడడంతో పలు ఇళ్లు నేలకూలాయి. రహదారులు దెబ్బతిన్నాయి. వర్షాల ధాటికి రాజధాని డెహ్రాడూన్‌ సమీపంలోని ప్రైవేట్‌ డిఫెన్స్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ ధ్వంసమైంది. వర్ష బీభత్సం వల్ల రాష్ట్రంలో నలుగురు మరణించారు. మరో 10 మంది  గల్లంతయ్యారు. పలుచోట్ల జాతీయ రహదారులు ధ్వంసం కావడంతో ప్రఖ్యాత పుణ్యక్షేత్రాలైన బద్రీనాథ్, కేదార్‌నాథ్, గంగోత్రికి రాకపోకలు నిలిచిపోయాయి.

చార్‌దామ్‌ యాత్రను రెండు రోజుల పాటు రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఫలితంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.  వాహనాలు కొట్టుకుపోయాయి. రుద్రప్రయాగ్, దేవప్రయాగ్, రిషికేశ్‌లో అలకనంద, మందాకినీ, గంగా నదులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. రిషికేశ్‌లో 435 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement