అనిత (ఫైల్)
రాజాం సిటీ: ‘ఇంకా వంట నేర్చుకోకుంటే ఎలా?, రేపొద్దున్న ఎలాగే బతికేది.. ఇదిగో రూ.20 తీసుకుని బయట కర్రీ తెచ్చుకో’ అని మందలించి బయటకు వెళ్లిన ఆ తల్లి కాసేపటికే దుర్వార్త వినాల్సి వచ్చింది. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న కూతురును చూసి హతాశురాలైంది. అయ్యో దేవుడా... కర్రీ తెచ్చుకోమని నేనిచ్చిన రూ.20తోనే అఘాయిత్యానికి ఒడిగట్టావా... అంటూ కన్నీటిపర్యంతమైంది. ఆస్పత్రిలో కొనఊపిరితో చికిత్స పొందుతున్న ఈ బాలిక తనకు బతకాలని ఉందని కోరుతుండటంతో వైద్యులను, పోలీసులను కలచివేసింది.
రాజాం పట్టణం కొండకవీధికి చెందిన పట్నాన అనిత (14) అనే తొమ్మిదో తరగతి విద్యార్థిని ఆదివారం చీపురుపల్లి రోడ్డులోని వేబ్రిడ్జి సమీపంలో రోడ్డు పక్కనే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించింది. ఈమె తన ఒంటికి నిప్పంటించుకోగా మంటలకు తాళలేక గట్టిగా కేకలు వేసినప్పటికీ సమీపంలో ఎవరూ లేరు. కొంత సమయానికి రోడ్డుపై వెళ్తున్న ప్రయాణికులు గుర్తించి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అప్పటికే శరీరమంతా కాలిపోయింది. వెంటనే ఓ ప్రైవేటు వాహనంలో (ట్రాక్టర్‌లో) రాజాం సామాజిక ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ప్రాథమిక చికిత్సనందించి మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు.
తల్లి మందలించిందని....
విషయం తెలుసుకున్న రాజాం సీఐ జీవీ రమణ సంఘటనా స్థలానికి చేరుకుని ఆరా తీశారు. సిబ్బందిని ఆస్పత్రికి పంపించి బాధితురాలి వద్ద వాంగ్మూలం సేకరించారు. ఈ విద్యార్థిని రాజాంలోని ఓ ప్రైవేటు స్కూల్‌లో తొమ్మిదో తరగతి పూర్తి చేసుకోగా, పదో తరగతిలోకి రానుంది. తన తల్లి మంగమ్మ, చెల్లితో కలసి నివాసముంటోంది. మూడేళ్ల క్రితమే తండ్రి మరణించాడు. తన తల్లి భోజనం చేయడానికి కూర వండుకోమని చెప్పగా తనకు రాదనడంతో మందలించి, కర్రీ తెచ్చుకోమని రూ. 20 ఇచ్చి బయటకు వెళ్లిపోయింది. ఈ డబ్బులతో పెట్రోల్ కొనుగోలు చేసి ఆత్మహత్యకు యత్నించింది.
రోదిస్తున్న తల్లి....
కాలిన గాయాలతో కుమార్తెను చూసిన తల్లి మంగమ్మ బోరున విలపించింది. తన భర్త మరణానంతరం, రోడ్డు పక్కన పకోడీ వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. ఈ నేపథ్యంలో తన కుమార్తె ఇలా చేస్తుందని ఊహించలేదని బోరుమంది.
బతకాలని ఉంది...
చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న అనితను శ్రీకాకుళం రిమ్స్‌లో చికిత్స పొందుతోంది. ఈ సమయంలో వాంగ్మూలం తీసుకునేందుకు వచ్చిన పోలీసులతోపాటు వైద్యులు ఎదుట రోదించింది. తనను బతికించాలని, తనకు బతకాలని ఉందని కంటతడి పెట్టింది. క్షణికావేశం కారణంగా ఆత్మహత్యకు యత్నించినట్లు వాపోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు రాజాం సీఐ జీవీ రమణ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment