భార్యాకుమార్తెతో మృతుడు వెంకటరమణ(ఫైల్) ,లాడ్జీ గదిలో ఉరేసుకుని వేలాడుతున్న వెంకటరమణ
కాశీబుగ్గ: ‘కుటుంబ కలహాలతో నేను చనిపోతున్నాను’ అంటూ కుటుంబీకులకు, బంధువులకు సందేశాలు పంపిన ఓ వివాహితుడు తనువు చాలించాడు. ఈ సంఘటన పలాస–కాశీబుగ్గ జంట పట్టణాల్లో కలకలం రేపింది. వజ్రపుకొత్తూరు మండలం నువ్వలరేవుకు చెందిన కదంబాల గోవిందరావు కుమారుడు వెంకటరమణ(29) గురువారం సాయంత్రం 5 గంటలకు ఇంటి నుంచి బయలుదేరి కాశీబుగ్గ చేరుకున్నాడు. అక్కడ శ్రీనివాస కూడలి వద్ద శ్రీనివాస లాడ్జీ మూడో అంతస్తులోని 314 గది బుక్ చేసుకున్నాడు. ఆ రోజు రాత్రి అందరికీ ఫోన్ సందేశాలు పంపాడు. ఆ తర్వాత గది తలుపులు బంధించుకుని ఫ్యాన్ ఇనుప రాడ్డుకు నైలాన్ తాడుతో ఉరేసుకున్నాడు.
ఈ సందేశాలు చూసిన బంధువులు, కుటుంబ సభ్యులు ఎక్కడ ఉన్నాడో తెలియక శుక్రవారం ఉదయం రైలు మార్గాలు, వంతెనలు వెతుక్కుంటూ వచ్చారు. చివరకు పోలీసులకు లాడ్జీ సిబ్బంది సమాచారం అందించారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు, భార్యాపిల్లలు వచ్చేంత వరకు కాశీబుగ్గ ఎస్‌ఐలు టీ రాజేష్, రాజేంద్రప్రసాద్, సిబ్బంది వేచి ఉన్నారు. చివరకు ఉదయం 11 గంటల సమయంలో తలుపులు బద్దలు కొట్టి మృతదేహాన్ని బయటకు తీశారు. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు బోరున విలపించారు. మృతుడి పిల్లలు రోదిస్తున్న తీరు స్థానికులను కలచివేసింది. కుటుంబ కలహాలే కారణమని, అనేక ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారని బంధువులు తెలిపారు. వ్యాపార రీత్యా మార్కెటింగ్ పనిమీద వచ్చినట్లు వివరించాడని లాడ్జీ మేనేజరు తెలిపారు. మృతదేహాన్ని పలాస ఆసుపత్రికి తరలించిన కాశీబుగ్గ పోలీసులు ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
గ్రామంలో విషాద ఛాయలు
వజ్రపుకొత్తూరు రూరల్: వెంకటరమణ ఆత్మహత్యతో స్వగ్రామం నువ్వలరేవులో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక్కడ బుక్‌షాపు నడుపుకుంటూ నిన్నటి వరకు అందరితో సరదాగా గడిపి, ఇంతలోనే తమ∙మధ్య లేకపోవడంతో స్నేహితులు జీర్జించుకోలేకపోతున్నారు. ఈయనకు నాలుగేళ్ల కిత్రం ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా చికిటి నియోజకవర్గ పరిధిలో కోటిలింగం గ్రామానికి చెందిన తులసితో వివాహమైంది. వీరికి కుమార్తె లాస్య(5), కుమారుడు ప్రదీప్(1) ఉన్నారు. తన తల్లిదండ్రులు లక్ష్మి, గోవిందరావులతో కలిసి వీరంతా ఒకే ఇంట్లో ఉంటున్నారు. వ్యాపార రీత్యా బయటకు వెళ్లిన తమ తండ్రి రాక కోసం ఎదురు చూస్తున్న పసి హృదయాలకు ఇక నాన్న లేడన్న చేదు నిజం తెలిసి గుక్కపెట్టి ఏడ్చారు. వీరిని చూసిన హృదయాలు చలించిపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment