మృతురాలి సూసైడ్ నోట్
అంజలీ నువ్వు బాగా చదువుకోవాలిరా.. నాన్న నీపైన పెట్టుకున్న హోప్స్ నువ్వు రీచ్ అవుతావని నా నమ్మకం. ఐషూ నువ్వు నా అమ్మవి.. నీ హెల్త్ బాగులేదని తెలిసి కూడా నిన్ను విడిచి వెళ్లిపోతున్నా.. నువ్వు ఎప్పుడూ భయపడకు. నేనెప్పుడూ నీతోనే ఉంటా.. కాళీ.. బాగా చదువుకో.. బాగా భోజనం చేయి.. నేను ఎలాంటి తప్పు చేయలేదు. విడిచిపోతున్నందుకు నన్ను క్షమించండి.. వాళ్లు ముగ్గురికీ శిక్ష పడాలి. అదే నా చివరి కోరిక.
- ఓ తల్లి బిడ్డలను విడిచివెళిపోతూ రాసుకున్న చివరి మాటలివి.. అమ్మా అని పిలుస్తూనే తనపై కన్నేసిన ఓ కామాంధుడి వేధింపులకు తాళలేక ఆత్మహత్యకు పాల్పడిన ఓ వివాహిత మూగ రోదనకు అక్షర రూపమిది.. పక్కింట్లో ఉంటూ కుటుంబానికి స్నేహితునిగా మెలిగిన వ్యక్తి బ్లాక్‌మెయిల్ చేసి లొంగదీసుకునేందుకు యత్నించడంతో.. అతని బెదిరింపులను భరించలేక ఓ గృహిణి (30) బలవంతంగా ప్రాణాలు తీసుకుంది. పూర్తి వివరాలను తన డైరీలో సూసైడ్ నోట్ రూపంలో రాయడంతో వెలుగులోకి వచ్చిన విషయాలు సంచలనం సృష్టించాయి.
సాక్షి, కంచిలి (శ్రీకాకుళం): ఆమెది ఓ చక్కనైన కుటుంబం. భర్త కీలు సత్యనారాయణ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు కంచిలి శాఖలో ఫీల్డ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. ముగ్గురు ముత్యాల్లాంటి పిల్లలు. చుట్టుపక్కల వారిని కూడా సొంత మనుషుల్లా భావించే మంచితనం ఆమెది. ఆ సౌశీల్యాన్నే ఆ దుర్మార్గుడు దుర్వినియోగపరిచాడు. ఆమెకు నరకం చూపించాడు. బ్యాంక్ అధికారి సత్యనారాయణ కంచిలిలో తన కుటుంబంతో ఓ అద్దె ఇంట్లో నివాసముంటున్నారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్ పథకంలో ఇంజినీరింగ్ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్న మాధవరావు వారి పక్క పోర్షన్‌లో అద్దెకు ఉండేవాడు. ఆ పక్క పోర్షన్‌లో ఈశ్వర్‌రెడ్డి, తులసి అనే దంపతులు ఉండేవారు. ఒకేచోట ఉంటున్న వీరి మధ్య స్నేహం ఏర్పడి కలుపుగోలుగా ఉండేవారు.
నిందితుడు మాధవరావు మృతురాలిని, ఆమె భర్తను అమ్మా.. నాన్న.. అని పిలిచేవాడని తెలుస్తోంది. మృతురాలు సూసైడ్ నోట్‌లో రాసిన వివరాల ప్రకారం తనపై కన్నేసిన మాధవరావు.. ఆమె బాత్‌రూంలో స్నానం చేసే సమయంలో రహస్యంగా వీడియో, ఫోటోలు తీసి, ఆమెను భయపెట్టి లొంగదీసుకొనే ప్రయత్నం చేస్తుండేవాడు. మాధవ్‌కు పక్క పోర్షన్‌లో ఉండే ఈశ్వర్‌రెడ్డి, తులసి దం పతులు సహకరించారు. ముగ్గురూ కలిసి తరచూ ఈ వీడియో, ఫోటోలను ఇంటర్‌నెట్‌లో అప్‌లోడ్ చేస్తామని భయపెట్టేవారు. కానీ మృతురాలు ఈ విషయాన్ని భర్తకుగాని, కన్నవారికిగాని చెప్పుకోలేక మానసిక క్షోభ అనుభవించేది.
మృతురాలి కుమార్తె అంజలి వద్ద వివరాలు సేకరిస్తున్న ఎస్‌ఐ వెంకటేష్ (ఇన్‌సెట్లో) నిందితుడు మాధవ్ (ఫైల్)
బదిలీపై వెళ్ళినా..
కొన్నాళ్ల తర్వాత మాధవ్ వేరే ప్రాంతానికి బదిలీపై వెళ్లిపోయాడు. అయినా ఆమెకు ఫోన్‌లు చేస్తూ, భర్త లేని సమయంలో వచ్చి భయపెడుతూ ఉండేవాడు. మాధవ్ పెడుతున్న వేధింపులను భరించలేక వారం రోజుల క్రితం భర్తకు, మిగతా కుటుంబ సభ్యులకు జరిగిందంతా ఆమె వివరించింది. మాధవ్‌ను పిలిచి వార్నింగ్ ఇస్తానని భర్త ఊరడించారు. ఇంతలో రెండు రోజుల క్రితం 24వ తేదీ అర్ధరాత్రి సమయంలో ఎవరో వంటగది కిటికీ వద్దకు వచ్చి పిలిచి తనపై పువ్వు విసరడంతో భర్తకు చెప్పింది. పరిసరాల్లో వెతికినప్పటికీ ఎవరూ కన్పించలేదు. తాజా సంఘటనతో మరింత కుంగిపోయిన బాధితురాలు గురువారం మధ్యాహ్నం భర్త బ్యాంకుకు వెళ్లిన సమయంలో.. పిల్లలకు భోజనం పెట్టి నిద్రపుచ్చిన తర్వాత వంటగదిలోనే సీలింగ్ ఫ్యాన్‌కు చీరతో ఉరిపోసుకొని ఆత్మహత్య చేసుకొంది. తన బలవన్మరణానికి మాధవ్, ఈశ్వర్‌రెడ్డి, తులసి దంపతుల మానసిక వేధింపులే కారణంగా పేర్కొంటూ తన డైరీలో వివరంగా రాసింది.
మృతురాలికి భర్తతోపాటు పిల్లలు అంజలి (12), ఐశ్వర్య (10), రెండున్నరేళ్ల బాబు దేవిశ్రీప్రసాద్ ఉన్నారు. శైలజ మృతిపై తండ్రి సుద్దాల జగన్నాథరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొత్తూరు మండలానికి చెందిన ఎన్‌ఆర్‌ఈజీఎస్ ఉద్యోగి అల్లాడ మాధవరావు, సంతబొ మ్మాళి మండలానికి చెందిన భార్యభర్తలు తులసి, ఈశ్వర్‌రెడ్డిలపై ఇన్‌చార్జి ఎస్‌ఐ కె.వెంకటేష్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు తెలిసింది. ఆత్మహత్య గురువారం మధ్యాహ్నమే జరిగినప్పటికీ.. రాత్రికి గానీ డైరీ గుర్తించకపోవడంతో శుక్రవారం ఉదయానికి గానీ సంఘటన వెలుగులోకి రాలేదు.
Comments
Please login to add a commentAdd a comment