kanchili
-
420 లీటర్ల సారా స్వాధీనం
కంచిలి: మండలంలో నువాగడ పంచాయతీ డొలాసాయి గ్రామంలో 420 లీటర్ల నాటుసారా డంప్‌ను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు సోంపేట ఎస్ఈబీ ఇన్స్పెక్టర్ టి.వెంకటప్పలనాయుడు శుక్రవారం తెలిపారు. చైతన్య భుయా అనే వ్యక్తికి చెందిన ఇంటి పెరడులో సారా బ్యాగులను గుర్తించామని చెప్పారు. ఒడిశా నుంచి తీసుకొచ్చి ఇక్కడ భద్రపరిచినట్లు తెలిసిందని, తనిఖీల కోసం సిబ్బంది రావడాన్ని పసిగట్టి భుయా పారిపోయాడని పోలీసులు తెలిపారు. ఈ దాడుల్లో సీఐతో పాటు ఎస్ఐలు జి.వి.రమణ, యు.వి.వి.నాగరాజు, హెచ్‌సీ డి.మోహనరావు, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. కాగా, డంప్‌ను గుర్తించినందుకు ఎస్ఈబీ జాయింట్ డైరెక్టర్ కంచె శ్రీనివాసరావు, అసిస్టెంట్ కమిషనర్ కె.పి.గోపాల్ సిబ్బందిని అభినందించారు. -
వృక్షాలపై ఔరా చిత్రకళా ‘కాండము’లు
కంచిలి (శ్రీకాకుళం): వృక్షాలే ఆయన కాన్వాస్. చెట్ల కాండలు కనిపిస్తే ఆయన తన మెదడుకు పదును పెడతాడు.. అద్భుతమైన బొమ్మ దింపేస్తాడు. ఆ విధంగా వృక్షాలను అందంగా తీర్చిదిద్దుతున్నాడు శ్రీకాకుళం జిల్లా కంచిలికి చెందిన ఉపాధ్యాయుడు గొర్లె దుర్గారావు. తన రెగ్యులర్ విధులతోపాటు, తనకిష్టమైన చిత్రకళ సరికొత్త పద్ధతుల్లో ప్రదర్శిస్తున్నారు. కంచిలిలో ఏపీ బాలయోగి గురుకుల పాఠశాల, కళాశాలలో ఆర్ట్స్ టీచర్‌గా గొర్లె దుర్గారావు విధులు నిర్వర్తిస్తున్నాడు. వృక్ష కాండములో కళాఖండాలు సృష్టించడం ఆయన ప్రత్యేకత. గురుకుల విద్యాలయ ఆవరణలో తిత్లీ తుఫాను వలన చెట్లు కూలిపోయాయి. ఈ సమయంలో ఒక టేకు చెట్టు పాఠశాల ఆవరణలో ఉండిపోయింది. పలుచగా.. పెద్ద సైజులో ఆ వృక్షం కాండం ఉండడంతో దుర్గారావు దానిపై తన కళను ప్రదర్శించాలని అనుకున్నాడు. ఈ విధంగా ఆ వృక్షంపై వీలు చిక్కినప్పుడల్లా వివిధ దేవతామూర్తుల ఆకారాలను చెక్కడం ప్రారంభించారు. ఈ విధంగా చెక్కుతూ ఇప్పటికీ 7 ప్రతిమలను చెక్కారు. గౌతమబుద్ధుడు, రాధాకృష్ణులు, వినాయకుడు, పరశురాముడు, వరాహావతారం, మత్య్సావతారం, కూర్మావతారం ప్రతిమలను చెట్లపై చెక్కారు.ఇవి చూపరులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. పాఠశాల ఆవరణలో తరగతి గదుల సమీపంలో ఉన్న ఒక చెట్టు మొదలు మీద వినాయకుని ప్రతిమను చెక్కారు. అలాగే పాఠశాల చుట్టూ పలువురు దేశ నాయకుల ఫొటోలు, ఇతర చిత్రాలను గీశారు. ఇతని పనితీరు, శ్రద్ధను ప్రిన్సిపాల్ హెచ్. సింహాచలంతోపాటు, మిగతా ఉపాధ్యాయులు అభినందిస్తున్నారు. -
15 అడుగుల కింగ్ కోబ్రా కలకలం
సాక్షి, శ్రీకాకుళం : జిల్లాలోని కంచిలి మండలం పెద్ద పోలేరు గ్రామంలో కింగ్ కోబ్రా కలకలం రేపింది. గత రాత్రి ఓ బైక్‌లోకి చొరబడిన కోబ్రాను స్నేక్ క్యాచర్ సాయంతో పట్టుకున్నారు. అనంతరం కింగ్ కోబ్రాను అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. కాగా 15 అడుగుల పొడవున్న కోబ్రా జనావాసాల్లోకి రావడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. మరోవైపు కోబ్రాను చూసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. పాముతో పోరాటం...! యజమానిని రక్షించి శునకం మరణం చెన్నై : ఇంట్లోకి వచ్చిన పాముతో పోరాడి ఓ శునకం మరణించింది. తమను రక్షించిన పెంపుడు జంతువు మృతి చెందడం ఆ యజమాని కుటుంబాన్ని తీవ్ర వేదనలో పడేసింది. తంజావూరు ఈబి కాలనికి చెందిన ఎలిల్ మారన్(58), మాల దంపతులు రియో, స్వీటీ అనే రెండు శునకాల్ని పెంచుతున్నారు. ఈ పరిస్థితుల్లో బుధవారం రాత్రి ఆ ఇంట్లోకి ఓ పాము చొరబడింది. దీనిని గుర్తించిన రియో ఆ పాముతో పోరాటం చేసింది. ఆ పామును రెండు ముక్కలు చేసి హతమార్చి, తాను మరణించింది. గురువారం ఉదయాన్నే రియో మరణించి ఉండటాన్ని చూసిన యజమాని ఆందోళన చెందాడు. కూత వేటు దూరంలో పాము రెండు ముక్కలుగా పడి మరణించి ఉండటంతో తమను రక్షించి రియో ప్రాణాలు విడిచినట్టు భావించి తీవ్ర మనో వేదనలో పడ్డారు. ఇంటి వద్దే ఆ శునకాన్ని పాతి పెట్టారు.రియో మరణంతో అన్నాహారాల్ని మానేసిన స్వీటి పాతి పెట్టిన ప్రాంతం వద్దే పడుకుని రోదిస్తుండటం ఆ పరిసర వాసుల్ని కలచి వేస్తున్నది. -
‘అమ్మ’కు నగ్న వీడియో బెదిరింపులు..సూసైడ్ నోట్
అంజలీ నువ్వు బాగా చదువుకోవాలిరా.. నాన్న నీపైన పెట్టుకున్న హోప్స్ నువ్వు రీచ్ అవుతావని నా నమ్మకం. ఐషూ నువ్వు నా అమ్మవి.. నీ హెల్త్ బాగులేదని తెలిసి కూడా నిన్ను విడిచి వెళ్లిపోతున్నా.. నువ్వు ఎప్పుడూ భయపడకు. నేనెప్పుడూ నీతోనే ఉంటా.. కాళీ.. బాగా చదువుకో.. బాగా భోజనం చేయి.. నేను ఎలాంటి తప్పు చేయలేదు. విడిచిపోతున్నందుకు నన్ను క్షమించండి.. వాళ్లు ముగ్గురికీ శిక్ష పడాలి. అదే నా చివరి కోరిక. - ఓ తల్లి బిడ్డలను విడిచివెళిపోతూ రాసుకున్న చివరి మాటలివి.. అమ్మా అని పిలుస్తూనే తనపై కన్నేసిన ఓ కామాంధుడి వేధింపులకు తాళలేక ఆత్మహత్యకు పాల్పడిన ఓ వివాహిత మూగ రోదనకు అక్షర రూపమిది.. పక్కింట్లో ఉంటూ కుటుంబానికి స్నేహితునిగా మెలిగిన వ్యక్తి బ్లాక్మెయిల్ చేసి లొంగదీసుకునేందుకు యత్నించడంతో.. అతని బెదిరింపులను భరించలేక ఓ గృహిణి (30) బలవంతంగా ప్రాణాలు తీసుకుంది. పూర్తి వివరాలను తన డైరీలో సూసైడ్ నోట్ రూపంలో రాయడంతో వెలుగులోకి వచ్చిన విషయాలు సంచలనం సృష్టించాయి. సాక్షి, కంచిలి (శ్రీకాకుళం): ఆమెది ఓ చక్కనైన కుటుంబం. భర్త కీలు సత్యనారాయణ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు కంచిలి శాఖలో ఫీల్డ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. ముగ్గురు ముత్యాల్లాంటి పిల్లలు. చుట్టుపక్కల వారిని కూడా సొంత మనుషుల్లా భావించే మంచితనం ఆమెది. ఆ సౌశీల్యాన్నే ఆ దుర్మార్గుడు దుర్వినియోగపరిచాడు. ఆమెకు నరకం చూపించాడు. బ్యాంక్ అధికారి సత్యనారాయణ కంచిలిలో తన కుటుంబంతో ఓ అద్దె ఇంట్లో నివాసముంటున్నారు. ఎన్ఆర్ఈజీఎస్ పథకంలో ఇంజినీరింగ్ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్న మాధవరావు వారి పక్క పోర్షన్లో అద్దెకు ఉండేవాడు. ఆ పక్క పోర్షన్లో ఈశ్వర్‌రెడ్డి, తులసి అనే దంపతులు ఉండేవారు. ఒకేచోట ఉంటున్న వీరి మధ్య స్నేహం ఏర్పడి కలుపుగోలుగా ఉండేవారు. నిందితుడు మాధవరావు మృతురాలిని, ఆమె భర్తను అమ్మా.. నాన్న.. అని పిలిచేవాడని తెలుస్తోంది. మృతురాలు సూసైడ్ నోట్లో రాసిన వివరాల ప్రకారం తనపై కన్నేసిన మాధవరావు.. ఆమె బాత్రూంలో స్నానం చేసే సమయంలో రహస్యంగా వీడియో, ఫోటోలు తీసి, ఆమెను భయపెట్టి లొంగదీసుకొనే ప్రయత్నం చేస్తుండేవాడు. మాధవ్‌కు పక్క పోర్షన్లో ఉండే ఈశ్వర్‌రెడ్డి, తులసి దం పతులు సహకరించారు. ముగ్గురూ కలిసి తరచూ ఈ వీడియో, ఫోటోలను ఇంటర్నెట్లో అప్లోడ్ చేస్తామని భయపెట్టేవారు. కానీ మృతురాలు ఈ విషయాన్ని భర్తకుగాని, కన్నవారికిగాని చెప్పుకోలేక మానసిక క్షోభ అనుభవించేది. మృతురాలి కుమార్తె అంజలి వద్ద వివరాలు సేకరిస్తున్న ఎస్ఐ వెంకటేష్ (ఇన్సెట్లో) నిందితుడు మాధవ్ (ఫైల్) బదిలీపై వెళ్ళినా.. కొన్నాళ్ల తర్వాత మాధవ్ వేరే ప్రాంతానికి బదిలీపై వెళ్లిపోయాడు. అయినా ఆమెకు ఫోన్లు చేస్తూ, భర్త లేని సమయంలో వచ్చి భయపెడుతూ ఉండేవాడు. మాధవ్ పెడుతున్న వేధింపులను భరించలేక వారం రోజుల క్రితం భర్తకు, మిగతా కుటుంబ సభ్యులకు జరిగిందంతా ఆమె వివరించింది. మాధవ్‌ను పిలిచి వార్నింగ్ ఇస్తానని భర్త ఊరడించారు. ఇంతలో రెండు రోజుల క్రితం 24వ తేదీ అర్ధరాత్రి సమయంలో ఎవరో వంటగది కిటికీ వద్దకు వచ్చి పిలిచి తనపై పువ్వు విసరడంతో భర్తకు చెప్పింది. పరిసరాల్లో వెతికినప్పటికీ ఎవరూ కన్పించలేదు. తాజా సంఘటనతో మరింత కుంగిపోయిన బాధితురాలు గురువారం మధ్యాహ్నం భర్త బ్యాంకుకు వెళ్లిన సమయంలో.. పిల్లలకు భోజనం పెట్టి నిద్రపుచ్చిన తర్వాత వంటగదిలోనే సీలింగ్ ఫ్యాన్‌కు చీరతో ఉరిపోసుకొని ఆత్మహత్య చేసుకొంది. తన బలవన్మరణానికి మాధవ్, ఈశ్వర్‌రెడ్డి, తులసి దంపతుల మానసిక వేధింపులే కారణంగా పేర్కొంటూ తన డైరీలో వివరంగా రాసింది. మృతురాలికి భర్తతోపాటు పిల్లలు అంజలి (12), ఐశ్వర్య (10), రెండున్నరేళ్ల బాబు దేవిశ్రీప్రసాద్ ఉన్నారు. శైలజ మృతిపై తండ్రి సుద్దాల జగన్నాథరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొత్తూరు మండలానికి చెందిన ఎన్ఆర్ఈజీఎస్ ఉద్యోగి అల్లాడ మాధవరావు, సంతబొ మ్మాళి మండలానికి చెందిన భార్యభర్తలు తులసి, ఈశ్వర్రెడ్డిలపై ఇన్చార్జి ఎస్ఐ కె.వెంకటేష్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు తెలిసింది. ఆత్మహత్య గురువారం మధ్యాహ్నమే జరిగినప్పటికీ.. రాత్రికి గానీ డైరీ గుర్తించకపోవడంతో శుక్రవారం ఉదయానికి గానీ సంఘటన వెలుగులోకి రాలేదు. -
విషజ్వరాల పంజా
కంచిలి: మండలంలోని చిన్నశ్రీరాంపురం, సాలినపుట్టుగ గ్రామాల్లో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. ఈ రెండు గ్రామాల్లో దాదాపు 70 మంది జ్వరాల బారినపడ్డారు. ప్రభుత్వ వైద్యసేవలు అంతంతమాత్రంగా ఉండటంతో ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నట్టు తెలిపారు. సుమారు పది రోజులుగా ఈ రెండు గ్రామాల్లో జ్వరాలు వ్యాప్తి చెందాయి. వాతావరణంలో వచ్చిన మార్పులే తీవ్రతకు కారణంగా భావిస్తున్నారు. చిన్నశ్రీరాంపురం గ్రామంలో సాగిపల్లి పద్మ, ఎర్ర నీలమ్మ, ఎర్ర నర్సింహులు, గజ్జి తులసీరావు, లండ కేశవరావు, తెలుకల బృందావన్ తదితరులతో క లిసి గ్రామమంతటా సుమారు 50 మంది వరకు పది రోజులుగా జ్వరాలతో అవస్థ పడుతున్నారు. వీరికి స్థానికంగా ఉన్న వైద్య సిబ్బంది ఎటువంటి సేవలందించకపోవటంతో తప్పనిసరి పరిస్థితుల్లో కంచిలి, సోంపేట, పలాస వంటి చోట్ల ప్రైవేటు ఆస్పత్రుల్ని ఆశ్రయిస్తున్నారు. ఒళ్లునొప్పులు కొందరికి, శరీరమంతా ఎరుపురంగు దద్దుర్లు మరికొందరికి ఏర్పడుతున్నాయని చెబుతున్నారు. సాలినపుట్టుగ గ్రామంలో.. అదేవిధంగా మకరాంపురం పంచాయతీ పరిధి సాలినపుట్టుగలోనూ సుమారు 20 మంది వరకు జ్వరాల బారిన పడ్డారు. ఇక్కడ సాలిన మాధవరావు, అతని భార్య కేదారమ్మ, సాలిన జానకిరావు, అతని కుమార్తె శిరీష తదిత రులు జ్వరాలతో బాధపడుతున్నారు. ఈ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలవద్ద మక రాంపురం పీహెచ్సీ వైద్యసిబ్బంది ఆధ్వర్యంలో శనివారం వైద్య శిబిరం నిర్వహించారు. రోగులకు రక్త పరీక్షలు చేశారు. ఈ శిబిరం వద్దకు కేవలం ఆరుగురు రోగులే వచ్చి పరీక్షలు చేసుకొన్నట్లు సిబ్బంది తెలిపారు. గ్రామంలో ఉన్న రోగుల్ని సంప్రదించగా పది రోజులుగా కుటుంబాలతో సహా జ్వరాలతో బాధపడుతున్నామని, కంచిలిలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకొంటున్నామని పేర్కొన్నారు. ఉన్నతాధికారులు స్పందించి రెండు గ్రామాల్లో వైద్యశిబిరాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
ఆటో - కారు ఢీ: ఏడుగురికి గాయాలు
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా కంచిలి వద్ద ఆటో - కారు ఢీ కొన్నాయి. ఆ ప్రమాదంలో ఆటోలోని ఏడుగురు ప్రయాణికులు గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. దీంతో వారిని మెరుగైన వైద్య చికిత్స కోసం పోలీసులు శ్రీకాకుళం తరలించారు. -
కొల్లూరులో దోపిడీ దొంగలు స్వైర విహారం
గుంటూరు జిల్లాలోని వేమూరు మండలం కొల్లూరులో గత అర్థరాత్రి దోపిడి దొంగలు స్వైర విహారం చేశారు. పట్టణంలోని 10 షాపుల్లో చోరీ చేసి, భారీగా సొత్తును అపహరించారు. శనివారం ఉదయం షాపు యజమానులు తమ దుకాణాల్లో దోపిడి జరిగిందని తెలుసుకుని పోలీసులను ఆశ్రయించారు. దాంతో పోలీసుల చోరీకి గురైన షాపులను పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు చెప్పారు. గుంటూరు జిల్లాలో రేపల్లి పట్టణంలో గురువారం అర్థరాత్రి దోపిడి దొంగలు బీభత్సం సృష్టించారు. దాదాపు 10 షాపులను లూటీ చేశారు. దాంతో షాపు యజమానాలు రేపల్లె పోలీసులను ఆశ్రయించారు. పోలీసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని కంచిలి మండలం శ్రీరాంపురంలో గత రాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. వరుసగా మూడిళ్లలో చోరీకి పాల్పడ్డారు. 10 తులాల బంగారంతోపాటు రూ.3 లక్షల నగదును దోపిడి దొంగలు దోచుకుపోయారు. దాంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.