మృతురాలి కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరిస్తున్న ఎస్‌ఐ రాజేంద్రప్రసాద్, ఫ్యానుకు వేళాడుతున్న మృతదేహం
కాశీబుగ్గ: వృద్ధురాలు అనుమానాస్పదంగా సీలింగ్ ఫ్యానుకు వేళాడుతూ మృతి చెందిన సంఘటన పలాస పరిసర ప్రాంతాల్లో సంచలనంగా మారింది. పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిని 23వ వార్డు రాజమ్మకాలనీకి (గాంధీనగర్) చెందిన తంగుడు లక్ష్మి(63) సోమవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమెకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలున్నారు. అందరికీ వివాహాలు చేశారు. లక్ష్మి భర్త కొన్నేళ్ల క్రితం మృతి చెందారు. ఆమె ఇద్దరు కుమారులు రామచంద్రరావు (రాజు), కిశోర్‌లు వేర్వేరు ఇళ్లల్లో కాపరం ఉంటున్నారు. రామచంద్రరావు (రాజు) ఇంట్లో లక్ష్మి ఉంటోంది. జీడిపప్పు వ్యాపారం చేస్తున్న రాజుకు 2007 మార్చిలో శ్రీకాకుళం పట్టణంలోని మంగువారితోట ప్రాంతానికి చెందిన జామి సూర్యారావు కుమార్తె సౌజన్యతో వివాహం జరిగింది. కోడలు సౌజన్య తన పిల్లలతో ఆదివారం శ్రీకాకుళంలోని కన్నవారింటికి చేరుకుంది. తండ్రి సూర్యారావుకు పిల్లలను అప్పగించి నగరంలోని కొత్త వంతెన (నాగావళి)పై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
ఆమె తండ్రి జామి సూర్యారావు శ్రీకాకుళం టూ టౌన్ పోలీసు స్టేషన్‌లో అత్త లక్ష్మి(మృతురాలు), ఆడపడుచులు పావని, ప్రియ వేధింపులకు గురిచేశారని ఫిర్యాదు చేశారు. సోమవారం ఉదయం టిఫిన్ సిద్ధం చేసిన అనంతరం 9:30 నిమిషాలకు ఫ్యానుకు మృతదేహం వేళాడుతున్నట్లు సమాచారం బయటకు రావడంతో విషయం అందరికీ తెలిసింది. కాశీబుగ్గ పోలీసులకు సమాచారం అందింది. ఎస్‌ఐ రాజేంద్రప్రసాద్ మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం పలాస ఆస్పత్రికి తరలించారు. ఆమె కడుపునొప్పిని తాళలేక ఫ్యానుకు ఉరి వేసుకుని మృతి చెందిందని కాశీబుగ్గ సీఐ చంద్రశేఖరం కేసు నమోదు చేశారు. మృతురాలు వృద్ధురాలు కావడంతో ఎత్తైన ఫ్యానును ఎలా ఉరి వేసుకుంటుందని, పూర్తిగా కాలు భూమికి తాకడం చూసిన బంధువులు, పరిసర ప్రాంతీయులు మృతిపై అనుమానాలు వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment