ఈ ఫొటోలో కనిపిస్తున్న మహిళ ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలు. ఈమె పేరు అమంతినా దోస్ శాంటోస్ డువిర్జెమ్. ప్రస్తుతం ఈమె వయసు 123 ఏళ్లు. ఈమె 1900 జూన్ 22న జన్మించింది. ఇటీవలే తన పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకొంది. ప్రస్తుతం ప్రపంచంలో జీవించి ఉన్న అత్యంత వృద్ధురాలు ఈమేనని బ్రెజిల్ అధికారులు కూడా ధ్రువీకరించారు.
బ్రెజిల్‌లోని పరానా రాష్ట్రానికి చెందిన సెర్రాగాయాస్ పట్టణంలో ఈమె ఒంటరిగా తన కోసమే ప్రత్యేకంగా నిర్మించిన ఇంట్లో నివాసం ఉంటోంది. పెండలం దుంపల పిండితో తయారు చేసిన కేకు, ఉడికించిన గుడ్లు ఈమెకు ఇష్టమైన ఆహారం. శతాధిక వృద్ధురాలైనా ఇప్పటికీ ఈమెకు డయాబెటిస్, హై బీపీ వంటి ఆరోగ్య సమస్యలేవీ లేవు. ఇప్పటివరకు మందులు వాడాల్సిన అవసరం తనకు రాలేదని, కనీసం తలనొప్పి కూడా ఎరుగనని చెబుతోందీమె.
ఇంత వయసు వచ్చినా ఇప్పటికీ ఈమె తల నెరవకపోవడం మరో విశేషం. ఈమె నివాసం ఉంటున్న ప్రాంతానికి చెందిన స్థానిక అధికారులు వారం రోజుల ముందుగానే ఈమె పుట్టినరోజు పార్టీని ఘనంగా నిర్వహించారు. తొలిసారిగా పింఛను కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు అధికారులు ఈమెకు జనన ధ్రువీకరణ పత్రాన్ని జారీచేశారు. అందువల్ల గిన్నిస్‌బుక్ ఈమెను గుర్తించలేదు.
గిన్నిస్‌బుక్ రికార్డుల ప్రకారం ప్రస్తుతం అత్యంత వృద్ధమహిళ వయసు ఈ ఏడాది మార్చి 4 నాటికి 116 ఏళ్లు. అమెరికాలో స్థిరపడిన ఆ స్పానిష్ మహిళ పేరు బ్రాన్యాస్ మోరేరా. అయితే, గిన్నిస్ అధికారులు గుర్తించినా, లేకున్నా అమంతినానే ప్రపంచంలోని అత్యంత వృద్ధ మహిళ అని బ్రెజిల్ అధికారులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment