
కడప కల్చరల్ : కడప నగరం శాటిలైట్‌సిటీ వద్దగల ఇంట్లో నెల రోజుల క్రితం ఓ వృద్దురాలు మరణించింది. ఆమెకు పెళ్లికాని 45–55 సంవత్సరాల వయస్సుగల ఇద్దరు కుమారులు మినహా ఇంకెవరూ లేరు. ఆమెకు వచ్చే పెన్షన్‌తోపాటు అక్కడ, ఇక్కడ చిన్న చితకా పనులు చేసి వారిని పోషించేది. నెల కిందట ఆమె మరణించింది. ఈ విషయం బయట ఎవరికీ తెలియదు. ఇద్దరు కుమారులు ఎవరితో మాట్లాడేవారు కాదు.
తల్లి మరణించినా కూడా శవంతోపాటు అక్కడే ఉండిపోయారు. ఒక కుమారుడు మూడు రోజుల తర్వాత ఉరి వేసుకుని మరణించాడు. దుర్వాసన రావడంతో ఆ ప్రాంతీయులు పోలీసుల ద్వారా ఇంటిని పరిశీలించగా విషయం తెలిసింది. మున్సిపల్ సిబ్బంది ద్వారా మృతదేహాలను ఖననం చేయించారు. మిగిలిన పెద్ద కుమారుడు జనార్దన్ ఇల్లు వదిలి బయటే తిరుగుతూ ఉండిపోయాడు. ఈ నేపథ్యంలో స్థానికుల్లో ఒకరు పోరుమామిళ్లలోగల శ్రీ వివేకానంద ఆశ్రమ నిర్వాహకులు పాపిజెన్ని రామకృష్ణకు సమాచారం ఇచ్చారు.
ఆయన తన బృందంతో వచ్చి కడప నగరం చెన్నూరు బస్టాండులో ఉండిన జనార్దన్‌ను వెతికి పట్టుకుని తన ఆశ్రమానికి తరలించారు. మొదట ఆశ్రమానికి వచ్చేందుకు అంగీకరించలేదు. మొత్తానికి ఆయనను ఒప్పించి ప్రత్యేక వాహనంలో ఆశ్రమానికి తీసుకెళ్లారు. మానసిక వైద్యం చేయించి శుభ్రంగా తీర్చిదిద్దారు. జనార్దన్ ప్రస్తుతం వ్యక్తులను గుర్తు పెట్టి మాట్లాడే స్థితికి వచ్చాడు. ఈ అవకాశం తనకు లభించడం సంతోషంగా ఉందని ఆశ్రమ నిర్వాహకులు రామకృష్ణ హర్షం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment