టైతో ఉరేసుకున్న విద్యార్థి.. | Student Commits Suicide With Tie In Srikakulam | Sakshi
Sakshi News home page

టైతో ఉరేసుకున్న విద్యార్థి

Published Thu, Sep 12 2019 11:39 AM | Last Updated on Thu, Sep 12 2019 11:39 AM

Student Commits Suicide With Tie In Srikakulam - Sakshi

మృతుడు ప్రేమ్‌సాయి పట్నాయక్‌

సాక్షి, శ్రీకాకుళం రూరల్‌: శ్రీకాకుళం మండల పరిధిలోని శాస్త్రులపేట శివారులో ఉన్న ఏపీ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాల (మహాత్మా జ్యోతిబా పూలే) విద్యాలయంలో ఎనిమిదో తరగతి చదువుతున్న ప్రేమసాయి పట్నాయక్‌ (14) బుధవారం వేకువ జామున ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విద్యార్థి స్వస్థలం టెక్కలి పట్టణంలోని రాచవీధి. తల్లి చిన్నప్పుడే మృతి చెందింది. తండ్రి రాంప్రసాద్‌ పట్నాయక్‌ చదివిస్తున్నాడు. విద్యార్థి తండ్రి రెండో వివాహం చేసుకున్నాడు. ఆమెకు ఒక కుమారుడు ఉన్నాడు. ఆమెతో ప్రేమసాయి నిత్యం వివాదాస్పదంగా ఉంటున్నట్లు సమాచారం. విద్యార్థి మృతికి గల కారణం  కుటుంబంలో గడిచిన కొన్నేళ్లుగా కలహాలు ఎక్కువగా ఉండటమేనని ఉపాధ్యాయులు చెబుతున్నారు. మరోవైపు స్కూల్‌ యాజమాన్యం వేధింపులు కూడా ఉన్నాయనే వాదన వినిపిస్తోంది.

ఎలా జరిగిందంటే..
మంగళవారం రాత్రి ఎనిమిదో తరగతికి చెందిన 40 మంది విద్యార్థులతో స్టడీ అవర్స్‌కు వెళ్లి 9.30 గంటలకు తిరిగి వచ్చి డార్మింటరీలో అందరితోపాటే ప్రేమసాయి  నిద్రపోయాడు. సమయం ఉదయం 5 గంటల 30 నిమిషాలైంది. రోజూ లాగానే యోగా టీచర్‌ వచ్చి విజల్‌  వేయడంతో విద్యార్థులంతా నిద్ర మేల్కోన్నారు. కాలకృత్యాలు తీర్చుకునేందుకు ఓ విద్యార్థి వెళ్లాడు. చివరి బాత్‌రూంలో ఉన్న ట్యాప్‌ నుంచి వాటర్‌ పడుతున్న శబ్ధాన్ని గమనించాడు. నీటిని కట్టేందుకు బాత్‌రూం తలుపు తీయబోయాడు. లోపల గెడ పెట్టి ఉండడంతో రంధ్రం గుండా చూసేసరికి తోటి విద్యార్థి అందులో వేళ్లాడి ఉండం గమనించాడు. తోటి విద్యార్థులతో కలిసి ఈ విషయాన్ని యోగా టీచర్‌కు, వాచ్‌మేన్‌కు చేరవేశాడు.

ఆత్మహత్య చేసుకున్న తీరు ఇదీ..
స్కూల్‌ యూనిఫాంకు సంబంధించిన ఎరుపురంగు టైను మెడకు కట్టుకొని డార్మింటరీలోని 5 నంబర్‌ (చివరి) టాయిలెట్‌లో ఉన్న ట్యాప్‌ గుండా పైకి ఎక్కాడు. 12 అడుగుల ఎత్తులో ఉన్న కిటికీ గ్రిల్స్‌కు టైను కట్టి దానిని మెడకు బిగుంచుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెల్సుకున్న స్కూల్‌ యాజమాన్యం వెంటనే రూరల్‌ పోలీసులకు సమాచారం అందజేశారు. ఆత్మహత్యగా పోలీసులు కేసు నమోదు చేశారు.  రూరల్‌ ఎస్‌ఐ లక్ష్మణరావు మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించారు.

స్కూల్లో జరిగే ప్రతి ఫంక్షన్‌లోనూ..
స్కూల్లో జరిగిన ప్రతి ఫంక్షన్‌లోనూ ప్రేమ్‌సాయి పట్నాయక్‌ ముందు ఉండేవాడని తోటి విద్యార్థులు చెబుతున్నారు. జాతీయ గీతాలు ఎక్కువగా  ఆలపించేవాడన్నారు. ఈ నెల 14న హిందీ దివాస్‌కు సంబంధించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రెండు రోజులుగా  ప్రాక్టీస్‌ చేస్తున్నట్లు తెలిపారు.

ప్రారంభమైన 9 నెలలకే..
మహాత్మాజ్యోతిభా పూలే స్కూల్‌ ఈ ఏడాది జనవరిలో ప్రారంభమైంది. 5వ తరగతి నుంచి పదో తరగతి వరకు 410 మంది విద్యార్థులున్నారు. 2019 మార్చి నుంచి  తరగతులు ప్రారంభించారు. ఇంతలో ఈ అఘాయిత్యం జరగడంతో ఉపాధ్యాయులు, విద్యార్థుల్లో భయాందోళనలు మొదలయ్యాయి. ఏడు, ఎనిమిది, తొమ్మిది తరగతులకు సంబంధించిన రెండో బ్లాక్‌లోనే ప్రేమ్‌సాయి  ఆత్మహత్య చేసుకోవడంతో ఆ బ్లాక్‌లో ఉండేందుకు విద్యార్థులంతా భయాందోళన చెందుతున్నారు.

చూడగానే భయం వేసింది 
టాయిలెట్స్‌కు వెళ్లి తిరిగి వస్తుండుగా చివరి బాత్‌రూంలో ట్యాప్‌ నుంచి వాటర్‌ పడుతున్న శబ్ధం వచ్చింది. వెంటనే వెనక్కి వెళ్లి చూశాను. అప్పటికే ప్రేమ్‌సాయి పట్నాయక్‌ కిటికీ ఊచలకు వేళాడుతూ కనబడ్డాడు. భయంతో పరుగు తీస్తూ మా టీచర్‌కు, వాచ్‌ మేన్‌కు చెప్పాను.
- కె.రామ్మోహన్‌ (తోటి విద్యార్థి)

పొద్దున్నే నిద్ర లేపుతాను
ప్రతి రోజు పొద్దున్నే విద్యార్థులందరికీ నేనే నిద్రలో నుంచి లేపుతాను. వేకువ జామున 5.30 కల్లా డార్మింటరీకి వెళ్లి విజిల్‌ వేయడంతో అందరూ గ్రౌండ్‌కు వచ్చేస్తారు. ఎవరైనా సిక్‌లో ఉంటే క్లాస్‌ లీడర్‌తో మాకు నేరుగా సమాచారం వస్తే వారిపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తాం.    
– ఎం.మధుసూదనరావు, పీఈటీ

హాస్టల్‌ సిబ్బందికి షోకాజ్‌ నోటీసులు
విద్యార్థి మృతిపై జిల్లా యంత్రాంగం స్పందించింది. ప్రిన్సిపాల్‌ యు.గణపతి, హౌస్‌ టీచర్‌ జి.వి.రామ్‌ప్రసాద్, వాచ్‌మేన్‌ వి.సింహాచలంపై జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాలు మేరకు షోకాజ్‌ నోటీసులు జారీ అయ్యాయి. వీరి ముగ్గురికి జిల్లా వెనుకబడుల తరగతుల సంక్షేమ శాఖాధికారి కృతిక బుధవారం రాత్రి షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు.  
- విద్యార్థి ప్రేమ్‌సాయి పట్నాయక్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement