శేఖర్ మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబ సభ్యులు మునికోటి శేఖర్(ఫైల్)
శ్రీకాకుళం, ఎల్.ఎన్.పేట: ఉద్యోగం చేసి కుటుంబాన్ని ఆదుకుంటాడని కుమారుడిపై ఎన్నో ఆశలు పెంచుకున్న ఆ తల్లిదండ్రులకు దేవుడు తీరని వేదన మిగిల్చాడు. కొడుకు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో వారి రోదన ఆపడం ఎవరి తరము కావటం లేదు. బెంగళూరులో జరిగిన నేవీ ఎంపికల్లో పాల్గొని ముందురోజే ఇంటికి వచ్చిన కొడుకు మరిలేడని తెలుసుకుని తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. పదో తరగతి నుంచి అన్ని ఫలితాల్లో ప్రథమ స్థానంలోనే నిలుస్తూ... చదువులో రాణించే కొడుకు ఏదైనా మంచి ఉద్యోగం సాధిస్తాడని ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులకు విషాదమే మిగిలింది. మండలంలోని మోదుగువలస కాలనీకి చెందిన మునికోటి బాబూరావు, అరుణ దంపతుల కుమారుడు మునికోటి శేఖర్(19) మంగళవారం చెరువుకు స్నానానికి వెళ్లి మృతి చెందాడు. మోదుగువలస గ్రామానికి సమీపంలో ఉన్న కోనేరులో స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు.
ఉదయం చెరువుకు స్నానానికి వెళ్లిన శేఖర్ ఎప్పటికీ ఇంటికి రాకపోవడంతో కొడుకు కోసం గ్రామంలో ఆరా తీశారు. స్నేహితులను అడిగినా తమకు తెలియదని, చెరువు వద్ద శేఖర్ బట్టలు, చెప్పులు ఉన్నాయని చెప్పడంతో అనుమానం వచ్చి వెళ్లి చూడగా చెరువు గట్టుపైనే బట్టలు, చెప్పులు ఉన్నాయి. దీంతో చెరువులో గాలించగా మృతదేహం లభించిందని స్థానికులు చెప్పారు. బెంగళూరులో జరిగిన నేవీ ఎంపికలకు వెళ్లిన శేఖర్ సోమవారం సాయంత్రానికి ఇంటికి చేరుకున్నాడు. ఇతడు విజయనగరంలోని మహారాజ ఇంజినీరింగ్ కాలేజీలో ప్రథమ సంవత్సరం ఇంజినీరింగ్ చదువుతున్నాడు. మంగళవారం ఉదయాన్నే కాలేజీకి వెళ్లిపోతానని ఇంట్లో చెప్పాడు. ఊరిలో అమ్మవారి వారాలు జరుగుతున్నాయని, మరలా నువ్వు ఎప్పుడు వస్తావో ఈరోజు వారాలు అయిపోతే బుధవారం ఉదయం వెళుదువులే అని చెప్పడంతో ఉండిపోయాడని తల్లిదండ్రులు రోదిస్తున్నారు. బాబూరావు, అరుణ దంపతుల పెద్ద కుమార్తె శ్రీలతకు నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. రెండో కుమార్తె సుధారాణి డిగ్రీ వరకు చదువుకుంది. ఈ సంఘటనపై తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని సరుబుజ్జిలి పోలీస్ స్టేషన్ హెచ్‌సీ రమణమూర్తి చెప్పారు. మృతదేహానికి శవపంచనామా చేసి పోస్టుమార్టం కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment