Actor Rajashekar Emotional Comments On Shekar Movie, Deets Inside - Sakshi
Sakshi News home page

Rajashekar On Sekhar Movie: జీవితం అయిపోయింది.. సినిమాలు చేయలేననుకున్నా: రాజశేఖర్‌

Published Thu, May 19 2022 5:32 PM | Last Updated on Thu, May 19 2022 6:08 PM

Rajashekar Talk About Shekar Movie - Sakshi

కోవిడ్‌ టైమ్‌లో చావు అంచులదాకా వెళ్లి వచ్చాను. 75 కేజీలు ఉన్న నేను 62 కేజీలకు తగ్గాను .ఇక జీవితం అయిపోయింది..సినిమాలను చేయలేను అనుకున్నా. కానీ నా ఫ్యామిలీ సపోర్ట్‌తో పాటు అభిమానుల ప్రేమతో మళ్లీ కోలుకున్నా.మళ్లీ ఒక్కొక్కటిగా నేర్చుకొని ‘శేఖర్‌’ చిత్రంలో నటించాను . ఈ చిత్రం నాకు చాలా స్పెషల్‌’అని హీరో రాజశేఖర్‌ అన్నారు.  రాజశేఖర్‌ హీరోగా, ముస్కాన్, ఆత్మీయ రాజన్‌ హీరోయిన్లుగా శివానీ రాజశేఖర్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘శేఖర్‌’. జీవితా రాజశేఖర్‌ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం మే 20న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా రాజశేఖర్‌ గురువారం మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..

మీ కెరీర్‌లో ఎప్పుడులేనంతగా.. ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో మా సినిమాను బతికించండి అని ప్రేక్షకులను వేడుకున్నారు.ఎందుకు?
ఇంతవరకు మా వెనక ప్రాపర్టీ ఉంది. కాబట్టి సినిమాలు ఆడినా ఆడకపోయినా..పెద్దగా బాధ అనిపించేది కాదు. కానీ ఇప్పుడు శేఖర్‌ సినిమా సక్సెస్‌ అయితేనే అప్పుల నుంచి బయటపడతాం. లేదంటే అప్పుల పాలవుతాం. అందుకే నాకు టెన్షన్‌ ఎక్కువవుతుంది. ఓ ఢిపరెంట్‌ సినిమా ఎంచుకొని వచ్చాం. సినిమా బాగుందని తెలిసిన తర్వాతే థియేటర్స్‌ వెళ్లి చూడండి. కానీ త్వరగా వచ్చి చూడండి. ఈ టెన్షన్స్‌ కారణంగానే మనసులోనుంచి ఆటోమేటిగ్‌గా ఈ సినిమాను బతికించండి అని వచ్చింది. 

మీ గత సినిమాలతో పోలిస్తే.. శేఖర్‌లో కొత్తగా ఏం ఫీలయ్యారు?
ఆర్టిస్టుగా చాలా సంతృప్తి చెందాను. శేఖర్‌ క్యారెక్టర్‌లో ఉన్న ఎమోషన్‌, బాధను చూపించడానికి బాగా చేశాను.

 ఈ చిత్రంలో మీ పాత్ర మేకోవర్‌ గురించి?
55-60 ఏళ్ల వయసు ఉన్న క్యారెక్టర్‌ నాది. ఈ క్యారెక్టర్‌కి కొత్త లుక్‌ ఉంటే.. సినిమాకు ప్లస్‌ అవుతుందని ఆలోచించి.. సాల్ట్‌ అండ్‌ పెప్పర్‌ గెటప్‌లో వచ్చాం. ఆ గెటప్‌ బాగుందని చాలా మంది చెప్పారు. అయినా కొంచెం భయం ఉండేది. ఇటీవల ట్రైలర్‌ విడుదలైన తర్వాత నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సెన్సార్‌ బోర్డు సభ్యులు కూడా సినిమా చూసి చాలా మెచ్చుకున్నారని జీవిత చెప్పారు. దీంతో నాకు చాలా ధైర్యం వచ్చింది.

జీవిత దర్శకత్వం గురించి?
షూటింగ్‌కి వెళ్తే మేమిద్దరం ఒక డైరెక్టర్‌, ఆర్టిస్టుగానే ఉంటాం. కానీ ప్రతి విషయంపై ఇద్దరం చర్చింకుంటాం. ఆమె గొప్ప దర్శకురాలు. అందరి నుంచి కావాల్సిన పనిని రాబట్టుకుంటుంది.  

మలయాళం మూవీ జోసెఫ్‌ మూవీని రీమేక్‌గా ఎంచుకోవడానికి కారణం?
నా గత సినిమాలు ఒక్కసారి తలంబ్రాలు, అంకుశం,ఆహుతి, మగాడు, మా అన్నయ్య, సింహరాశి.. ఇవన్నీ రీమేక్‌ సినిమాలే. అన్ని సూపర్‌ హిట్‌ అయ్యాయి. అందుకే జోసెఫ్‌ మూవీ ఎంచుకున్నాం. మలయాళంలో పెద్ద సక్సెస్‌ అయిన సినిమా అది. నేను గతంలో చాలా మళయాల మూవీలను రీమేక్‌ చేసి హిట్‌ కొట్టాను. రీమేక్‌లకు సక్సెస్‌ గ్యారెంటీ ఎక్కువగా ఉంటుంది. అందుకే జోసెఫ్‌ని సెలెక్ట్‌ చేశాం.
 
ఈ చిత్రంలో మీ కూతరు శివాణి నటించారు. ఆమె నటన గురించి?
మొదట ఈ చిత్రంలో కూతురి పాత్రలకు శివాణి, శివాత్మికలను కాకుండా వేరే వాళ్లను తీసుకుందామని అనుకున్నాం. ఈ విషయం జీవితతో చెబితే.. లేదంటే..మన ఇద్దరి కూతుళ్లలో ఎవరినో ఒకరిని పెడితే..ఆడియన్స్‌ ఈజీగా కనెక్ట్‌ అవుతారు. మీ కూతురు అని చెప్పడానికి ఎక్కువ సీన్స్‌ పెట్టాల్సిన అవసరం ఉండదు. చూడడానికి బాగుంటదని చెప్పింది. నేను ఓకే అన్నారు. ఇద్దరిలో ఎవరు చేస్తారని అడిగితే..ఇద్దరు చేస్తామని చెప్పారు. చివరకు అక్క కోసం శివాత్మిక త్యాగం చేసింది(నవ్వుతూ..)

మీ పాత్రలకు సాయి కుమార్‌ గారు డబ్బింగ్‌ చెప్పేవారు. ఈ మధ్యలో బ్రేక్‌ ఇచ్చినట్లు ఉన్నారు కదా?
మధ్యలో 10 ఏళ్లు సాయికుమార్‌ డబ్బింగ్‌ చెప్పలేదు. గత పదేళ్లుగా శ్రీనివాస్‌ మూర్తి నా పాత్రకు డబ్బింగ్‌ చెప్పారు. ఎవరు డబ్బింగ్‌ చెప్పారో ఆడియన్స్‌ కూడా గుర్తుపట్టకుండా ఇద్దరు బాగా చెప్పారు. శేఖర్‌ చిత్రానికి సాయికుమార్‌ డబ్బింగ్‌ చెప్పాడు. 37 ఏళ్ల నా సినీ కెరీర్‌లో 27 ఏళ్లు సాయికుమార్‌, 10 ఏళ్లు శ్రీనివాస్‌ మూర్తి నా పాత్రలకు డబ్బింగ్‌ చెప్పారు. 

కోవిడ్‌ టైమ్‌లో చాలా బ్యాడ్‌ సిచ్యుయేషన్‌ని ఫేస్‌ చేశారు కదా?
అవును. చావు అంచులదాకా వెళ్లి వచ్చాను. 75 కేజీలు ఉన్న నేను 62 కేజీలకు తగ్గాను. మళ్లీ కోలుకుంటానని అనుకోలేదు. ఐసీయూలో ఉన్నప్పుడు బోర్‌ కొట్టకుండా ఉండడానికి అక్కడ టీవీ పెట్టారు. సినిమాలో హీరోలు చేస్తున్న ఫైట్స్‌, డాన్స్‌లు చూసి.. నేను కూడా ఇలా ఉండేవాడిని.. ఇప్పుడిలా అయిపోయిందే అని బాధపడేవాడిని. ఇక జీవితం అయిపోయిందని అనుకున్నాను. ఇక సినిమాలు చేయలేనని అనుకొని జోసెఫ్‌ రీమేక్‌ హక్కులను వేరే వాళ్లకు ఇవ్వమని చెప్పాను. కానీ జీవితతో పాటు అందరూ.. నువ్వు కోలుకుంటావని భరోసా ఇచ్చారు. సినిమాపై ఉన్న కసితో ఒక్కొక్కటిగా మళ్లీ నేర్చుకొని ‘శేఖర్‌’ మూవీ చేశాను. నా కెరీర్‌లో చేసిన సినిమాలన్నింటిలో ‘శేఖర్‌’మూవీ చాలా స్పెషల్‌. ఇంత ఎనర్జిటిక్‌ పాత్రను మళ్లీ చేయలేను అనుకుంటా.

ఒరిజినల్‌ మూవీతో పోలిస్తే ‘శేఖర్‌’లో ఏమైనా మార్పులు చేశారా?
పెద్దగా మార్పులు చేయలేదు. మలయాళంలో కొంచెం పేస్‌ స్లోగా ఉంటుంది. తెలుగులో అలా ఉంటే పనికిరాదు. మన తెలుగు ఆడియన్స్‌  తగ్గట్టుగా మార్చుకున్నాం. అలాగే మలయాళం చిత్రంలో కొన్ని సీన్స్‌కి వివరణ ఉండదు..ఇందులో ఆడియన్స్‌కు అర్థం అయ్యేలా వివరణ ఇచ్చాం. నిడివి కూడా ఒరిజినల్‌తో పోలిస్తే.. ఈ చిత్రం నిడివి తక్కువ. 

మీ అమ్మాయి(శివాణి) పాత్రను ఏమైనా పెంచారా?
లేదు. మా అమ్మాయి కదా అని పాత్రను పెంచితే.. సినిమాను చెడగొట్టినవాళ్ల అవుతాం. అలా చేయలేదు.

అనూప్‌ రూబెన్స్‌ మ్యూజిగ్‌ గురించి?
ఈ చిత్రానికి సంగీతం చాలా ముఖ్యం. అనూప్‌ రూబెన్స్‌ చాలా మంచి మ్యూజిగ్‌ ఇచ్చారు. ఈ చిత్రంలో నా పాత్ర స్మోకింగ్‌ చేయాలి. కానీ నా అనారోగ్యం కారణంగా స్మోకింగ్‌ చేయొద్దని వైద్యులు చెప్పారు. అనూప్‌ తన మ్యూజిగ్‌తో ఈ సీన్స్‌ మ్యానేజ్‌ చేశారు. 

కోవిడ్‌ టైమ్‌లో మీ ఇద్దరు కూతుళ్లు దగ్గర ఉండి మీ బాగోగులు చూశారు.ఎలా అనిపించింది?
నా తమ్ముడికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. వాడే నాతో ‘మీ ఇద్దరు కూతుళ్లే నిన్ను కాపాడారు.గుర్తుపెట్టుకో. నా కొడుకులు కూడా నన్ను అలా చూసుకోలేదు’అన్నాడు. నిజంగా నా కూతుళ్లు, జీవిత ఆ సమయంలో నన్ను బాగా చూసుకున్నారు. కోవిడ్‌ టైమ్‌లో మేం నలుగురం ఐసీయూలోనే ఉండిపోయాం. నేను ఇలా లేస్తే చాలు..డాడీ ఏం కావాలి అంటూ ఇద్దరు వచ్చేవాళ్లు. కొడుకులు తక్కువ అని నేను చెప్పను కానీ.. కూతుళ్లు మాత్రం ఎక్కువే. 

మీ నలుగురు కలిసి సినిమా చేసే అవకాశం ఉందా?
ఉంది. కొన్ని కథలు కూడా వచ్చాయి. ‘దొరసాని’ ఫేమ్‌ మహేందర్‌ కూడా మా నలుగురితో ఓ సబ్జెక్ట్‌ అనుకుంటున్నాడు.మేం కొన్ని మార్పులు చెప్పాం. అలాగే ప్రవీణ్‌ సత్తారు కూడా గరుడవేగ పార్ట్‌2లో ఇద్దరు కూతుళ్లను యాడ్‌ చేసే ప్లాన్‌లో ఉన్నాడు. భవిష్యత్తులో తప్పుకుండా మేమంతా కలిసి సినిమా చేస్తాం. 

ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో సుకుమార్‌ గారు మాట్లాడుతూ..మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొనే సినిమాల్లోకి వచ్చామని చెప్పారు.ఎలా అనిపించింది?
చాలా హ్యాపీగా ఫీలయ్యా. నాకు ఇన్ని రోజులు ఈ విషయం తెలియదే అని ఫీలయ్యా(నవ్వుతూ..)

కొత్త సినిమాలు ఏం ఉన్నాయి?
త్వరలోనే ఓ పెద్ద అనౌన్స్‌మెంట్‌ ఉంటుంది. పాన్‌ ఇండియా మూవీకి ప్లాన్‌ చేస్తున్నాం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement