టైటిల్ : శేఖర్
నటీనటులు : రాజశేఖర్, ముస్కాన్, ఆత్మీయ రాజన్, శివాణి, సమీర్, అభినవ్ గోమతం, కన్నడ కిశోర్ తదితరులు
నిర్మాతలు: బీరం సుధాకర రెడ్డి, బొగ్గరం వెంకట శ్రీనివాస్, శివాణి రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్
దర్శకురాలు: జీవిత రాజశేఖర్
సంగీతం: అనూప్ రూబెన్స్
సినిమాటోగ్రఫి:మల్లికార్జున్ నారగాని
విడుదల తేది:మే 20, 2022
యాంగ్రీస్టార్ రాజశేఖర్.. రెండు దశాబ్దాల క్రితం స్టార్ హీరోల్లో ఒక్కడు. అప్పట్లో ఆయన సినిమాలు రికార్డులు సృష్టించాయి. ఆ తర్వాత ఆయన చిత్రాలకు పెద్ద ఆదరణ దక్కలేదు. ఇక రాజశేఖర్ పని అయిపోతుదన్న సమయంలో గరుడవేగ, కల్కీ చిత్రాలతో మళ్లీ పుంజుకున్నాడు. ఆ చిత్రాలు విజయవంతం కావడంతో..అదే కిక్‌తో ‘శేఖర్’చిత్రంలో నటించారు. మలయాళం మూవీ జోసెఫ్ చిత్రం రీమేక్ ఇది. రాజశేఖర్ సతీమణి జీవిత ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఎట్టకేలకు ఈ శుక్రవారం(మే 20) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, ట్రైలర్ సినిమాపై ఆసక్తిపెంచాయి. దానికి తోడు ప్రమోషన్స్ కూడా భారీగా చేయడంతో ‘శేఖర్’చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలను ‘శేఖర్’ అందకున్నాడా? లేదా?, ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారు? రివ్యూలో చూద్దాం.
కథేంటంటే..
శేఖర్(రాజశేఖర్)..ఓ రిటైర్డ్ పోలీసు అధికారి. క్రైమ్ ఇన్వెస్టిగేషన్‌లో దిట్ట. నేరస్తులను ఎవరైనా సరే..ఇట్టే కనిపెట్టేస్తాడు. ఓ మర్డర్ కేసులో పోలీసులు అతని సహాయం తీసుకుంటారు. అదే సమయంలో అతని భార్య ఇందు(ఆత్మీయ రాజన్) నుంచి విడిపోయిన జ్ఞాపకాలు శేఖర్‌ని వెంటాడుతుంటాయి. ఓ రోజు ఇందు రోడ్డు ప్రమాదానికి గురైందని తెలియడంతో శేఖర్ ఆస్పత్రికి వెళ్తాడు. దురదృష్టవశాత్తు ఇందు చికిత్స పొందుతూ ఆస్పత్రిలోనే మృతి చెందుతుంది. ఈ కేసుపై శేఖర్‌కి అనుమానం రావడంతో వెంటనే విచారణ ప్రారంభిస్తాడు. ఇన్వెస్టిగేషన్‌లో ఆయన భార్య రోడ్డు ప్రమాదంలో చనిపోలేదని, ఎవరో హత్య చేశారని తెలుస్తుంది.అసలు ఇందుని హత్య చేసింది ఎవరు? ఎందుకు చేశారు? ఈ కేసును శేఖర్ ఎలా ఛేదించాడు? ఇందు నుంచి శేఖర్ విడిపోవడానికి కారణం ఏంటి? అనేది తెలియాలంటే.. థియేటర్స్‌లో ‘శేఖర్’ సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
క్రైమ్ థ్రిల్లర్, ఇన్వెస్టిగేటివ్ చిత్రాలు అంటే అన్ని వర్గాల ప్రేక్షకులకు ఇష్టమే. అందుకే ఆ జానర్ చిత్రాలు ఎక్కువగా హిట్ అవుతుంటాయి. కథ, కథనం ట్విస్టులతో ఉత్కంఠంగా సాగితేనే ఆ చిత్రాలను ప్రేక్షకులు ఇష్టపడతారు. ‘శేఖర్’లో ఆ ఉత్కంఠత కాస్త తగ్గింది. 2018లో వచ్చిన మలయాళ చిత్రం జోసెఫ్..అప్పట్లో సూపర్ హిట్. కానీ ఈ మధ్య కాలంలో ఓటీటీల ప్రాధాన్యత పెరగడం.. క్రైమ్ థ్రిల్లర్‌తో పాటు అన్ని రకాల జానర్లకు సంబంధించిన కంటెంట్ అందుబాటులో ఉండడంతో, ఆ చిత్రానికి రీమేక్‌గా వచ్చిన ‘శేఖర్’ కథ ప్రేక్షకుడికి కొత్త అనుభూతికి అందించడం కాస్త కష్టమే. అయితే దర్శకురాలు జీవిత మాత్రం.. కథను తీర్చిదిద్దిన విధానం బాగుంది. మాతృకకు ఎలాంటి భంగం కలకుండా..తెలుగు ప్రేక్షకుల తగ్గట్టుగా చిన్న చిన్న మార్పులు చేశారు.
ఫస్టాఫ్ అంతా ఎమోషనల్‌గా సాగుతుంది. తండ్రి,కూతుళ్లు(రాజశేఖర్, శివాణి) మధ్య వచ్చే సీన్స్ హృదయాలను హత్తుకుంటాయి. అలాగే భార్యతో విడిపోవడానికి దారితీసిన కారణాలు, ఒకరి బాగు కోసం మరోకరు చేసే త్యాగం..అందరిని ఆకట్టుకుంటాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరిపోవడమే కాకుండా.. సెకండాఫ్‌పై క్యూరియాసిటీని పెంచుతుంది. అసలు కథంతా సెకండాఫ్‌లోనే మొదలవుతుంది. అయితే..హీరో చేసే ఇన్వెస్టిగేషన్ కాస్త సినిమాటిక్‌గా అనిపిస్తుంది. వ్యవస్థలో ‘ఆర్గనైజ్‌డ్ మెడకల్ క్రైమ్’ ఎలా జరుగుతుందో ఈ సినిమా ద్వారా కళ్లకు కట్టినట్లు చూపించారు. వైద్యరంగంలో ఇలాంటి స్కామ్‌లు కూడా ఉంటాయా? అని సగటు ప్రేక్షకుడు ఆలోచిస్తాడు. స్కామ్‌ని బయటపెట్టేందుకు హీరో తీసుకునే సంచలన నిర్ణయం కాస్త సినిమాటిక్‌గా అనిపించినా.. క్లైమాక్స్‌లో ప్రకాశ్ రాజ్ ఇచ్చిన వివరణతో ప్రేక్షకుడు సంతృప్తి చెందుతాడు. అయితే సెకండాఫ్‌లో కథనం కాస్త నెమ్మది సాగడం, ఇన్వెస్టిగేషన్ కూడా రొటీన్‌గా ఉండడం ఈ సినిమాకు మైనస్. మలయాళం మూవీ జోసెఫ్ చూడకుండా, ఈ చిత్రాన్ని చూసే మాత్రం కచ్చితంగా నచ్చుతుంది.
ఎవరెలా చేశారంటే..
యాంగ్రీస్టార్ రాజశేఖర్ నటనలో ఇప్పటికి జోష్ తగ్గలేదు. రిటైర్డ్ కానిస్టేబుల్ శేఖర్ పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. ఎమోషనల్ సీన్స్‌లో అయితే అద్భుతంగా నటించారు. ఆయన కంటతడి పెట్టిన ప్రతిసారి.. ప్రేక్షకుడి హృదయం బరువెక్కుతుంది. ఫ్లాష్‌బ్యాక్ సీన్స్‌లో తెరపై యంగ్‌గా, స్టైలీష్‌గా కనిపించాడు. ‘కిన్నెర’ పాటలో అయితే ఒకప్పటి రాజశేకర్‌ని చూస్తారు. ఇక హీరో భార్య ఇందు పాత్రకి ఆత్మీయ రాజన్ న్యాయం చేశారు. శేఖర్ కూతురు గీత పాత్రలో శివాణి ఆకట్టుకుంది. ఆమె పాత్ర నిడివి తక్కువే అయినా.. సినిమాకు కీలకం. హీరో స్నేహితులుగా సమీర్, అభినవ్ గోమతం, కన్నడ కిశోర్, ప్రియురాలు కిన్నెరగా ముస్కాన్ ఆకట్టుకున్నారు. పొసాని కృష్ణమురళితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.
ఇక సాంకేతిక విషయానికొస్తే.. అనూబ్ రూబెన్స్ సంగీతం ఆకట్టుకుంది. చిన్ని చిన్ని ప్రాణం.. కిన్నెర పాటలతో మిగిలిన సాంగ్స్ కూడా బాగున్నాయి. ఈ పాటలన్నీ కథతో సాగుతాయే తప్ప..తెచ్చిపెట్టినట్లు ఉండవు. నేపథ్య సంగీతం పర్వాలేదు. మల్లికార్జున్ నారగాని సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్‌పై ఇంకాస్త దృష్టిం పెడితే బాగుండేది. ముఖ్యంగా సెకండాఫ్‌లో కొన్ని సీన్స్‌ని మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి.
- అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్
Comments
Please login to add a commentAdd a comment