‘‘శేఖర్’ సినిమా స్టార్టింగ్‌లో కరోనా బారిన పడ్డాను. అభిమానులు, శ్రేయోభిలాషులు, ప్రేక్షకుల ప్రార్థనలు నన్ను బతికించింది ఈ సినిమా కోసమేనేమో! మేమంతా ప్రాణం పెట్టి ఈ సినిమా తీశాం’’ అన్నారు రాజశేఖర్. జీవితా రాజశేఖర్ దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా నటించిన చిత్రం ‘శేఖర్’. బీరం సుధాకర్‌రెడ్డి, శివానీ రాజశేఖర్, శివాత్మికా రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మించిన చిత్రం ఇది. ఈ సినిమాను ముత్యాల రాందాస్ ఈ నెల 20న రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ‘శేఖర్’ సినిమా ట్రైలర్ లాంచ్ గురువారం హైదరాబాద్‌లో జరిగింది.
హీరో అడివి శేష్ ‘శేఖర్’ సినిమా ట్రైలర్‌ను లాంచ్ చేసి, మాట్లాడుతూ – ‘‘రాజశేఖర్‌గారి ‘మగాడు’ చిత్రం నా ఫేవరెట్. ‘శేఖర్’ సినిమా ట్రైలర్ బాగుంది. మంచి కంటెంట్‌తో వస్తున్న ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు. ‘‘ఈ సినిమాకు నేను దర్శకత్వం వహించినందు వల్ల ఎక్కువ టెన్షన్ పడుతున్నాను. మహిళలు ఎక్కువగా వర్క్ చేసినా కూడా ఎక్కువమంది ప్రోత్సహించరు. ‘శేఖర్’ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఎమోషనల్ అవుతారు’’ అన్నారు జీవితా రాజశేఖర్.
‘‘మా ఫ్యామిలీ అంతా కలిసి చేసిన సినిమాయే ‘శేఖర్’. నేను మిస్ ఇండియా పోటీకి అర్హత సాధించడానికి తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు రాష్ట్రాలను ఎంచుకుంటే తమిళనాడు నుంచి పోటీ చేసే అవకాశం ఇవ్వగా, నేను తమిళనాడు కంటెస్టెంట్ ఫ్రమ్ హైదరాబాద్ అని పెట్టుకున్నాను’’ అన్నారు శివానీ రాజశేఖర్. డిస్ట్రిబ్యూటర్ ముత్యాల రాందాస్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్, దర్శకుడు పవన్ సాదినేని, నటి ఈషా రెబ్బా, సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment