హిరమండలం ఆస్పత్రిలో మృతదేహం వద్ద రోదిస్తున్న బంధువులు దేవీ (ఫైల్ ఫొటో)
శ్రీకాకుళం, హిరమండలం: బాలింత మృతి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసిన ఘటన మంగళవారం హిరమండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద చోటుచేసుకుంది. వైద్య సిబ్బంది నిర్లక్ష్యమే ఇందుకు కారణమంటూ బాధితురాలి కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆస్పత్రికి చేరుకుని ధర్నా చేపట్టడంతో ట్రాఫిక్ స్తంభించింది. తమకు న్యాయం జరిగే వరకు కదిలేది లేదంటూ పట్టుబట్టడంతో కిలోమీటరు మేర ఇరువైపులా వాహనాలు బారులు తీరాయి.
ఇదీ జరిగింది..
హిరమండలం మేజర్ పంచాయతీ సుభలయ గ్రామానికి చెందిన గర్భిణి బుడ్డి దేవీ(20) పురిటి నొప్పులతో సోమవారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో హిరమండలం పీహెచ్‌సీలో చేరింది. ఆ సమయంలో వైద్యాధికారి, సిబ్బంది ఎవరూ అందుబాటులో లేరు. వాచ్‌మన్ వెళ్లి పిలవడంతో స్టాఫ్‌నర్సు ఏకాశమ్మ వచ్చి వైద్యసేవలు అందించడంతో దేవీ మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ప్రసవం సమయంలో బిడ్డతో పాటు (మాయ) ప్లజెంటా బయటకు సకాలంలో రాలేదు. దీంతో బొడ్డును కట్ చేస్తుండగా ప్లజెంటా కడుపులోకి వెళ్లిపోయింది. వెంటనే ఈ విషయాన్ని వైద్యాధికారి సీహెచ్ మౌనికకు ఫోన్ చేసి చెప్పగా ఆమె ఆస్పత్రికి చేరుకుంది. ఇంతలో దేవీకి తీవ్ర రక్తస్రావం జరగడంతో హుటాహుటిన శ్రీకాకుళం రిమ్స్‌కు రిఫర్ చేశారు. పరిస్థితి విషమించడంతో విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. అక్కడి వైద్యులు చూసేసరికే దేవీ మృతిచెందింది.
ఆస్పత్రిని చుట్టుముట్టిన బాధితులు..
హిరమండలం వైద్యాధికారి, సిబ్బంది నిర్లక్ష్యం వల్లే నిండు ప్రాణం బలైపోయిందంటూ దేవీ కుటుంబ సభ్యులు, బంధువులు మంగళవారం ఉదయం ఆందోళనకు దిగారు. మృతదేహాన్ని హిరమండలం ఆస్పత్రి వద్ద ఉంచి ధర్నా చేపట్టారు. తమకు న్యాయం జరిగే వరకు మృతదేహాన్ని తీసుకువెళ్లేది లేదంటూ బైఠాయించారు. గ్రామస్తులు కూడా పెద్ద ఎత్తున వచ్చి మృతురాలి కుటుంబానికి మద్దతు పలికి ఆస్పత్రిని చుట్టుముట్టారు. దీంతో ఏబీ రోడ్డుపై కిలోమీటర్ల మేర ఇరువైపులా వాహనాలు బారులు తీరాయి. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ వి.రమేష్ సిబ్బందితో చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. బాధితులతో మాట్లాడారు. అయినా వారు ఆందోళన విరమించలేదు. కొత్తూరు, సారవకోట, పాతపట్నం, మెళియపుట్టి ఎస్‌ఐలు సిబ్బందితో చేరుకున్నా పరిస్థితి అదుపులోకి రాలేదు. వెంటనే పాతపట్నం సీఐ ప్రకాశరావు ఘటనా స్థలానికి చేరుకుని స్థానికులకు నచ్చజెప్పడంతో మధ్యాహ్నం ఒంటి గంటకు రహదారులపై ఆందోళన విరమించారు.
డిప్యూటీ డీఎంహెచ్‌ఓతో చర్చలు..
సమాచారం అందుకున్న డిప్యూటీ డీఎంహెచ్‌ఓ నరేష్‌కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని బాధితులు, స్థానిక ప్రజాప్రతినిధులు, వైద్య సిబ్బందితో మాట్లాడారు. విచారణ చేయించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అయినప్పటికీ బాధిత కుటుంబ సభ్యులు వినలేదు. గతంలో ఇటువంటి ఘటనలు జరిగినా ఎలాంటి చర్యలూ తీసుకోలేదని మండిపడ్డారు. వైద్యాధికారితో పాటు ఇతర సిబ్బందిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలన్నారు. అనంతరం డిప్యూటీ డీఎంహెచ్‌ఓ ఇక్కడి పరిస్థితిని ఐటీడీఏ పీఓ, డీఎంహెచ్‌ఓలకు ఫోన్‌లో వివరించారు.
క్షమాపణ పేరిట హైడ్రామా..
వైద్యాధికారి మౌనిక బహిరంగ క్షమాపణ చెబుతారంటూ అధికారులు ఆందోళనకారుల వద్దకు తీసుకొచ్చారు. ఇంతలోనే ఆమె కళ్లుతిరిగి పడిపోవడంతో మళ్లీ ఆస్పత్రిలోకి తీసుకెళ్లిపోయారు. పోలీసు వాహనంలో వేరే ఆస్పత్రికి తీసుకు వెళ్లేందుకు సిద్ధమవుతుండగా బాధితులు అడ్డుకున్నారు. వైద్యాధికారి క్షమాపణ చెప్పకపోవడంతో మరింతగా ఆందోళన చేపట్టారు.
ఆర్టీఓ హామీ..
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పాలకొండ ఆర్డీఓ ఆర్.గున్నయ్య ఘటనా స్థలానికి చేరుకున్నారు. వైద్యసిబ్బంది, బాధితులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. వైద్యాధికారి, సిబ్బ ందిపై చర్యలు తీసుకుంటామని, కలెక్టర్‌తో మాట్లాడి బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో కుటుంబసభ్యులు, బంధువులు శాంతించి మృతదేçహాన్ని తీసుకువెళ్లారు. ఎస్‌ఐ రమేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నిరుపేద కుటుంబం..
దేవీది పేద కుటుంబం. కుటుంబ పోషణ కోసం తండ్రి దుబాయి వెళ్లాడు. తల్లి రేణుక కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. ఇద్దరు చెల్లెళ్లు స్వప్న, స్వాతీలు ఇంటర్, టెన్త్ చదువుతున్నారు. దేవీకి ఒడిశాకు చెందిన వాసుదేవరావుతో ఏడాది కిందట వివాహం చేశారు. ప్రసవం కోసం పుట్టింటికి రాగా ఇంతలోనే విషాదం చోటుచేసుకుంది. ప్రస్తుతం దేవీ బిడ్డ ఆరోగ్యంగానే ఉన్నాడు. శిశువును చూసి భర్త వాసు, తల్లి రేణుక, చెల్లెళ్లు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment