శ్రీకాకుళం, మందస: మండలంలోని బుడారిసింగి పంచాయతీ గుడ్డికోల గ్రామానికి చెందిన ఓ 12 ఏళ్ల బాలిక గర్భం దాల్చింది. ఈమె స్వస్థలం ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా బత్రసాయి సమీపంలోని గౌడు గ్రామం. గుడ్డికోల గ్రామానికి చెందిన యువకుడికి సదరు బాలిక వరుసకు మేనకోడలు. ఈమె తల్లిదండ్రులు మరణించడంతో బాలికను ఒడిశా నుంచి తీసుకువచ్చి యువకుడు వివాహం చేసుకున్నట్టు తెలిసింది. శుక్రవారం జాతీయ బాలికా దినోత్సవం కావడంతో సిరిపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గిరిజన బాలికల ఆరోగ్య పరీక్షలు చేస్తుండగా గర్భిణి అనే విషయం వెలుగులోకి వచ్చింది.
వెంటనే వైద్యాధికారి డాక్టర్ సీహెచ్ శరత్‌చంద్రశివకుమార్ ఐటీడీఏ(సీతంపేట)కు సమాచారం అందించారు. వైఎస్సార్ క్రాంతి పథం ఏపీఎం ఎ.లలితను గుడ్డికోల గ్రామానికి వెళ్లి పరిస్థితి పర్యవేక్షించాల్సిందిగా ఆదేశాలు రావడంతో ఏపీఎంతో పాటు సీసీ ముఖలింగం గ్రామానికి వెళ్లి పూర్తిస్థాయిలో వివరాలు సేకరించారు. గిరిజన బాలిక రెండు నెలల గర్భిణిగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ విషయమై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టేందుకు ఐటీడీఏ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment