Tribal girl students
-
గిరిజన బాలల ‘సేవా భారతి’
సాక్షి, అమరావతి: ► ఈ చిత్రంలోని యువతి.. నూప రాధ. ఊరు.. తూర్పుగోదావరి జిల్లా కూనవరం మండలం పాలగూడెం. గిరిజన కుటుంబానికి చెందిన రాధ తండ్రి చినరాముడు 2014లో మరణించారు. ఆ తర్వాత చెల్లిని కూడా కోల్పోయింది. రాధ తల్లి ముత్తమ్మకు చదివించే స్తోమత లేకపోవడంతో పదో తరగతితోనే రాధ చదువు ఆపేసింది. ఇలాంటి పరిస్థితుల్లో సేవా భారతి సంస్థ రాధను ఇంటర్ నుంచి నర్సింగ్ వరకు చదివించింది. ఆ సంస్థ సాయంతో ప్రస్తుతం రాధ కూనవరం కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో కాంట్రాక్ట్ పద్ధతిలో స్టాఫ్ నర్స్‌గా పనిచేస్తోంది. ► తూర్పుగోదావరి జిల్లా వీఆర్ పురంకు చెందిన రాంబాబు తండ్రి అతడికి ఆరేళ్ల వయసున్నప్పుడు మరణించాడు. దీంతో రాంబాబు తల్లి వెంకటలక్ష్మి మరో పెళ్లి చేసుకుంది. దీంతో అనాథగా మారిన అతడిని సేవా భారతి సంస్థ ఆదుకుంది. అనాథ బాలుర ఆశ్రమంలో ఆశ్రయం కల్పించి చదువు చెప్పింది. తర్వాత బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీలో చదివిన రాంబాబు కాకినాడలో ఇరిగేషన్ ఇంజనీర్‌గా ఉద్యోగం సాధించాడు. అమ్మ మృతితో చదువు ఆపేశాను మా అమ్మ సోములమ్మ మృతి చెందడంతో 2012లో ఇంటర్‌తో చదువు ఆపేశా. సేవా భారతి సంస్థ ఆదరించి చదువు చెప్పించింది. ప్రస్తుతం సికింద్రాబాద్‌లో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేస్తున్నా. – కొండ్ల వీరపురెడ్డి, గిరిజన యువకుడు ఇలా.. రాధ, రాంబాబులే కాకుండా చిన్నారి, పాయం సుమన్, మండకం గంగాధర్, బుచ్చిరెడ్డి, తుర్రం రాధ, జగన్ బాబు, బేబీ, ముక్తేశ్వరి వంటి తల్లిదండ్రులను కోల్పోయిన అనాథలు, ఆర్థికంగా తోడ్పాటు లేని అభాగ్యులు, మారుమూల గిరిజన ప్రాంతాలకు చెందిన దాదాపు 90 మంది గిరిజన బాలబాలికలకు సేవా భారతి ట్రస్ట్ చేయూతను అందించింది. వారికి అన్ని విధాలా అండగా నిలిచి చదువులు చెప్పింది. ఆ సంస్థ అందించిన ఆసరాతో ఇప్పుడు వారంతా వేర్వేరు రంగాల్లో ఉద్యోగాలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. వీరంతా ఆదివారం విజయవాడ సత్యనారాయణపురంలోని విజ్ఞాన విహార పాఠశాల ఆవరణలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కష్టాల కడలి నుంచి చదువుల బాటలో సాగి ఉద్యోగమనే విజయ తీరానికి చేరుకున్న వైనాన్ని అందరికీ వివరించి వారిలో స్ఫూర్తిని రగిలించారు. ఈ సమావేశంలో సేవా భారతి అధ్యక్షుడు డాక్టర్ సాయి కిషోర్, ఆర్ఎస్ఎస్ ప్రాంతీయ కార్యదర్శి భూపతిరాజు శ్రీనివాసరాజు, విద్యాభారతి ప్రాంత కార్యదర్శి ఓంకార నరసింహం పాల్గొన్నారు. చింతూరు, వరరామచంద్రపురం, కూనవరం, కుక్కునూరు, భద్రాచలం తదితర మండలాల్లో దాదాపు 200కుపైగా గ్రామాల్లో ప్రజలకు విద్య, వైద్య సేవలందిస్తున్నట్టు తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో సేవలు దాదాపు 20 ఏళ్లకుపైగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని గిరిజన ప్రాంతాల్లో సేవలు అందిస్తున్నాం. చదువుకు దూరమైన పిల్లల్ని గుర్తించి చదివిస్తున్నాం. ఇలా చదువుకుంటున్నవారు, చదువుకుని స్థిరపడినవారు దాదాపు 600 మంది ఉన్నారు. వారంతా నన్ను మావయ్య, నాన్న అని పిలుస్తుంటే చాలా సంతృప్తిగా ఉంది. –సాయి కిశోర్, సేవాభారతి రాష్ట్ర అధ్యక్షుడు ఏఎన్ఎంగా పనిచేస్తున్నా మాది పేద కుటుంబం కావడంతో చదువు ఆపేశాను. ఇలాంటి పరిస్థితుల్లో సేవా భారతి సంస్థ నన్ను నర్సింగ్ చదివించింది. ఇప్పుడు రేఖపల్లిలో కాంట్రాక్ట్ ఏఎన్ఎంగా పనిచేస్తున్నా. –ఎం.రాములమ్మ, గిరిజన యువతి -
గర్భం దాల్చిన గిరిజన విద్యార్థిని
శ్రీకాకుళం, మందస: మండలంలోని బుడారిసింగి పంచాయతీ గుడ్డికోల గ్రామానికి చెందిన ఓ 12 ఏళ్ల బాలిక గర్భం దాల్చింది. ఈమె స్వస్థలం ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా బత్రసాయి సమీపంలోని గౌడు గ్రామం. గుడ్డికోల గ్రామానికి చెందిన యువకుడికి సదరు బాలిక వరుసకు మేనకోడలు. ఈమె తల్లిదండ్రులు మరణించడంతో బాలికను ఒడిశా నుంచి తీసుకువచ్చి యువకుడు వివాహం చేసుకున్నట్టు తెలిసింది. శుక్రవారం జాతీయ బాలికా దినోత్సవం కావడంతో సిరిపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గిరిజన బాలికల ఆరోగ్య పరీక్షలు చేస్తుండగా గర్భిణి అనే విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే వైద్యాధికారి డాక్టర్ సీహెచ్ శరత్‌చంద్రశివకుమార్ ఐటీడీఏ(సీతంపేట)కు సమాచారం అందించారు. వైఎస్సార్ క్రాంతి పథం ఏపీఎం ఎ.లలితను గుడ్డికోల గ్రామానికి వెళ్లి పరిస్థితి పర్యవేక్షించాల్సిందిగా ఆదేశాలు రావడంతో ఏపీఎంతో పాటు సీసీ ముఖలింగం గ్రామానికి వెళ్లి పూర్తిస్థాయిలో వివరాలు సేకరించారు. గిరిజన బాలిక రెండు నెలల గర్భిణిగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ విషయమై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టేందుకు ఐటీడీఏ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. -
ఎస్టీ విద్యార్థినులకు కొత్తగా 4 డిగ్రీ కాలేజీలు
సాక్షి, హైదరాబాద్: గిరిజన బాలికల్లో అక్షరాస్యతను పెంచేందుకు ఎస్టీ సంక్షేమ శాఖ చర్యలు చేపట్టింది. రాష్ర్టంలో గిరిజన విద్యార్థినుల కోసం కొత్తగా నాలుగు డిగ్రీ కళాశాలలు ఏర్పాటు కానున్నాయి. ఈ మేరకు ఎస్టీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ రూపొందించిన ప్రతిపాదనలకు ఎస్టీ గురుకుల సంస్థల బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ఆమోదముద్ర వేసింది. వీటిని ప్రభుత్వానికి పంపించాలని నిర్ణయించింది. ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్, పలువురు ఎమ్మెల్యేల వినతుల మేరకు గిరిజన జనాభా ఎక్కువగా ఉన్న ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, మహబూబ్‌నగర్‌లలో ఈ డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేయాలని ఎస్టీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ ప్రతిపాదించింది. ఖమ్మం జిల్లాలో 7.65 లక్షల ఎస్టీల జనాభాకుగాను బాలికల కోసం 4 జూనియర్ కాలేజీలుండగా, మహిళల అక్షరాస్యత 43 శాతంగా ఉంది. వరంగల్ జిల్లాలో 5.3 లక్షల గిరిజనులుండగా, 4 జూనియర్ కాలేజీలున్నాయి. మహిళల అక్షరాస్యత 39 శాతంగా ఉంది. ఆదిలాబాద్‌లో 3 జూనియర్ కాలేజీలుండగా, అక్కడ దాదాపు 5 లక్షల గిరిజనులు నివసిస్తున్నారు. మహిళల అక్షరాస్యత 41 శాతంగా ఉంది. మహబూబ్‌నగర్ జిల్లాలో 3.6 లక్షల మంది గిరిజనులుండగా, 2 జూనియర్ కాలేజీలున్నాయి. మహిళల అక్షరాస్యత 30 శాతంగా ఉంది. జూనియర్ కాలేజీలుగా 4 గురుకుల పాఠశాలలు మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తి, కల్వకుర్తి, వరంగల్ జిల్లా కొత్తగూడ, నల్లగొండ జిల్లా తుంగతుర్తిలోని బాలికల గురుకుల పాఠశాలలను జూనియర్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేయాలని ఎస్టీ శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలను సమర్పించనుంది. వీటిల్లో జూనియర్ కాలేజీ సెక్షన్లను ప్రారంభించాల్సిందిగా మంత్రి అజ్మీరా చందూలాల్ చేసిన విజ్ఞప్తి మేరకు 2015-16లో జూనియర్ కాలేజీ తరగతులను ప్రారంభిం చారు. ఈ నేపథ్యంలో ఆ కాలేజీల ప్రారంభానికి అనుమతినివ్వాలని ప్రభుత్వాన్ని ఎస్టీ శాఖ, ఎస్టీ గురుకుల విద్యాసంస్థల సొసైటీలు విజ్ఞప్తి చేయనున్నాయి. 160 మందికి సివిల్స్ లాంగ్‌టర్మ్ కోచింగ్ ఎస్టీ గురుకులాల్లో 9వ తరగతి నుంచే సివిల్ సర్వీసెస్‌కు లాంగ్‌టర్మ్ కోచింగ్‌ను ఇవ్వాలని ఎస్టీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ నిర్ణయించింది. ప్రతి ఏడాది 160 మంది విద్యార్థులకు సివిల్స్ లాంగ్ టర్మ్ కోచింగ్ ఇవ్వనున్నారు. దీనిలో భాగంగా తొమ్మిదో తరగతి నుంచి డిగ్రీ వరకు ప్రత్యేక శిక్షణను ఇస్తారు. 9, 10, ఇంటర్ చదివే విద్యార్థులకు వేసవి సెలవుల్లోనూ ఈ శిక్షణను కొనసాగిస్తారు. -
ఆ 15 రోజులు .. ఏం జరిగింది
ఫిర్యాదుపై వేగంగా స్పందించని పోలీసులు పట్టింపులేని హాస్టల్ సిబ్బంది నెల రోజులు తెలియని ఆచూకీ చివరికి శవాలుగా కనిపించిన గిరిజన విద్యార్థినులు నర్సంపేట/పర్వతగిరి/నల్లబెల్లి/చెన్నారావుపేట: అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన పర్వతగిరి మండలం నారాయణపురం, కంబాలకుంట గ్రామాలకు చెం దిన విద్యార్థినులు ప్రియాంక(14), భూమిక(14)లు హాస్టల్ నుంచి వెళ్లిన పదిహేను రోజులు ఎక్కడున్నారనేది మిస్టరీగా మారింది. ఈ నెల 27న చెన్నారావుపేట మండలం ఖాదర్గుట్ట సమీపంలో లభించిన బాలికల మృతదేహాల స్థితిని పరిశీలిస్తే వారు పదిహేను రోజుల కిందట మరణించినట్లుగా పోలీసులు అంచనా వేస్తున్నారు. విద్యార్థులు తప్పిపోయిన 33 రోజుల తర్వాత ఆచూకీ లభించింది. ఈ లెక్కన వీరు చనిపోవడానికి ముందు పదిహేను రోజుల పాటు ఎక్కడ, ఎవరితో ఉన్నారనేది కేసులో కీలకంగా మారింది. బాలికల మృతదేహాలు పడి ఉన్న చోటులో సేకరించిన ఆధారాలతో ఇప్పటి వరకు దర్యాప్తులో ఎటువంటి ముందడుగూ పడలేదు. మరోవైపు కుటుంబ సభ్యుల నుంచి సేకరించిన సమాచారం సైతం కేసు పురోగతికి దోహదం చేయడం లేదు. దీంతో బాలికల ఆచూకీ కాదుగదా వారు మరణించిన తర్వాత కూడా కేసును ఛేదించడం పోలీసులకు సవాల్‌గా మారింది. నిర్లక్ష్యం తీరిది.. గిరిజన బాలికలు ప్రియాంక, భూమికల అనుమానాస్పద మృతికి పోలీసులు, హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యమే ప్రధాన కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బాలికలు కనిపించకుండా పోయి నెలరోజులు దాటినా వారి ఆచూకీ కనిపెట్టలేకపోవడం పోలీసుశాఖ వైఫల్యాన్ని ఎత్తిచూపుతోంది. ఈ బాలికలు నల్లబెల్లి మండలం మూడు చెక్కలపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నారు. 2015 నవంబరు 6న ప్రియూంక, 8న భూమిక అనారోగ్య కారణాలతో స్వగ్రావూలకు చేరుకున్నారు. వీరిద్దరు హాస్టల్‌కు వెళ్తున్నామంటూ నవంబరు 23న తిరుగు ప్రయాణమయ్యారు. హాస్టల్‌కు వెళ్లకుండా ములుగు మండలం మల్లంపల్లిలో ఉన్న బంధువుల ఇంటికి చేరుకున్నారు. ఈ విషయం తల్లిదండ్రులకు తెలియడంతో మందలించారు. మరుసటి రోజు(నవంబరు 24న) హాస్టల్‌కు బయలుదేరినా అక్కడికి చేరుకోలేదు. చివరికి 33 రోజుల తర్వాత చెన్నారావుపేట మండలం ఖాదర్‌పేట గుట్ల సమీపంలో విగత జీవులుగా లభ్యమయ్యారు. ఇద్దరు మైనర్ బాలికల అదృశ్యమైన సంఘటనలో పోలీసులు, హాస్టల్ సిబ్బంది వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంటి నుంచి బయల్దేరిన తమ పిల్లలు హాస్టల్‌కు చేరుకున్నారా? లేదా? అని తెలుసుకునేందుకు నవంబరు 24 సాయంత్రం బాలికల తల్లిదండ్రులు హాస్టల్ వార్డెన్ (సంక్షేమ అధికారి) జాటోతు వీరమ్మను ఫోన్లో సంప్రదించగా ‘నేను పని మీద నర్సంపేటకు వచ్చాను. తిరిగి హాస్టల్ వెళ్లగానే కబురు చేస్తాను’ అంటూ సమాధానం ఇచ్చారు. తాపీగా రెండు రోజుల తర్వాత నవంబరు 26న బాలికలు రాలేదంటూ తల్లిదండ్రులకు వీరమ్మ ఫోన్లో తెలిపారు. దీంతో బాలికల తల్లిదండ్రులు 27న హాస్టల్‌కు చేరుకుని అక్కడ ధర్నా చేశారు. బాలికల ఆచూకీ కనిపెట్టాలంటూ నల్లబెల్లి పోలీస్ స్టేషన్లో నవంబరు 27 ఫిర్యాదు చేయగా.. పర్వతగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలంటూ అక్కడి పోలీసులు సూచించారు. దీంతో నవంబరు 28న పర్వతగిరిలో ఫిర్యాదు నమోదైంది. కేసు విచారణలో భాగంగా పర్వతగిరి ఎస్సై ములుగు మండలం మల్లంపల్లిలో బాలికల బంధువుల ఇంటికి వెళ్లారు. ఆ తర్వాత బాలికల తల్లిదండ్రులు అనుమానితులుగా పేర్కొన్న ఆటోడ్రైవరును విచారించారు. సదరు ఆటోడ్రైవరు ఫోన్ నుంచి బాలికలు నెక్కొండకు చెందిన మరో వ్యక్తికి ఫోన్ చేసినట్లుగా తెలుసుకుని అతన్ని సైతం విచారించారు. ఈ రెండు సందర్భాల్లో ఆశించిన మేరకు సమాచారం రాకపోవడంతో కేసు విచారణలో వేగం మందగించింది. డిసెంబరు 6, 8 తేదీలలో పర్వతగిరి స్టేషన్‌కు చెందిన కానిస్టేబుళ్లు పర్యాటక ప్రాంతాల్లో గాలించారు. తల్లిదండ్రులు కూడా తిరుపతి, భద్రాచలం వంటి పుణ్యక్షేత్రాల్లో వెతికారు. డిసెంబరు 27న చెన్నారావుపేట మండలం ఖాదర్గుట్ట సమీపంలో గుర్తుపట్టలేని స్థితిలో బాలికల మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అప్పుడు పోలీసుశాఖలో కదలిక వచ్చింది. హాస్టల్లో బాలికలు అదృశ్యమైన తర్వాత వారికి సంబంధించిన పూర్తి వివరాలు అందించడంలో హాస్టల్ వార్డెన్ జాటోతు వీరమ్మ నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అదృశ్యమైన విద్యార్థులకు సంబంధించిన సమాచారాన్ని తోటి విద్యార్థినుల నుంచిగానీ, సన్నిహితంగా ఉండే ఇతర హాస్టల్ సిబ్బంది నుంచిగానీ సేకరించేందుకు ఎటువంటి ప్రయత్నమూ చేయలేదు. తమ పిల్లలు కనిపించకుండా పోయారని ఆందోళన చేసిన తల్లిదండ్రులపై నల్లబెల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన వార్డెన్.. విద్యార్థులు తప్పిపోయినట్లుగా మాత్రం ఎటువంటి ఫిర్యాదూ ఇవ్వలేదు. నల్లబెల్లి హాస్టల్‌కు బయల్దేరే ముందు పర్వతగిరిలో ఓ ఫొటో స్టూడియోలో ఇద్దరు విద్యార్థినులు ఫొటోలు దిగినట్లు తెలిసింది. నవంబరు 24 నుంచి డిసెంబరు 27 వరకు విద్యార్థినుల ఆచూకీ లభించని కాలంలో వీరు సేంద్రియ ఎరువులు కంపెనీ తరఫున రిప్రజెంటేటీవ్‌గా పనిచేశారంటూ ప్రచారం జరుగుతోంది. విద్యార్థినుల ఫొటోలు చూపించి రామప్ప ఆలయం దగ్గర విచారించగా... వారు అక్కడకు వచ్చినట్లుగా సెక్యూరిటీ సిబ్బంది తెలిపారు. అయితే కచ్చితమైన తేదీని వెల్లడించలేకపోతున్నారు.