ఆ 15 రోజులు .. ఏం జరిగింది | Police quickly responded to the complaint | Sakshi
Sakshi News home page

ఆ 15 రోజులు .. ఏం జరిగింది

Published Wed, Dec 30 2015 1:16 AM | Last Updated on Sun, Sep 3 2017 2:46 PM

Police quickly responded to the complaint

ఫిర్యాదుపై వేగంగా స్పందించని పోలీసులు
పట్టింపులేని హాస్టల్ సిబ్బంది
నెల రోజులు తెలియని ఆచూకీ
చివరికి శవాలుగా కనిపించిన గిరిజన విద్యార్థినులు

 
నర్సంపేట/పర్వతగిరి/నల్లబెల్లి/చెన్నారావుపేట: అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన పర్వతగిరి మండలం నారాయణపురం, కంబాలకుంట గ్రామాలకు చెం దిన విద్యార్థినులు ప్రియాంక(14), భూమిక(14)లు హాస్టల్ నుంచి వెళ్లిన పదిహేను రోజులు ఎక్కడున్నారనేది మిస్టరీగా మారింది. ఈ నెల 27న చెన్నారావుపేట మండలం ఖాదర్‌గుట్ట సమీపంలో లభించిన బాలికల మృతదేహాల స్థితిని పరిశీలిస్తే వారు పదిహేను రోజుల కిందట మరణించినట్లుగా పోలీసులు అంచనా వేస్తున్నారు. విద్యార్థులు తప్పిపోయిన 33 రోజుల తర్వాత ఆచూకీ లభించింది. ఈ లెక్కన వీరు చనిపోవడానికి ముందు పదిహేను రోజుల పాటు ఎక్కడ, ఎవరితో ఉన్నారనేది కేసులో కీలకంగా మారింది. బాలికల మృతదేహాలు పడి ఉన్న చోటులో సేకరించిన ఆధారాలతో ఇప్పటి వరకు దర్యాప్తులో ఎటువంటి ముందడుగూ పడలేదు. మరోవైపు కుటుంబ సభ్యుల నుంచి సేకరించిన సమాచారం సైతం కేసు పురోగతికి దోహదం చేయడం లేదు. దీంతో బాలికల ఆచూకీ కాదుగదా వారు మరణించిన తర్వాత కూడా కేసును ఛేదించడం పోలీసులకు సవాల్‌గా మారింది.
 
నిర్లక్ష్యం తీరిది..
గిరిజన బాలికలు ప్రియాంక, భూమికల అనుమానాస్పద మృతికి పోలీసులు, హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యమే ప్రధాన కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బాలికలు కనిపించకుండా పోయి నెలరోజులు దాటినా వారి ఆచూకీ కనిపెట్టలేకపోవడం పోలీసుశాఖ వైఫల్యాన్ని ఎత్తిచూపుతోంది. ఈ బాలికలు నల్లబెల్లి మండలం మూడు చెక్కలపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నారు. 2015 నవంబరు  6న ప్రియూంక, 8న భూమిక అనారోగ్య కారణాలతో స్వగ్రావూలకు చేరుకున్నారు. వీరిద్దరు హాస్టల్‌కు వెళ్తున్నామంటూ నవంబరు 23న తిరుగు ప్రయాణమయ్యారు. హాస్టల్‌కు వెళ్లకుండా ములుగు మండలం మల్లంపల్లిలో ఉన్న బంధువుల ఇంటికి చేరుకున్నారు. ఈ విషయం తల్లిదండ్రులకు తెలియడంతో మందలించారు. మరుసటి రోజు(నవంబరు 24న) హాస్టల్‌కు బయలుదేరినా అక్కడికి చేరుకోలేదు. చివరికి 33 రోజుల తర్వాత చెన్నారావుపేట మండలం ఖాదర్‌పేట గుట్ల సమీపంలో విగత జీవులుగా లభ్యమయ్యారు. ఇద్దరు మైనర్ బాలికల అదృశ్యమైన సంఘటనలో పోలీసులు, హాస్టల్ సిబ్బంది వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇంటి నుంచి బయల్దేరిన తమ పిల్లలు హాస్టల్‌కు చేరుకున్నారా? లేదా? అని తెలుసుకునేందుకు నవంబరు 24 సాయంత్రం బాలికల తల్లిదండ్రులు హాస్టల్ వార్డెన్ (సంక్షేమ అధికారి) జాటోతు వీరమ్మను ఫోన్‌లో సంప్రదించగా ‘నేను పని మీద నర్సంపేటకు వచ్చాను. తిరిగి హాస్టల్ వెళ్లగానే కబురు చేస్తాను’ అంటూ సమాధానం ఇచ్చారు. తాపీగా రెండు రోజుల తర్వాత నవంబరు 26న బాలికలు రాలేదంటూ తల్లిదండ్రులకు వీరమ్మ ఫోన్‌లో తెలిపారు. దీంతో బాలికల తల్లిదండ్రులు 27న హాస్టల్‌కు చేరుకుని అక్కడ ధర్నా చేశారు.
     
బాలికల ఆచూకీ కనిపెట్టాలంటూ నల్లబెల్లి పోలీస్ స్టేషన్‌లో నవంబరు 27 ఫిర్యాదు చేయగా.. పర్వతగిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలంటూ అక్కడి పోలీసులు సూచించారు. దీంతో నవంబరు 28న పర్వతగిరిలో ఫిర్యాదు నమోదైంది. కేసు విచారణలో భాగంగా పర్వతగిరి ఎస్సై ములుగు మండలం మల్లంపల్లిలో బాలికల బంధువుల ఇంటికి వెళ్లారు. ఆ తర్వాత బాలికల తల్లిదండ్రులు అనుమానితులుగా పేర్కొన్న ఆటోడ్రైవరును విచారించారు. సదరు ఆటోడ్రైవరు ఫోన్ నుంచి బాలికలు నెక్కొండకు చెందిన మరో వ్యక్తికి ఫోన్ చేసినట్లుగా తెలుసుకుని అతన్ని సైతం విచారించారు. ఈ రెండు సందర్భాల్లో ఆశించిన మేరకు సమాచారం రాకపోవడంతో కేసు విచారణలో వేగం మందగించింది. డిసెంబరు 6, 8 తేదీలలో పర్వతగిరి స్టేషన్‌కు చెందిన కానిస్టేబుళ్లు పర్యాటక ప్రాంతాల్లో గాలించారు. తల్లిదండ్రులు కూడా తిరుపతి, భద్రాచలం వంటి పుణ్యక్షేత్రాల్లో వెతికారు.

డిసెంబరు 27న చెన్నారావుపేట మండలం ఖాదర్‌గుట్ట సమీపంలో గుర్తుపట్టలేని స్థితిలో బాలికల మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అప్పుడు పోలీసుశాఖలో కదలిక వచ్చింది. హాస్టల్‌లో బాలికలు అదృశ్యమైన తర్వాత వారికి సంబంధించిన పూర్తి వివరాలు అందించడంలో హాస్టల్ వార్డెన్ జాటోతు వీరమ్మ నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అదృశ్యమైన విద్యార్థులకు సంబంధించిన సమాచారాన్ని తోటి విద్యార్థినుల నుంచిగానీ, సన్నిహితంగా ఉండే ఇతర హాస్టల్ సిబ్బంది నుంచిగానీ సేకరించేందుకు ఎటువంటి ప్రయత్నమూ చేయలేదు.  తమ పిల్లలు కనిపించకుండా పోయారని ఆందోళన చేసిన తల్లిదండ్రులపై నల్లబెల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన వార్డెన్.. విద్యార్థులు తప్పిపోయినట్లుగా మాత్రం ఎటువంటి ఫిర్యాదూ ఇవ్వలేదు.

నల్లబెల్లి హాస్టల్‌కు బయల్దేరే ముందు పర్వతగిరిలో ఓ ఫొటో స్టూడియోలో ఇద్దరు విద్యార్థినులు ఫొటోలు దిగినట్లు తెలిసింది. నవంబరు 24 నుంచి డిసెంబరు 27 వరకు విద్యార్థినుల ఆచూకీ లభించని కాలంలో వీరు సేంద్రియ ఎరువులు కంపెనీ తరఫున రిప్రజెంటేటీవ్‌గా పనిచేశారంటూ ప్రచారం జరుగుతోంది.  విద్యార్థినుల ఫొటోలు చూపించి రామప్ప ఆలయం దగ్గర విచారించగా... వారు అక్కడకు వచ్చినట్లుగా సెక్యూరిటీ సిబ్బంది తెలిపారు. అయితే కచ్చితమైన తేదీని వెల్లడించలేకపోతున్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement