ట్రైబల్ వెల్ఫేర్‌లో పోస్టింగ్ వివాదం
Published Sat, Aug 20 2016 11:24 PM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM
ఇందూరు : జిల్లా గిరిజన సంక్షేమ శాఖలో అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్(ఏటీడబ్ల్యూవో) నియామకం వివాదాస్పదమైంది. గ్రేడ్–1 వార్డెన్‌లను కాదని అర్హత లేని, ఏసీబీ కేసు ఉన్న వార్డెన్‌ను ఏటీడబ్ల్యూవోగా నియమించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై గ్రేడ్–1 వార్డెన్, ఇతర వార్డెన్‌లు ఇటీవల జిల్లా గిరిజన సంక్షేమాధికారిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.
నిజామాబాద్ డివిజన్ అసిస్టెంట్ గిరిజన సంక్షేమాధికారి(ఏటీడబ్ల్యూవో)గా పనిచేసిన నర్సింహారెడ్డి.. ఇటీవల స్పౌజ్ విధాన బదిలీల్లో నల్గొండ జిల్లాకు బదిలీ అయ్యారు. దీంతో ఏటీడబ్ల్యూవో పోస్టు ఖాళీ అయ్యింది. గ్రేడ్–1 వార్డెన్‌లకు ఇన్‌చార్జి ఏటీడబ్ల్యూవో బాధ్యతలు అప్పగించాల్సి ఉంది. కానీ జుక్కల్ మండలం కౌలాస్‌లో వార్డెన్‌గా పని చేసిన కమలేశ్ పేరును జిల్లా గిరిజన సంక్షేమాధికారి విజయ్ కుమార్ సిఫారసు చేశారు. డిచ్‌పల్లి గ్రేడ్–1 వార్డెన్ శంకర్ పేరును కూడా ఫైల్‌లో చేర్చారు. కానీ శంకర్‌పై అభియోగాలు ఉన్నాయని ఫైలులో పేర్కొన్నారు. కాగా కమలేశ్‌పై ఏసీబీ కేసు ఉన్నా.. ఎలాంటి అభియోగాలు లేవని నివేదించారు. దీంతో ఇన్‌చార్జి ఏజేసీ పద్మాకర్, కలెక్టర్ యోగితా రాణాలు ఇన్‌చార్జి ఏటీడబ్ల్యూవోగా కమలేశ్‌కు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విషయం తెలుసుకున్న గ్రేడ్–1 వార్డెన్ శంకర్‌తో పాటు మిగతా వార్డెన్‌లు నాలుగు రోజుల క్రితం జిల్లా గిరిజన సంక్షేమాధికారితో వాగ్వాదానికి దిగారు. అర్హతలు లేని వ్యక్తిని ఏటీడబ్ల్యూవోగా ఎలా నియమిస్తారని నిలదీసినట్లు సమాచారం. ఈ విషయమై టీఎన్జీవోస్ నేతలతో కలిసి జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.
Advertisement
Advertisement