ప్రసవానికి వెళ్తే గెంటేశారు
ప్రసవానికి వెళ్తే గెంటేశారు
Published Tue, Aug 23 2016 10:19 PM | Last Updated on Mon, Sep 4 2017 10:33 AM
ఇందూరు :
జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుల తీరును నిరసిస్తూ పచ్చి బాలింత కలెక్టర్ కార్యాలయానికి వచ్చింది. వివరాల్లోకి వెలితే... నిజామాబాద్ నగరంలోని ఆటోనగర్‌కు చెందిన నిషాత్ పర్విన్ (సబియా) కు నెలల నిండడంతో సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత మూడు గంటలకు నొప్పులు రాగా తల్లిదండ్రులు, బంధువులు కలిసి జిల్లా ప్రభుత్వాస్పత్రికి ప్రసవం కోసం తీసుకువచ్చారు. ఆస్పత్రిS మెట్లు ఎక్కుతుండగానే అక్కడి సిబ్బంది, నర్సులు డెలివరీ చేయబోము, వెళ్లిపోండని అక్కడి నుంచి పంపించి వేశారు. గర్భిణి తల్లి బిస్మిల్లా షేక్ సిబ్బందిని ఎంత బతిమాలినా పట్టించుకోలేదు. దీంతో నొప్పులతో బాధపడుతున్న గర్భిణిని వేరే గతిలేక ఇంటికి తీసుకెళ్లారు. గర్భిణి ఇంట్లోనే ఆడ బిడ్డను ప్రసవించింది. తల్లీ, బిడ్డ క్షేమంగానే ఉన్నారు. జిల్లా ప్రభుత్వాస్పత్రి వైద్యులు, సిబ్బంది నిర్వాకంపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మంగళవారం పసి బిడ్డ, బాలింతతో సహా కలెక్టర్ కార్యాలయానికి వచ్చారు. కార్యాలయంలోఅధికారులు ఎవరూ లేనందున కలెక్టర్ సీసీ సూచన మేరకు డీఆర్‌వో కార్యాలయంలో ఫిర్యాదు చేసి వెళ్లారు. ప్రవసం చేయకుండా తిప్పి పంపించిన వారిపై చర్యలు తీసుకోవాలని, నా లాంటి పరిస్థితి మరెవరికీ రాకూడదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది.
Advertisement