గిరిజన బాలల ‘సేవా భారతి’  | Support For Orphans and financial difficulties tribals | Sakshi
Sakshi News home page

గిరిజన బాలల ‘సేవా భారతి’ 

Published Mon, Dec 20 2021 4:42 AM | Last Updated on Mon, Dec 20 2021 4:42 AM

Support For Orphans and financial difficulties tribals - Sakshi

విజ్ఞాన్‌ విహార్‌ పాఠశాలలో జరిగిన విద్యార్థి వికాస యోజన కార్యక్రమంలో మాట్లాడుతున్న సేవా భారతి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ సాయి కిషోర్‌

సాక్షి, అమరావతి: ► ఈ చిత్రంలోని యువతి.. నూప రాధ. ఊరు.. తూర్పుగోదావరి జిల్లా కూనవరం మండలం పాలగూడెం. గిరిజన కుటుంబానికి చెందిన రాధ తండ్రి చినరాముడు 2014లో మరణించారు. ఆ తర్వాత చెల్లిని కూడా కోల్పోయింది. రాధ తల్లి ముత్తమ్మకు చదివించే స్తోమత లేకపోవడంతో పదో తరగతితోనే రాధ చదువు ఆపేసింది. ఇలాంటి పరిస్థితుల్లో సేవా భారతి సంస్థ రాధను ఇంటర్‌ నుంచి నర్సింగ్‌ వరకు చదివించింది. ఆ సంస్థ సాయంతో ప్రస్తుతం రాధ కూనవరం కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లో కాంట్రాక్ట్‌ పద్ధతిలో స్టాఫ్‌ నర్స్‌గా పనిచేస్తోంది. 

 
► తూర్పుగోదావరి జిల్లా వీఆర్‌ పురంకు చెందిన రాంబాబు తండ్రి అతడికి ఆరేళ్ల వయసున్నప్పుడు మరణించాడు. దీంతో రాంబాబు తల్లి వెంకటలక్ష్మి మరో పెళ్లి చేసుకుంది. దీంతో అనాథగా మారిన అతడిని సేవా భారతి సంస్థ ఆదుకుంది. అనాథ బాలుర ఆశ్రమంలో ఆశ్రయం కల్పించి చదువు చెప్పింది. తర్వాత బాపట్ల ఇంజనీరింగ్‌ కాలేజీలో చదివిన రాంబాబు కాకినాడలో ఇరిగేషన్‌ ఇంజనీర్‌గా ఉద్యోగం సాధించాడు.  

అమ్మ మృతితో చదువు ఆపేశాను 
మా అమ్మ సోములమ్మ మృతి చెందడంతో 2012లో ఇంటర్‌తో చదువు ఆపేశా. సేవా భారతి సంస్థ ఆదరించి చదువు చెప్పించింది. ప్రస్తుతం సికింద్రాబాద్‌లో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేస్తున్నా. 
– కొండ్ల వీరపురెడ్డి, గిరిజన యువకుడు 

ఇలా.. రాధ, రాంబాబులే కాకుండా చిన్నారి, పాయం సుమన్, మండకం గంగాధర్, బుచ్చిరెడ్డి, తుర్రం రాధ, జగన్‌ బాబు, బేబీ, ముక్తేశ్వరి వంటి తల్లిదండ్రులను కోల్పోయిన అనాథలు, ఆర్థికంగా తోడ్పాటు లేని అభాగ్యులు, మారుమూల గిరిజన ప్రాంతాలకు చెందిన దాదాపు 90 మంది గిరిజన బాలబాలికలకు సేవా భారతి ట్రస్ట్‌ చేయూతను అందించింది. వారికి అన్ని విధాలా అండగా నిలిచి చదువులు చెప్పింది. ఆ సంస్థ అందించిన ఆసరాతో ఇప్పుడు వారంతా వేర్వేరు రంగాల్లో ఉద్యోగాలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

వీరంతా ఆదివారం విజయవాడ సత్యనారాయణపురంలోని విజ్ఞాన విహార పాఠశాల ఆవరణలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కష్టాల కడలి నుంచి చదువుల బాటలో సాగి ఉద్యోగమనే విజయ తీరానికి చేరుకున్న వైనాన్ని అందరికీ వివరించి వారిలో స్ఫూర్తిని రగిలించారు. ఈ సమావేశంలో సేవా భారతి అధ్యక్షుడు డాక్టర్‌ సాయి కిషోర్, ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రాంతీయ కార్యదర్శి భూపతిరాజు శ్రీనివాసరాజు, విద్యాభారతి ప్రాంత కార్యదర్శి ఓంకార నరసింహం పాల్గొన్నారు. చింతూరు, వరరామచంద్రపురం, కూనవరం, కుక్కునూరు, భద్రాచలం తదితర మండలాల్లో దాదాపు 200కుపైగా గ్రామాల్లో ప్రజలకు విద్య, వైద్య సేవలందిస్తున్నట్టు తెలిపారు.  

గిరిజన ప్రాంతాల్లో సేవలు 
దాదాపు 20 ఏళ్లకుపైగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని గిరిజన ప్రాంతాల్లో సేవలు అందిస్తున్నాం. చదువుకు దూరమైన పిల్లల్ని గుర్తించి చదివిస్తున్నాం. ఇలా చదువుకుంటున్నవారు, చదువుకుని స్థిరపడినవారు దాదాపు 600 మంది ఉన్నారు. వారంతా నన్ను మావయ్య, నాన్న అని పిలుస్తుంటే చాలా సంతృప్తిగా ఉంది. 
–సాయి కిశోర్, సేవాభారతి రాష్ట్ర అధ్యక్షుడు 

ఏఎన్‌ఎంగా పనిచేస్తున్నా 
మాది పేద కుటుంబం కావడంతో చదువు ఆపేశాను. ఇలాంటి పరిస్థితుల్లో సేవా భారతి సంస్థ నన్ను నర్సింగ్‌ చదివించింది. ఇప్పుడు రేఖపల్లిలో కాంట్రాక్ట్‌ ఏఎన్‌ఎంగా పనిచేస్తున్నా.  
–ఎం.రాములమ్మ, గిరిజన యువతి  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement