స్క్రాప్‌ దొంగే హంతకుడు | Old Women Murder Case Reveals Srikakulam Police | Sakshi
Sakshi News home page

స్క్రాప్‌ దొంగే హంతకుడు

Published Wed, May 8 2019 1:26 PM | Last Updated on Wed, May 8 2019 1:26 PM

Old Women Murder Case Reveals Srikakulam Police - Sakshi

వివరాలు వెల్లడిస్తున్న ఏఎస్పీ గంగరాజు, సీఐలు

శ్రీకాకుళం రూరల్‌: నగరంలోని గుజరాతీపేటలో నివసిస్తున్న మహాలక్ష్మీ ఠాకూర్‌ అనే వృద్ధురాలిని తువ్వాలుతో హత్య చేసిన ఘటనలో పోలీసులు కొంతమంది అనుమానితులను విచారించారు. సోమవారం నగర పరిసర ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని పట్టుకున్నారు. ఈ మేరకు నిందితుడిని గట్టిగా ప్రశ్నస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. రెండో పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో మంగళవారం క్రైం ఏఎస్పీ గంగరాజు విలేకర్ల సమావేశాన్ని నిర్వహించి వివరాలు వెల్లడించారు. స్క్రాప్‌ దొంగతనాలకు పాల్పడే లండ రామస్వామి (దుప్పలవలస) వృద్ధురాలిని హత్య చేశాడు. గత నెల 29వ తేదీ అర్ధ రాత్రి తర్వాత గుజరాతీపేట పరిసర ప్రాంతాల్లో దొంగతనానికి వచ్చిన రామస్వామి మహాలక్ష్మీ  ఠాకూర్‌ నివాసాన్ని ఎంచుకున్నాడు. మేడపైన ఇంటిలోకి నేరుగా లోపలకి ప్రవేశించాడు. అప్పటికే తలుపులకు గడియ పెట్టకపోవడంతో బార్లా తెరిచేలోపు గట్టిగా శబ్ధం రావడంతో వృద్ధురాలికి మెలకువ వచ్చి గట్టిగా కేకలు వేయబోయింది. రామస్వామి అప్పటికే తనతో తెచ్చుకున్న తువ్వాలుతో వృద్ధురాలి మెడపై బలంగాబిగించాడు. ఊపిరాడక ఆమె మంచంపైనే ప్రాణాలు విడిచింది. ఆమె మెడలోని చైన్, చెవి దిద్దులు, ఉంగరాన్ని పట్టుకుని అక్కడ నుంచి ఉడాయించాడు.

సీసీ కెమెరా ఫుటేజ్‌ ఆధారంగా..
మృతురాలి కోడలు కోడలు రాజేశ్వరి గత నెల 30న ఇచ్చిన ఫిర్యాదు మేరకు రెండో పట్టణ సీఐ మల్లా మహేశ్వరరావు, సిబ్బంది, సీసీఎస్‌ పోలీసులు కలిసి అనుమానితులను తమదైన శైలిలో ప్రశ్నించారు. హత్య జరిగిన రోజు రాత్రి సీసీ కెమెరా ఫుటేజ్‌ను పరిశీలించగా కొన్ని కీలక ఆధారాలు పోలీసులకు చిక్కాయి. దీంతో సులువుగా నేరస్తుడు రామస్వామిని ఈ నెల 6వ తేదీ సాయంత్రం కొత్త బ్రిడ్జి పక్కన ఉన్న స్వర్గధామం వద్ద పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. నేరస్తుడుపై 302, 380 సెక్షన్‌లు కింద కేసు నమోదు చేసి చోరీ సొత్తును రికవరీ చేసి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

స్క్రాప్‌ దొంగతనాలే ఎక్కువ..
నిందితుడు రామస్వామి ఎక్కువగా స్క్రాప్‌ దొంగతనాలే చేసేవాడు. 2005లో ఆయనపై రెండో పట్టణ స్టేషన్‌లో పలు కేసులు నమోదయ్యాయి. విశాఖపట్నంలో ఓ దొంగతనం కేసులో ముద్దాయిగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కేసు చేధించిన పోలీసులు, సిబ్బందితో పాటు ఈ కేసులో సహాయకులుగా ఉన్న ఇద్దరి యువకులకు ఏఎస్పీ చేతులు మీదుగా రివార్డులు అందజేశారు.

 ఆన్‌లైన్‌ మోసాలకు గురికావద్దు: టూ టౌన్‌ సీఐ  మహేశ్వరరావు
ఇటీవల ఆన్‌లైన్‌ మోసాలు నగరంలోని ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయని, వాటిపై నగర వాసులంతా అప్రమత్తంగా ఉండాలని రెండో పట్టణ సీఐ మల్లా మహేశ్వరరావు తెలిపారు. వృద్ధురాలి హత్య కేసు వివరాలు వెల్లడించిన అనంతరం విలేకర్లతో మాట్లాడారు. రోజుకు రెండు, మూడు ఆన్‌లైన్‌ కేసులు నమోదవుతున్నట్లు చెప్పారు. క్రెడిట్‌ కార్డులో పాయింట్లు, లక్కీడ్రా, ఓఎల్‌ఎక్స్‌లో తక్కువ రేట్లుకు వాహనాలు, లక్కీ లాటరీ, అమేజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో ఉచిత ఆఫర్లు అంటూ చాలామంది ప్రలోభాలకు గురిచేస్తూ కాల్‌ చేస్తారని, అటువంటి వారిని నమ్మి బ్యాంకు వివరాలు ఇచ్చి మోసపోవద్దన్నారు. ఏటీఎం నంబర్, పిన్‌ నెంబర్, ఇతరత్రా వివరాలు అడుగుతారని, ఏ బ్యాంకు నుంచి అటువంటి ఫోన్‌లు రావని ఆయన స్పష్టం చేశారు. 2013 రాష్ట్ర ప్రభుత్వపు ఆదేశాల మేరకు వంద మందికి పైబడి సంచరించే గ్రూప్‌ హౌస్‌ల్లో, అపార్ట్‌మెంట్లలో, ఆస్పత్రుల్లో, కార్పొరేట్‌ స్కూళ్లలో 30 రోజుల నిడివి బ్యాక్‌ అప్‌ ఉండే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు.  ఇప్పటికే అన్ని అపార్ట్‌మెంట్‌లకు, వాణిజ్య సముదాయాలకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలంటూ నోటీసులు జారీ చేశామన్నారు.

ఎల్‌హెచ్‌ఎంఎస్‌తో ఇళ్లకు భద్రత:సీసీఎస్‌ సీఐ వెంకటేశ్వరరావు
నగరంలోని పలు ప్రాంతాల్లో ఉండేవారు వేసవి సెలవులో బయటకు వెళ్తే ఇంటి భద్రం కోసం ఎల్‌హెచ్‌ఎంఎస్‌తో (లాక్డ్‌ హౌస్‌ మోనటరింగ్‌ సిస్టం)ను ఏర్పరుచుకోవాలని సీసీఎస్‌ సీఐ వెంకటేశ్వరరావు తెలిపారు. దొంగ ఇంట్లోకి చొరబడితే గంటల వ్యవధిలోనే పట్టుకోవచ్చన్నారు. జిల్లా పోలీసు ఉన్నతాధికారి పేరిట దరఖాస్తు చేసుకుంటే ఉచితంగానే  ఈ సేవలు పొందవచ్చన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement