వివరాలు వెల్లడిస్తున్న సీఐ ప్రభాకర్
నెల్లిమర్ల: ‘నెల్లిమర్ల పట్టణానికి చెందిన జలుమూరు శ్రీనివాసరావు మద్యం కొనుక్కోవడానికి తల్లిని రూ.100 అడిగాడు. ఆమె ఇవ్వకపోవడంతో ఇటుకలతో కొట్టి చంపేశాడు’ అని భోగాపురం సీఐ ప్రభాకర్ తెలిపారు. మంగళవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ మాట్లాడుతూ హత్యకు సంబంధిచిన వివరాలను వివరించారు. ఆయన కథనం ప్రకారం.. నెల్లిమర్ల పట్టణంలోని మండలపరిషత్ కార్యాలయం సమీపంలోని ఓ పూరి గుడిసెలో జలుమూరు గౌరమ్మ, ఆమె కుమారుడు శ్రీనివాసరావు నివశించేవారు. కొన్నాళ్ల క్రితం వరకు తల్లీకొడుకులు టిఫెన్ సెంటర్ నిర్వహించేవారు. అయితే ఏవో కారణాలవల్ల కొంతకాలంగా ఆ వ్యాపారం నిలిపివేశారు.
దీంతో జీవనోపాధికి గౌరమ్మ సమీపంలోనున్న మిమ్స్ ఆస్పత్రి క్యాంటీన్‌లో పనికి వెళ్లేది. కొడుకు శ్రీనివాసరావు చాలాకాలంగా మద్యానికి బానిసయ్యాడు. మద్యానికి డబ్బులు ఇవ్వాలని నిత్యం తల్లిని వేధించేవాడు. ఈ క్రమంలోనే సోమవారం ఉదయం గౌరమ్మ క్యాంటీన్‌లో పని ముగించుకుని ఇంటికి రాగా మద్యం కొనుక్కోవడానికి తల్లిని రూ.100 ఇవ్వాలంటూ శ్రీనివాసరావు డిమాండ్ చేశాడు. అయితే తన దగ్గర డబ్బుల్లేవని గౌరమ్మ చెప్పడంతో శ్రీనివాసరావు కోపానికి గురై ఇటుకలతో గౌరమ్మ తలపైన, ఒంటిపైనా తీవ్రంగా కొట్టాడు. తప్పించుకుని ఆమె బయటకు పారిపోయినా వెంటబడి మరీ కొట్టాడు. ఆమె భయంతో సమీపంలోని గుడిసెలో దాక్కున్నా వదలలేదు. కొడుకుకొట్టిన దెబ్బలను తట్టుకోలేక గౌరమ్మ మృతి చెందిందని సీఐ ప్రభాకర్ వివరించారు. వీఆర్వో సమక్షంలో లొంగిపోయిన నిందితుడు శ్రీనివాసరావును అరెస్టుచేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు ఆయన తెలిపారు. విలేకరుల సమావేశంలో ఎస్‌ఐ అశోక్‌కుమార్ కూడా పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment