
తప్పిపోయిన లక్ష్మణరావు
శ్రీకాకుళం రూరల్: వారిద్దరూ ప్రాణ స్నేహితులు... ఒకరిని విడిచి ఇంకొకరు ఉండలేరు. కలిసికట్టుగా తిరుపతి ప్రయాణం సాగించారు. ఇంతలో ఏమైందో తెలియదు కానీ తిరుగు ప్రయాణంలో ఒక్కరు మాత్రమే ఇంటికి చేరుకున్నారు. తన స్నేహితుడు గురించి ఆరా తీయగా ఏమైందో చెప్పలేక తల్లడిల్లిపోతూ తిరుపతి నుంచి ఇంటికి వచ్చిన మరుసటి రోజే ఇతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే....
శ్రీకాకుళం మండలంలోని కిల్లిపాలెం పంచాయతీ అదే గ్రామానికి చెందిన రాగోలు లక్ష్మణరావు, సాది రామప్పడు మంచి స్నేహితులు. గత నెల 19వ తేదీన వీరిద్దరూ కలిసి తిరుపతి వెంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో విజయవాడ దగ్గరకు రాగానే రాగోలు లక్ష్మణరావు ఒక్కసారిగా కనిపించలేదు. రైలు కదులుతోంది కదా బాత్‌రూంకు వెళ్లాడేమో అనుకొన్నాడు తోటి స్నేహితుడు రామప్పడు. అయితే గత నెల 23న శ్రీకాకుళం చేరుకునేటప్పటికీ బండి దిగినా తన స్నేహితుడు లక్ష్మణరావు ఆచూకీ మాత్రం కనిపించలేదు. రామప్పడు ఇంటికి రాగానే లక్ష్మణరావు భార్య తన భర్త ఏడని ప్రశ్నించగా ఏమో తెలియదంటూ మాట దాటవేశాడు.
అర్ధంతరంగా తనువు చాలించిన రామప్పడు
ఇదిలావుండగా రామప్పడు వచ్చిన దగ్గర నుంచి ఎవరితో మాట్లాడిన సందర్భాలు కూడా లేవని, రెండు రోజులుగా దిగాలుగా కనిపించేవాడని గ్రామస్తులు అంటున్నారు. అయితే గత నెల 24వ తేదీన రాత్రి ఇంట్లోనే పురుగు మందు తాగి ఒక్కసారిగా ఆత్మహత్యకు పాల్పడ్డాడు రామప్పడు. ఈయన ఆత్మహత్య చేసుకోవడంతో లక్ష్మణరావు కుటుంబ సభ్యులు మరింత ఆందోళన చెందారు. తిరుపతిలో ఏదైనా సంఘటన చోటుచేసుకుందా? లేకా ఎవరైనా లక్ష్మణరావును చంపేసారా? అన్న అనుమానాలు లక్ష్మణరావు కుటుంబ సభ్యుల్లో మరింతగా నెలకొన్నాయి. దీంతో లక్ష్మణరావు ఆచూకీ కోసం గ్రామానికి చెందిన వారు రెండు రోజులు క్రితం తిరుపతి బయలుదేరారు.
ఫిర్యాదు తీసుకోని రూరల్ పోలీసులు
జరిగిన సంఘటనపై లక్ష్మణరావు కుటుంబ సభ్యులు శ్రీకాకుళం రూరల్ పోలీసులను ఆశ్రయించారు. తన భర్త తిరుపతి వెళ్లి తిరుగు ప్రయాణంలో కనిపించడం లేదని కేసు నమోదు చేయాలని పోలీసులకు లక్ష్మణరావు భార్య కోరింది. జరిగిన విషయాన్ని తెలుసుకున్న స్టేషన్ సిబ్బంది ఈ కేసు విశాఖపట్నంలోని దువ్వాడ పోలీస్టేషన్ పరిధిలోకి వస్తోందని, అక్కడ ఫిర్యాదు చేయాలని తిరిగి వెనక్కి పంపేశారు.
ప్రసార మాధ్యమాలపై ఇద్దరికీ అవగాహన లేదు
తిరుపతి బయలుదేరిన ఇద్దరు స్నేహితులకు కనీసం ప్రసార మాధ్యమాలు(సెల్ ఫోన్‌లు) అవగాహన లేదు. గ్రామంలో ఉన్నవారు కూడా తిరుపతి వెళ్తున్నారు ఏదైనా అవసరం ఉంటే తన కుటుంబ సభ్యుల ఫోన్ నంబర్‌లు ఇచ్చారు. తిరుపతి వెళ్లి తిరిగి ప్రయాణంలో కూడా వీరు కనీసం గ్రామస్తులు ఎవరితోను మాట్లాడిన పరిస్థితి కనిపించలేదు.
Comments
Please login to add a commentAdd a comment