పూజిత, కల్యాణిల సెల్ఫీలు
సాక్షి, కడప కోటిరెడ్డిసర్కిల్: బలవన్మరణం చెందాలనుకున్న వారు ఇటీవల ఎక్కువగా రైలు పట్టాలను ఆశ్రయిస్తున్నారు. అవి కూడా జిల్లా కేంద్రమైన కడపలోనే ఎక్కువగా జరుగుతున్నాయి. పట్టాలపై క్షణాల్లో ప్రాణాలు గాలిలో కలుస్తున్నా...జీవితంపై ఎందుకింతలా విరక్తి చెందుతున్నారో అంతు చిక్కడం లేదు. తాజాగా సోమవారం కడపలో గూడ్స్ రైలు కిందపడి ఇరువురు విద్యార్థినులు ఒకేసారి ఆత్మహత్య చేసుకున్న సంఘటను పరిశీలిస్తే....వారికి వచ్చిన కష్టమేమో ఎవరికీ అర్థం కావడం లేదు. పోలీసులు, బంధువులు, స్థానికులు, తోటి విద్యార్థులు ఇలా ప్రతి ఒక్కరూ ఎందుకిలా జరిగిందబ్బా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు తప్ప అసలు కారణాలు ఎంత వెతికినా దొరకడం లేదు.
మంచి చదువులు అభ్యసిస్తూ...
అనంతపురం జిల్లా యాడికి మండలం కమలపాడుకు చెందిన కల్యాణి (18) గుత్తి గేట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతోంది. యాడికి పట్టణం హాస్పిటల్ కాలనీలో నివాసముంటున్న పూజిత (18) తాడిపత్రి సరస్వతి డిగ్రీ కళాశాలలో బీఎస్సీ కంప్యూటర్స్ చదువుతోంది. చదువులో ఇరువురు తెలివైన వారే. ఉన్నత లక్ష్యాలను సాధించాలనే దిశగానే వారి విద్యాభ్యాసం కొనసాగుతోంది. ఈ క్రమంలో వీరికి ఎందుకిలాంటి ఆలోచన వచ్చిందో అంతుచిక్కడం లేదు. ఏదైనా ప్రేమ వ్యవహారమా? అనడానికి ఆధారాల్లేవు. అలాగని కుటుంబ సమస్యలు ఏవైనా ఉన్నాయనుకుంటే అవీ లేవు. తాడిపత్రి నుంచి కడపకు వచ్చి మరీ ఆత్మహత్య చేసుకోవాల్సినంత పరిస్థితి వీరికి ఎందుకొచ్చిందో కాలమే సమాధానం చెప్పాల్సి ఉంది.
చదవండి: (ఒకరు బీటెక్, మరొకరు బీఎస్సీ.. చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్.. ఏ కష్టమొచ్చిందో.!)
చివరి వరకు చెరగని చిరునవ్వు..
కల్యాణి, పూజితలు కడపలో బస్సు దిగి రైల్వేస్టేషన్ చేరుకునే వరకు వారి ముఖాల్లో చిరునవ్వు ఏమాత్రం చెరగలేదన్నది సీసీ కెమెరాల సాక్షిగా స్పష్టమవుతోంది. బస్టాండులో దిగిన తర్వాత ఇద్దరూ కలిసి సంతోషంగా కొన్ని సెల్ఫీ ఫొటోలు కూడా తీసుకున్నారు. మాస్క్ పెట్టుకుని ఒకసారి..లేకుండా మరోసారి...ఇలా ఒకరిపై ఒకరు ఆప్యాయతను కనబరుస్తూ జ్ఞాపకాలు మిగిల్చిపోయారు. అది వారి చివరి ఫొటోగా చెప్పవచ్చు. కని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులకు మాత్రం తీరని శోకాన్ని మిగిల్చి వారిని కన్నీటి సంద్రంలో ముంచిపోయారు.
సంఘటనపై పోలీసుల ఏమంటున్నారంటే..
కల్యాణి, పూజిత ఆత్మహత్యలపై రైల్వే ఎస్‌ఐ రారాజును వివరణ కోరగా ఈ సంఘటనపై తల్లిదండ్రుల నుంచి అన్ని వివరాలు సేకరించామన్నారు. అయితే వారి వద్ద మృతికి సంబంధించిన ఎలాంటి సమాచారం లేదన్నారు. వీరి కళాశాల ప్రిన్సిపాల్స్‌తోపాటు స్నేహితులతో మాట్లాడాల్సి ఉందని వివరించారు. అలాగే మృతి చెందిన విద్యార్థినుల ఫోన్‌కాల్ డేటా గురించి కూడా ఆరా తీస్తున్నామని తెలిపారు. పూర్తి సమాచారం అందగానే మీడియాకు తెలియజేస్తామని ఆయన వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment