yadiki
-
కెమెరాల సాక్షిగా.. చివరి వరకు చెరగని చిరునవ్వు..
సాక్షి, కడప కోటిరెడ్డిసర్కిల్: బలవన్మరణం చెందాలనుకున్న వారు ఇటీవల ఎక్కువగా రైలు పట్టాలను ఆశ్రయిస్తున్నారు. అవి కూడా జిల్లా కేంద్రమైన కడపలోనే ఎక్కువగా జరుగుతున్నాయి. పట్టాలపై క్షణాల్లో ప్రాణాలు గాలిలో కలుస్తున్నా...జీవితంపై ఎందుకింతలా విరక్తి చెందుతున్నారో అంతు చిక్కడం లేదు. తాజాగా సోమవారం కడపలో గూడ్స్ రైలు కిందపడి ఇరువురు విద్యార్థినులు ఒకేసారి ఆత్మహత్య చేసుకున్న సంఘటను పరిశీలిస్తే....వారికి వచ్చిన కష్టమేమో ఎవరికీ అర్థం కావడం లేదు. పోలీసులు, బంధువులు, స్థానికులు, తోటి విద్యార్థులు ఇలా ప్రతి ఒక్కరూ ఎందుకిలా జరిగిందబ్బా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు తప్ప అసలు కారణాలు ఎంత వెతికినా దొరకడం లేదు. మంచి చదువులు అభ్యసిస్తూ... అనంతపురం జిల్లా యాడికి మండలం కమలపాడుకు చెందిన కల్యాణి (18) గుత్తి గేట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతోంది. యాడికి పట్టణం హాస్పిటల్ కాలనీలో నివాసముంటున్న పూజిత (18) తాడిపత్రి సరస్వతి డిగ్రీ కళాశాలలో బీఎస్సీ కంప్యూటర్స్ చదువుతోంది. చదువులో ఇరువురు తెలివైన వారే. ఉన్నత లక్ష్యాలను సాధించాలనే దిశగానే వారి విద్యాభ్యాసం కొనసాగుతోంది. ఈ క్రమంలో వీరికి ఎందుకిలాంటి ఆలోచన వచ్చిందో అంతుచిక్కడం లేదు. ఏదైనా ప్రేమ వ్యవహారమా? అనడానికి ఆధారాల్లేవు. అలాగని కుటుంబ సమస్యలు ఏవైనా ఉన్నాయనుకుంటే అవీ లేవు. తాడిపత్రి నుంచి కడపకు వచ్చి మరీ ఆత్మహత్య చేసుకోవాల్సినంత పరిస్థితి వీరికి ఎందుకొచ్చిందో కాలమే సమాధానం చెప్పాల్సి ఉంది. చదవండి: (ఒకరు బీటెక్, మరొకరు బీఎస్సీ.. చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్.. ఏ కష్టమొచ్చిందో.!) చివరి వరకు చెరగని చిరునవ్వు.. కల్యాణి, పూజితలు కడపలో బస్సు దిగి రైల్వేస్టేషన్ చేరుకునే వరకు వారి ముఖాల్లో చిరునవ్వు ఏమాత్రం చెరగలేదన్నది సీసీ కెమెరాల సాక్షిగా స్పష్టమవుతోంది. బస్టాండులో దిగిన తర్వాత ఇద్దరూ కలిసి సంతోషంగా కొన్ని సెల్ఫీ ఫొటోలు కూడా తీసుకున్నారు. మాస్క్ పెట్టుకుని ఒకసారి..లేకుండా మరోసారి...ఇలా ఒకరిపై ఒకరు ఆప్యాయతను కనబరుస్తూ జ్ఞాపకాలు మిగిల్చిపోయారు. అది వారి చివరి ఫొటోగా చెప్పవచ్చు. కని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులకు మాత్రం తీరని శోకాన్ని మిగిల్చి వారిని కన్నీటి సంద్రంలో ముంచిపోయారు. సంఘటనపై పోలీసుల ఏమంటున్నారంటే.. కల్యాణి, పూజిత ఆత్మహత్యలపై రైల్వే ఎస్ఐ రారాజును వివరణ కోరగా ఈ సంఘటనపై తల్లిదండ్రుల నుంచి అన్ని వివరాలు సేకరించామన్నారు. అయితే వారి వద్ద మృతికి సంబంధించిన ఎలాంటి సమాచారం లేదన్నారు. వీరి కళాశాల ప్రిన్సిపాల్స్‌తోపాటు స్నేహితులతో మాట్లాడాల్సి ఉందని వివరించారు. అలాగే మృతి చెందిన విద్యార్థినుల ఫోన్‌కాల్ డేటా గురించి కూడా ఆరా తీస్తున్నామని తెలిపారు. పూర్తి సమాచారం అందగానే మీడియాకు తెలియజేస్తామని ఆయన వివరించారు. -
ఘోర ప్రమాదానికి కారణమైన ఓవర్టేక్
సాక్షి, గుత్తి రూరల్: ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు ఓ వాహనాన్ని ఓవర్టేక్ చేసే క్రమంలో ఎదురుగా వచ్చిన లారీ కిందకు దూసుకుపోయి సజీవ దహనమైన దుర్ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. యాడికి మండలం భోగాలకట్ట గ్రామానికి చెందిన లారీ యజమాని దిద్దేకుంట రోషిరెడ్డి (64), నగరూరుకు చెందిన నారాయణరెడ్డి (40)తో కలిసి ఆదివారం గుత్తి మండలం బాచుపల్లి బాట సుంకులమ్మ ఆలయం వద్ద స్నేహితుడు చేస్తున్న జాతరకు ద్విచక్రవాహనంపై వెళ్లారు. జాతర ముగించుకుని తిరుగు పయనమయ్యారు. గుత్తి మండలం ఎంగిలిబండ గ్రామశివారులోని 67వ నంబరు జాతీయరహదారిపై ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్టేక్ చేసే క్రమంలో వేగం అదుపుకాక ఎదురుగా పాలిష్ బండల లోడ్‌తో వస్తున్న లారీ కిందకు దూసుకెళ్లారు. బైక్ ట్యాంక్ పగలడం..అదే సమయంలో రాపిడికి నిప్పు రవ్వలు ఎగసి పడడంతో మంటలు క్షణాల్లో వ్యాపించాయి. ప్రమాదం పసిగట్టిన లారీ డ్రైవర్, క్లీనర్ కిందకు దూకి పరారయ్యారు. లారీ కింద చిక్కుకున్న రోషిరెడ్డి, నారాయణరెడ్డి మంటల్లో చిక్కుకుని సజీవ దహనం అయ్యారు.రోషిరెడ్డికి భార్య సావిత్రమ్మ, ఇద్దరు కుమారులు, నారాయణరెడ్డికి భార్య కుళ్లాయమ్మ, కుమారుడు, కుమార్తె ఉన్నారు. (చదవండి: పెళ్లి కావట్లేదని తాయెత్తు కోసం వెళ్లి..) తప్పిన పెను ప్రమాదం.. ప్రమాద స్థలానికి 20 అడుగుల దూరంలోనే పెట్రోల్ బంకు ఉంది. నిప్పు రవ్వలు ఎగసి పెట్రోల్ బంకుపై పడి ఉంటే పెను ప్రమాదం జరిగి ఉండేది. అయితే మంటలు పెట్రోల్ బంకు వరకు వ్యాపించలేదు. లారీ పూర్తిగా కాలిపోయింది. గుంతకల్లు నుంచి అగ్నిమాపక వాహనం వచ్చి మంటలను అదుపు చేసింది. ఘటనా స్థలాన్ని సీఐ రాము, ఎస్ఐ గోపాలుడు పరిశీలించి కేసు నమోదు చేశారు. (చదవండి: బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకుల దుర్మరణం) -
పెన్నా సిమెంట్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు
సాక్షి, అనంతపురం: జిల్లాలోని పెన్నా సిమెంట్ ఫ్యాక్టరీలో శనివారం భారీ పేలుడు సంభవించింది. బాయిలర్లు పేలి భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. యాడికి మండలం బోయరెడ్డిపల్లిలోని పెన్నా సిమెంట్ ఫ్యాక్టరీ లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో అయిదుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరోవైపు మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తోంది. కాగా ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. -
చేతి పంపులకు మరమ్మతులేవీ?
సరైన వానలు లేక ఏటేటా భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. దీంతో బోర్లు , బావులు, చెరువులు ఎండిపోతున్నాయి. వేసవికాలం పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. కొన్ని గ్రామాల్లో తాగేందుకు గుక్కెడు మంచి నీళ్ళు కూడా దొరకని పరిస్థితి. కనీసం చేతి పంపు నీటితో నైనా గొంతు తడుపు కుందామనుకుంటే అవిమొరాయిస్తున్నాయి. నిధులను అధికారులు ఎక్కడ ఖర్చుచే స్తున్నారో ఏమో తెలియదు కానీ స్వాహచేస్తున్నారనేఆరోపణలు మాత్రం వినిపిస్తున్నాయి. సాక్షి, యాడికి: చేతి పంపుల మరమ్మతుల పేరుతో అధికారులు ధన దాహం తీర్చుకుంటున్నారు. కొంత మంది నాయకులు వీరికి సహకరిస్తున్నారు. తాడిపత్రి నియోజకవర్గంలో 4 మండలాల్లోని గ్రామాలన్నింటిలో మొత్తం దాదాపు 300 పైనే చేతి పంపులున్నాయి. వీటితో పాటు మోటార్ల ద్వారా నీరందించే బోర్లు మరో 200దాకా ఉన్నాయి. వాస్తవంగా ప్రతి 250బోర్లకు ఒక మెకానిక్ ఉండాలి. 500 బోర్లకు కూడా ఒక మెకానిక్ లేడు. దీంతో చేతి పంపుల నీటిపైనే ఆధారపడే గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. ఇక్కడ మరమ్మతులకు గురైన చేతిపంపులు బాగు చేయాలంటే సంవత్సరాలు పడుతుంది. మెకానిక్‌ల కొరత ఒక కారణమైతే వచ్చిన నిధులు కొందరు అధికారులు, అధికార పార్టీ నాయకులు స్వాహా చేయడం మరో కారణంగా కనిపిస్తోంది. యాడికి మండలంలో 154 చేతిపంపులు ఉంటే వాటిలో 45 బోర్లు పనిచేస్తున్నాయి. మిగిలిన 89 బోర్లు మరమ్మతులకు లోనయ్యాయి. నిధులు కరిగిపోయినా పనిచేయని బోర్లు నియోజక వర్గంలో మొత్తం300 దాకా బోర్లుండగా వీటిలో చాలా బోర్లు చిన్నచిన్న మరమ్మతులతో నిరుపయోగంగా మారాయి. అయితే వీటిని ఉపయోగంలోకి తీసుకొచ్చి వేసవిలో నీటి ఎద్దడి తీర్చాలనే లక్ష్యంతో ఒక్కో బోరుకు ఏడాదికి రూ.2వేల (ఆరు నెలలకోసారి1000) చొప్పున విడుదల చేస్తోంది. ఈ సీజన్‌కు సంబంధించి ఒక్కో బోరుకు రూ.1000 చొప్పున అక్టోబర్‌లోనే ఎంపీడీఓ ఖాతాలోక్లి నిధులు విడుదలైనట్లు సమాచారం. వీటితో అదనపు పైపులు, బోరు మరమ్మతులు, మెకానిక్(కాంట్రాక్టర్æ)ల కూలీ ఖర్చులకు వెచ్చించాలి. కానీ చాలా చోట్ల బోర్ల మరమ్మతులు చేయకుండానే చేసినట్లు చూపి మింగేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సొంత అవసరాలకు సామగ్రి జిల్లాలోని అనేక మంది అధికార పార్టీకి చెందిన సర్పంచులు , చేతిపంపులకు అదనపు పైపులు అవసరమని తీసుకెళ్ళారు. తర్వాత వాటిని వేయకుండా తమ సొంతానికి వాడుకుంటున్నారు. కొందరు పశువుల పాకలకు, రేకుల షెడ్లకు వినియోగించుకుంటున్నారు. ఈ విషయం అధికారులకు తెలిసినా చూడనట్లు వ్యవహరిస్తుండటం గమనార్హం. చాలా బోర్లు పనిచేయడం లేదు గ్రామంలో చాలా బోర్లు పనిచేయడంలేదు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అదనపు పైపులు కావాలని అధికారులకు చెప్పినా పట్టించు కోవడంలేదు. వీరారెడ్డిపల్లె బస్టాండులోనీరు దప్పిక ఐతే రెండు కి.మీ. దూరం వరకు పోయి దప్పిక తీర్చుకోవాల్సిందే. బస్టాండు దగ్గర ఉన్న చేతిపంపును మరమ్మతు చేయిస్తే నీటిసమస్య ఉండదు.–భీమేశ్వరెడ్డి, కమలపాడు తాజా మాజీ సర్పంచు, యాడికి సిబ్బంది లేక ఇబ్బందులు అక్కడక్కడా చేతి పంపులు దుస్థితికి చేరిన విషయం తెలిసిందే. చేతిపంపులు దెబ్బతిన్న విషయంపై సర్వే చేయిస్తాం. ఎక్కడైనా నీరుండి బోర్లు శిథిలమై ఉంటే వాటిని మరమ్మతులు చేయించడానికి చర్యలు తీసుకుంటాం. ఐతే మరమ్మతులు చేసేందుకు అవసరమైన సిబ్బందిలేరు. వీలైనంత వరకు వాటిని మరమ్మతులు చేసేందుకు చర్యలు తీసుకుంటాం. – ప్రవీణ్ కుమార్ ఆర్డబ్ల్యూఎస్ ఏఈ, యాడికి -
ఇద్దరు బుకీల అరెస్టు
యాడికి (తాడిపత్రి రూరల్) : యాడికిలో క్రికెట్ బెట్టింగ్ కేంద్రంపై ఆదివారం దాడులు నిర్వహించినట్లు ఎస్ఐ కత్తి శ్రీనివాసులు తెలిపారు. క్రికెట్ బెట్టింగ్ఆడుతున్న మణికిశోర్, అబ్దుల్‌రహీం అనే బుకీలను అరెస్టు చేసినట్లు వివరించారు. వారి నుంచి రూ.60 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. హత్యాయత్నం కేసులో మరొకరి అరెస్టు తాడిపత్రి రూరల్ : తాడిపత్రి శ్రీనివాసపురానికి చెందిన నాగభూషణం అనే నిందితుడ్ని హత్యాయత్నం కేసులో ఆదివారం అరెస్టు చేసినట్లు రూరల్ సీఐ సురేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. తాడిపత్రిలోని పప్పూరు రోడ్డులో గత నెల 24న జరిగిన రోడ్డు ప్రమాదంలో నందలపాడుకు చెందిన వెంకటరమణ అనే వ్యక్తి గాయపడిన సంగతి తెలిసిందే. అయితే పాత కక్షల నేపథ్యంలో తనను హత్య చేయాలన్న కుట్రతో తన ప్రత్యర్థులు టాటా సుమోతో ఢీకొట్టారంటూ బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే రెండ్రోజుల కిందట ముగ్గుర్ని అరెస్టు చేసిన పోలీసులు, తాజాగా నాగభూషణం అనే నిందితుడ్ని అరెస్టు చేశారు. అతన్ని కోర్టులో హాజరుపరచినట్లు వివరించారు. -
చిన్నారిని బలిగొన్న ట్రాక్టర్
యాడికి (తాడిపత్రిరూరల్) : యాడికి మండలం బొయిరెడ్డిపల్లిలో సోమవారం రాత్రి ట్రాక్టర్ ఢీకొని రెండేళ్ల చిన్నారి మృత్యువాతపడ్డాడు. పోలీసులు తెలిపిన మేరకు.. గ్రామానికి చెందిన ప్రసాద్, కుళ్లాయమ్మ దంపతుల కుమారుడు నాగచైతన్య(2) ఇంటి సమీపంలో బహిర్భూమికి వెళ్లాడు. వెనుకవైపు నుంచి ట్రాక్టర్ చిన్నారిపైకి దూసుకెళ్లింది. దీంతో నాగచైతన్య అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్ఐ కత్తిశ్రీనివాసులు సిబ్బందితో సంఘటన స్థలం చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం ట్రాక్టర్ డ్రైవర్ నారాయణస్వామి, యజమాని ఆదినారాయణలపై కేసు నమోదు చేసుకున్నారు. లైసెన్స్‌లు లేకుండా వాహనాలు నడిపితే కేసులు నమోదు చేస్తామని ఆయన వాహనదారులను హెచ్చరించారు. -
నిప్పంటించుకొని యువతి ఆత్మహత్య
యాడికి (తాడిపత్రి) : కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుని నాగలీల (17) ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల కేంద్రం యాడికిలో సోమవారం జరిగింది. స్థానికుల వివరాల మేరకు ... కోన రోడ్డులో నివాసముంటున్న నారాయణస్వామి కుమార్తె నాగలీల ఇంటర్మీడియట్ వరకు చదువుకుంది. కొద్ది రోజుల క్రితం ప్రమాదవశాత్తు కిందపడి తలకు గాయమైంది. మతిస్థిమితం కోల్పోయిన ఈమె కర్నూలులోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొంది, ప్రస్తుతం ఇంటి వద్దనే ఉంటోంది. సోమవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో కిరోసి¯ŒS పోసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఘటనా స్థలాన్ని ఏఎస్ఐ మల్లికార్జున పరిశీలించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. -
దొంగ దొరికాడు..
యాడికి: ఓ ఇంట్లో దొంగతనం చేసేందుకు వచ్చిన దొంగ.. పోలీసుల్ని చూసి హడావిడిగా ఇంటిపై నుంచి దూకి గాయాలపాలై దొరికిపోయాడు. యాడికి మండల కేంద్రంలో సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. శివ అనే వ్యక్తి యాడికి పాత పోలీస్‌స్టేçÙ¯ŒS సమీపంలోని ఓ ఇంట్లో సోమవారం రాత్రి దొంగతనానికి వెళ్లాడు. అదే సమయంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసుల దృష్టి అతడిపై పడింది. పోలీసుల్ని గమనించిన శివ తప్పించుకునే యత్నంలో ఇంటిపై నుంచి కిందకు దూకి గాయాలపాలయ్యాడు. దొంగను పోలీసులు 108లో తాడిపత్రి ఆస్పత్రికి తరలించారు. శివ గతంలో జరిగిన గాడిదల దొంగతనం కేసులో నిందితుడిగా ఉన్నట్లు ఎస్ఐ కత్తి శ్రీనివాసులు తెలిపారు. -
నంబర్ చెప్పమన్నాడు.. 25వేలు డ్రా చేసేశాడు!
యాడికి : బ్యాంకు ఖాతాదారుడికి అపరిచిత వ్యక్తి ఫోన్ చేసి అతడి నుంచి ఏటీఎం నంబరు తెలుసుకుని రూ.25వేల నగదు కాజేసిన మోసగాడి ఉదంతం ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితుడు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం బూరుగులకు చెందిన మధుసూదన్‌కు అనంతపురం జిల్లా యాడికి మండల కేంద్రంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్బీహెచ్) బ్రాంచిలో ఖాతా ఉంది. రెండు రోజుల క్రితం ఇతడికి అపరిచిత వ్యక్తి ఫోన్ చేసి ‘మేము బ్యాంకు నుంచి మాట్లాడుతున్నాం. మీ ఏటీఎం కార్డు నంబర్ చెప్పండి’ అని అడిగాడు. మధుసూదన్ మారుమాట్లాడకుండా నంబర్ చెప్పగానే కాసేపటికే రూ.25వేల నగదు విత్ డ్రా అయినట్టు మెసేజ్ వచ్చింది. ఖంగుతిన్న అతడు వెంటనే అపరిచిత వ్యక్తి నుంచి వచ్చిన నంబరుకు ఫోన్ చేయగా అది పనిచేయలేదు. దీనిపై బ్యాంకు అధికారులను సంప్రదించగా ఢిల్లీలో మీ అకౌంట్ నుంచి డబ్బు డ్రా చేసినట్లు చూపిస్తోందని చెప్పారు. ఫిర్యాదు చేయడానికని శుక్రవారం యాడికి పోలీసుస్టేషన్‌కు వెళితే బూరుగుల తమ మండల పరిధిలోకి రాదని పోలీసులు తిప్పి పంపారు. ఫేక్ ఫోన్‌కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని ఎస్బీహెచ్ మేనేజర్ సూచించారు. -
రిటైర్డ్ సర్వేయర్ ఆత్మహత్య
యాడికి : యాడికిలో రిటైర్డ్ సర్వేయర్ పీటర్(70) ఆదివారం ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ కత్తి శ్రీనివాసులు తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. పీటర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో పని చేసి రిటైర్డ్ అయ్యారు. ఆయన భార్య పదేళ్ల కిందటే మృతి చెందారు. వారికి ఇద్దరు కుమారులు కాగా, పెద్ద కుమారుడు ప్రైవేటు ల్యాబ్ టెక్నీషియన్‌గా పని చేస్తున్నారు. చిన్న కొడుకు ఉద్యోగరీత్యా వేరే ప్రాంతంలో ఉంటున్నాడు. తండ్రి రోజూ మద్యం తాగి రావడం నచ్చని పెద్ద కుమారుడు మరోచోట నివాసముంటున్నాడు. దీంతో పీటర్ ఒక్కరే ఇంటిలో ఉండేవారు. భోజనం పెట్టేవారు కూడా లేకపోగా, క్రిస్మస్ పండుగ రోజూ ఆకలిని తట్టుకోలేకపోయిన ఆయన చివరకు ఇంట్లోనే మద్యం తాగి, ఆ తరువాత ఉరేసుకుని తనువు చాలించారన్నారు. సాయంత్రం పీటర్ కోసం ఇంటికొచ్చిన ఓ వ్యక్తి గమనించి వెంటనే వారి బంధువులుకు సమాచారం అందించారని ఎస్ఐ తెలిపారు. కొడుకు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పీటర్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తాడిపత్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
విద్యార్థుల ఘర్షణపై పోలీసుల ఆరా
యాడికి: యాడికిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇద్దరు విద్యార్థుల మధ్య చెలరేగిన ఘర్షణలో ఒక విద్యార్థి గాయపడిన ఉదంతంపై ఏఎస్ఐ మల్లికార్జున తమ సిబ్బందితో కలసి మంగళవారం విచారణ చేశారు. వారు పాఠశాలకు చేరుకుని ప్రధానోపాధ్యాయుడు రాముడితో మాట్లాడారు. ఇటువంటి సంఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చూడాలన్నారు. ఏదైనా సంఘటన జరిగితే వెంటనే -
కబడ్డీ విజేత గుంతకల్లు జట్టు
యాడికి : పట్టణంలో నిర్వహించిన రంగనాథ జిల్లా స్థాయి కబడ్డీ పోటీల్లో గుంతకల్లు జట్టు విజేతగా నిలిచింది. రెండు రోజులుగా యాడికిలో నిర్వహిస్తున్న ఈ పోటీల్లో 40 జట్లు పాల్గొన్నాయి. గుంతకల్లు, యాడికి జట్లు ఫైనల్‌కు చేరుకున్నాయి. బుధవారం హోరాహోరీగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో గుంతకల్లు జట్టు విజేతగా నిలిచింది. ద్వితీయ, తతీయ స్థానంలో యాడికి జట్లు నిలిచాయి. విజేతలకు నగదు బహుమతులతో పాటు మెమొంటోలు అందజేశారు. బహుమతుల ప్రదానోత్సవంలో సౌత్ ఇండియన్ కేవీఐసీ చైర్మన్ చంద్రమౌళి, యాడికి ఎంపీపీ వేలూరు రంగయ్య, మాజీ ఉప సర్పంచ్ బాలా రమేశ్‌బాబు, జేవీవీ జిల్లా కార్యదర్శి అబ్దుల్ రజాక్, పీడీ మురళి, పీఈటీ సాల్మన్ సుప్రీం, నిర్వాహకులు బాబు, విశ్వనాథ్, కుమార్,సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఇద్దరు మహిళల ఆత్మహత్యాయత్నం
యాడికి: మండలకేంద్రం యాడికిలో గీత(40) అనే మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. మండల కేంద్రం కోట వీధిలో నివాసముండే గీత ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన బంధువులు ఆమెను 108 వాహనంలో తాడిపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అనంతపురానికి తరలించినట్లు బంధువులు తెలిపారు. అలాగే మండలంలోని కత్తిమానుపల్లిలో ఎల్లమ్మ(30) అనే మహిళ విష ద్రావకం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గ్రామానికి చెందిన బాలక్రిష్ణ భార్య ఎల్లమ్మ కుటుంబ కలహాలతో విష ద్రావకం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా, గమనించిన బంధువులు ఆమెను యాడికి ప్రభుత్వ వైద్యశాలకు,అక్కడి నుంచి తాడిపత్రికి తరలించారు. -
స్కూల్ ఆటో బోల్తా
పాఠశాల నుంచి ఇంటికి వెళుతుండగా సంఘటన విద్యార్థులంతా సురక్షితం స్కూల్ ఆటో బోల్తా పడి తృటిలో పెను ప్రమాదం తప్పిన సంఘటన బుధవారం మండలంలోని కత్తిమానుపల్లె గ్రామ సమీపాన జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు మండలంలోని ఉప్పలపాడు గ్రామానికి చెందిన 15 మంది విద్యార్థులు మండల కేంద్రంలోని ఒక ప్రైవేట్ పాఠశాలకు ఆటోలో వచ్చేవారు. ఈ క్రమంలో బుధవారం పాఠశాల వదిలిన తర్వాత ఆటోలో ఉప్పలపాడుకు వెళుతుండగా కత్తిమానుపల్లె గ్రామ సమీపాన ఎదురుగా వచ్చిన ఒక ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో 15 మంది విద్యార్థులు సురక్షితంగా బయటపడడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. -
మోసకారికి ప్రజలు ఇంకెలా బుద్ధి చెబుతారు?
అలాంటి మనిషిని చెప్పులతో కొడితే తప్పా: వైఎస్ జగన్మోహన్రెడ్డి - చంద్రబాబు ఒక్క హామీని నెరవేర్చకుండా రైతన్నల ఆత్మహత్యలకు కారకుడయ్యారు - ఓటుకు కోట్లు కేసుకు భయపడే అక్రమ ప్రాజెక్టులపై కేసీఆర్‌ను నిలదీయలేదు - ఎమ్మెల్యేల కొనుగోలుకు చంద్రబాబు రూ.600 కోట్లు ఖర్చు చేశారు -‘అనంత’లో 3వ రోజు రైతుభరోసా యాత్రలో విపక్ష నేత జగన్ సాక్షి ప్రతినిధి, అనంతపురం: ‘‘చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఒక్కటీ నెరవేర్చలేదు. ఈ రెండేళ్లలో రుణమాఫీ చేయకపోవడంతో ఆయన మాటలు నమ్మి మోసపోయి అప్పుల పాలైన రైతులు, చేనేతలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. చంద్రబాబు తప్పుడు హామీలే వీరి ఆత్మహత్యలకు కారణం. అనంతపురం జిల్లాలోనే ఇప్పటిదాకా 79 కుటుంబాలను పరామర్శించా. చంద్రబాబు రెండేళ్లపాలన పూర్తి అవినీతిమయం. వ్యక్తిగత స్వార్థం కోసం రాష్ట్ర భవిష్యత్తును పణంగా పెట్టి ప్రత్యేక హోదాను నీరుగారుస్తున్నారు. ఇలా అన్ని రకాలుగా ప్రజలను పూర్తిగా మోసం చేసిన మనిషిని చెప్పులతో కొడితే తప్పా? అని అడుగుతున్నా. కనీసం ప్రజలు చెప్పులు చూపించినప్పుడైనా జ్ఞానోద యమై ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలు గుర్తుకు వస్తాయి. అప్పుడు రైతు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తారు. ఇంటింటికీ ఉద్యోగం ఇస్తారు. నరేంద్రమోదీకి అల్టిమేటం ఇస్తారు’’ అని ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అనంతపురం జిల్లాలో సాగుతున్న ఐదోవిడత రైతు భరోసా యాత్రలో భాగంగా మూడోరోజు శుక్రవారం ఆయన తాడిపత్రి నియోజకవర్గంలోని యాడికి, పెద్దపప్పూరు మండలాల్లో పర్యటించారు. పెద్దపప్పూరు మండలం రామకోటిలో ఆత్మహత్యచేసుకున్న నాగరాజు కుటుం బాన్ని, ముచ్చుకోట గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న లీలా కృష్ణమూర్తి అనే రైతు కుటుంబానికి భరోసా కల్పించారు. యాడికిలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ప్రసంగం ఆయన మాటల్లోనే... ఆత్మహత్యలకు బాధ్యుడు చంద్రబాబే... ప్రభుత్వ మోసపూరిత హామీలతో ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు తోడుగా నిలబడి, ఆదుకునేందుకే రైతుభరోసా యాత్ర చేస్తున్నాం. అనంతపురం జిల్లాలోనే ఇప్పటిదాకా 79 కుటుంబాలను పరామర్శించా. వీరంతా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఎందుకు వచ్చిందని చంద్రబాబు ఒక్కసారి చేతులను గుండెలపై వేసుకుని సమీక్షించుకోవాల్సింది పోయి అంతా ఆనందంగా ఉన్నారని అవహేళన చేస్తూ అసెంబ్లీసాక్షిగా మాట్లాడారు. ‘ఎన్నికలప్పుడు ఏం చెప్పారు.. ఇప్పుడు మీరు చేస్తున్నదేమిటో ఒక్కసారి మీ మనస్సాక్షిని అడగండి. ఆత్మహత్యలకు మీది బాధ్యత కాదా?’ అని చంద్రబాబును నిలదీశాను. ‘బ్యాంకుల్లోని బంగారం ఇంటికి రావాలన్నా.. రుణాలు పూర్తిగా మాఫీ కావాలన్నా... చేనేత రుణాలు మాఫీ కావాలన్నా.. బాబు ముఖ్యమంత్రి కావాలి’ అని ఎన్నికలకు ముందు టీవీ ఆన్చేసినా, ఎక్కడ ఫ్లెక్సీలు చూసినా ప్రకటనలు కనిపించేవి. సీఎం పదవి కోసం ఎవ్వరినీ వదలకుండా అందరినీ మోసం చేశారు. జాబు కావాలంటే బాబు రావాలన్నారు. బాబుకు ముఖ్యమంత్రి జాబు వచ్చింది... కానీ ఆయన మాత్రం ఉన్న జాబులను తీసేస్తున్నారు. జాబు లేకపోతే ఇంటికి రూ.2వేల నిరుద్యోగభృతి ఇస్తామని ఆయన సంతకం ఉన్న కరపత్రాలను ప్రతి ఇంటికి పంపిణీ చేశారు. రాష్ట్రంలో 1.75 కోట్ల ఇళ్లకు భృతి ఇస్తామన్నారు. ఈ రెండేళ్లలో ఏ ఒక్కరికీ ఇవ్వలేదు. రైతులు, మహిళలు, చేనేతలు, నిరుద్యోగులు.. ఇలా అందరికీ వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒక్కటీ అమలు చేయకుండా మోసం చేశారు. ఈ రెండేళ్లలో ఆయన చేసిందేమిటంటే విచ్చలవిడి అవినీతి. ఇసుక నుంచి బొగ్గుదాకా, రాజధాని భూముల నుంచి దేవాలయ భూముల దాకా అవినీతికి తెగబడ్డారు. గుడిని, గుడిలో లింగాన్ని మింగుతున్నారు. ఇలాంటి వ్యక్తి సిగ్గులేకుండా అవినీతి గురించి, అవినీతి రహిత రాష్ట్రం గురించి మాట్లాడుతున్నారు. పిల్లలతో కూడా నవ నిర్మాణదీక్ష అంటూ ప్రమాణం చేయిస్తున్నారు. ప్రతిపక్షం లేకుండా చేసేందుకే.. ప్రజల గొంతు విన్పించకూడదని, ప్రతిపక్షం లేకుండా చేయాలనే దురుద్దేశంతోనే ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నావు. ఒక్కొక్కరికి రూ.30-40 కోట్లు ఖర్చు చేసి ఇప్పటివరకూ 18-19 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేశావు. దీనికి రూ. 600కోట్ల దాకా ఖర్చయ్యింది. ఈ డబ్బంతా ఎక్కడి నుంచి వ చ్చింది? ఇదంతా అవినీతి డబ్బని ఆరేళ్ల చిన్నపిల్లోళ్లకూ తెలుసు. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఎమ్మెల్యేను కొనుగోలు చేస్తూ, సూట్‌కేసుల్లో బ్లాక్‌మనీ నింపి ఇస్తూ ఆడియో, వీడియో రికార్డుల్లో అడ్డంగా చిక్కారు. తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం డ్యాంలోకి నీరు రాకుండా.. 800 అడుగుల నుంచే నీళ్లు తోడేందుకు ప్రాజెక్టులు నిర్మిస్తోంది. అయినా కృష్ణా, గోదావరిపై అక్రమ ప్రాజెక్టులు ఎలా నిర్మిస్తారని కేసీఆర్‌ను నిలదీయడం లేదు. దీనిపై ప్రశ్నిస్తే ఓటుకు కోట్లు కేసులో ఆడియో, వీడియో టేపులు బయటకు తీసి కేసీఆర్ జైళ్లో పెట్టిస్తారనే భయం. సీబీఐ కేసులకు భయపడే ప్రత్యేక హోదా నిర్వీర్యం ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలకు ప్రత్యేక రాయితీలు వస్తాయి. ఇన్‌కం ట్యాక్స్ భారం తగ్గుతుంది. రాయితీ కరెంటు వస్తుంది. మరిన్ని రాయితీలు వర్తిస్తాయి. దీంతో సింగపూర్, దుబాయికి వెళ్లకుండా పరిశ్రమలు మన రాష్ట్రానికే వస్తాయి. మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. ఇదంతా తెలిసినా చంద్రబాబు తన స్వార్థం కోసం ఐదుకోట్ల మందిని నడిరోడ్డున నిలబెట్టారు. ప్రత్యేకహోదా ఇవ్వకపోతే మా మంత్రులను కేంద్రం నుంచి ఉపసంహరించుకుంటామని ఎందుకు కేంద్రానికి అల్టిమేటం ఇవ్వలేదు? నరేంద్రమోదీని గట్టిగా అడిగితే రెండేళ్ల అక్రమాలపై సీబీఐ కేసులు నమోదు చేయించి జైలుకు పంపుతారని భయం. చేనేత కార్మికులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? చంద్రబాబు మాటలు నమ్మి అప్పుల పాలైన చేనేత కార్మికులు ఆత్మహత్యలకు తెగిస్తున్నారు. నిన్న పెద్దవడుగూరు మండలం క్రిష్టిపాడులో ఆత్మహత్య చేసుకున్న నాగరాజు అనే చేనేత కుటుంబాన్ని పరామర్శించా. కేవలం రూ.40వేలు రుణం మాఫీ కాక నాగరాజు చనిపోయారు. గతంలో ముడిసరుకుపై రూ.600-1000 సబ్సిడీ వచ్చేది. చేనేత రుణాలు మాఫీ చేస్తామని ఎన్నికల్లో చంద్రబాబు చెప్పారు. రుణాలు మాఫీ చేసి ప్రతి కుటుంబానికి రూ.లక్ష అదనంగా రుణాలు ఇస్తామన్నారు. అందరికీ ఇళ్లు కట్టిస్తాం, రూ.1.50 లక్షలతో షెడ్డు నిర్మిస్తామన్నారు... ఏవీ చేయలేదు. దీంతో ప్రతి చేనేత కార్మికుడు బోరున ఏడుస్తున్నారు. చేనేత కార్మికుల గోడు విన్పించలేదా? అని అసెంబ్లీలో గట్టిగా అడిగినా స్పందించలేదు. చంద్రబాబు ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపాలి చంద్రబాబు సీఎం అయ్యేనాటికి రూ. 87 వేల కోట్ల రుణాలుండేవి. ఈ రెండేళ్లలో వడ్డీనే రూ.25 వేల కోట్లయ్యింది. కానీ చంద్రబాబు వడ్డీలో మూడోవంతు కూడా మాఫీ చేయలేదు. పైగా ముష్టివేసినట్లు రూ.3వేలు ఇచ్చి డ్వాక్రా మహిళలకు అన్యాయం చేశారు. ఇలాంటి విషయాలపై నిలదీస్తే తప్పట! చంద్రబాబూ.. తప్పుచేస్తున్నావని గట్టిగా చెప్పడం నేరమట! సాక్షాత్తూ మీ ఎమ్మెల్యే (జేసీ ప్రభాకర్‌రెడ్డి) వార్నింగ్ ఇచ్చి చెబుతున్నారు. చంద్రబాబు ఎవర్ని మోసం చేసినా, వెన్నుపోటు పొడిచినా ప్రశ్నించకూడదట. తప్పుచేసినా ప్రశ్నించకపోతే ప్రజాస్వామ్యం బతకదు. తాడిపత్రి నియోజకవర్గంలో యాడికి కాలువ ఉంది. ఒక్కసారి గుండెలపై చేయివేసుకుని కాలువ ఎవరి హయాంలో వచ్చిందో చెప్పాలని తాడిపత్రి ఎమ్మెల్యేను అడగండి. ప్రస్తుతం కాలువకు నీళ్లురాక పండ్ల తోటలన్నీ ఎండిపోతున్నాయి. దీనికి కారణం చంద్రబాబే! ఆయనలో మార్పు రావాలంటే ప్రజలు ఒత్తిడి తీసుకురావాలి. ఎన్నికలు త్వరగా వస్తే.. టీడీపీ ప్రభుత్వం బంగాళాఖాతంలో కలిస్తే... అప్పుడు రైతులు, డ్వాక్రా మహిళలు, చేనేతలు, విద్యార్థులకు మంచి జరుగుతుంది. అందుకు మనమంతా కలసి పోరాడాలి. అందుకు మీ ఆశీస్సులు, తోడ్పాటు, దీవెనలు కావాలి. -
రూ. 600 కోట్లు ఎక్కడివి?
యాడికి: అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నా సీఎం చంద్రబాబుకు పట్టడం లేదని ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. అనంతపురం జిల్లాలో మూడో రోజు రైతు భరోసాయాత్రలో భాగంగా శుక్రవారం మధ్యాహ్నం యాడికిలో అశేష ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. అన్నివర్గాలను చంద్రబాబు మోసం చేశారని, తమ పాలనలో రైతులు ఆనందంగా ఉన్నారని అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని ఆరోపించారు. విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతూ ప్రతిపక్షాన్ని అణగతొక్కే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే... మండుతున్న ఎండను సైతం లెక్కచేయకుండా చిక్కటి చిరునవ్వుతో స్వాగతం పలికిన మీ అందరికీ ధన్యవాదాలు ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులకు భరోసా ఇచ్చేందుకే యాత్ర చేస్తున్నా రైతులు చాలా ఆనందంగా ఉన్నారని చంద్రబాబు అవహేళనగా మాట్లాడుతున్నారు ఎన్నికలకు ముందు చెప్పింది ఏమిటి తర్వాత చేస్తున్నదేమిటి? ఎన్నికలప్పుడు గ్రామగ్రామానికి తిరిగి రైతు రుణాలన్నీ బేషరుతుగా మాఫీ చేస్తామని చెప్పారు చేనేత కార్మికులకు రుణాలు పూర్తిగా మాఫీ కావాలంటే చంద్రబాబు సీఎం కావాలని ప్రచారం చేశారు తాను ముఖ్యమంత్రి కావడానికి రైతులను, డ్వాక్రా అక్కచెల్లెమ్మలను, చివరికి చదువుకుంటున్న చిన్నపిల్లలను మోసం చేశారు జాబు రావాలంటే బాబు రావాలని అన్నారు జాబు రాకుంటే ప్రతి ఇంటికి రూ. 2 వేలు ఇస్తానని హామీయిచ్చారు ఏ ఒక్కరికైనా నిరుద్యోగభృతి ఇచ్చారా అని అడుగుతున్నా రైతులను, డ్వాక్రా అక్కచెల్లెమ్మలను, చేనేత కార్మికులకు, విద్యార్థులను వెన్నుపోటు పొడిచాడు ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టుకోపోగా, విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారు రాష్ట్రంలో ఇసుక నుంచి గుడి భూములు అమ్మేదాకా అవినీతి చేస్తున్నారు ప్రజల తరపున ఎవరూ మాట్లాడకూడదా? ప్రతిపక్షం లేకుండా చేయాలన్న ఉద్దేశంతో ఎమ్మెల్యేలను కొంటున్నారు ఎమ్మెల్యేలను కొనడానికి రూ.600 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని చంద్రబాబును ప్రశ్నిస్తున్నాను తెలంగాణలో ఎమ్మెల్యేలను కొంటూ ఆడియో, వీడియో టేపులతో సహ చంద్రబాబు దొరికిపోయారు తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా సాగునీటి ప్రాజెక్టులు కడుతున్నా చంద్రబాబు అడగరేం? ఓట్లు కోట్లు కేసు మళ్లీ బయటకు తీస్తారన్న భయంతోనే నోరు విప్పడం లేదు తన స్వార్థం కోసం 5 కోట్ల మందిని నడిరోడ్డుపై నిలబెట్టారు రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రధాని నరేంద్ర మోదీని నిలదీసే ధైర్యం చంద్రబాబుకు లేదు ప్రత్యేక హోదా వచ్చివుంటే ఉద్యోగాలు, పరిశ్రమలు వచ్చేవి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే కేంద్రం నుంచి వైదొలుతామని ఎందుకు అనడం లేదు తన అవినీతిపై సీబీఐతో నరేంద్ర మోదీ దర్యాప్తు చేయిస్తారని భయంతో నోరు మెదపడం లేదు చంద్రబాదు మోసం, తప్పు చేసినా, వెన్నుపోటు పొడిచినా ఎవరు అడక్కూదట రుణాలు మాఫీ చేస్తానని చేయకపోవడం మోసం కాదా? పాలకుల ప్రజావ్యతిరేక విధానాలను ప్రశ్నించకపోతే ప్రజాస్వామ్యం బతకదు ఎన్నికలు వచ్చి చంద్రబాబు పాలన బంగాళాఖాతంలో కలిస్తే అందరికీ మంచి జరుగుతుంది అందరం ఒక్కటై చంద్రబాబు అసమర్థ పాలనపై పోరాడదాం -
యాడికిలో రైతు భరోసా యాత్ర ప్రారంభం.. ఉద్రిక్తత
అనంతపురం జిల్లా యాడికి నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతు భరోసా యాత్ర మూడోరోజు శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. అయితే, ఈ యాత్రను అడ్డుకునేందుకు టీడీపీకి చెందిన ఎంపీపీ వేలూరు రంగయ్య ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా బయల్దేరారు. బస్టాండ్ సెంటర్లో రెండుపార్టీల శ్రేణులు ఎదురుపడ్డాయి. దీంతో ఘర్షణలకు తావులేకుండా చూసేందుకు పోలీసులు టీడీపీ శ్రేణులను వెనక్కి పంపారు. దీనికి నిరసనగా టీడీపీ నాయకులు బస్టాండ్ సెంటర్లో బైఠాయించారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో వైఎస్ జగన్ రోడ్డుషో ఆలస్యం అయ్యింది. టీడీపీ శ్రేణులను పూర్తిగా పంపించిన తర్వాతే రోడ్డుషోకు లైన్ క్లియర్ అవుతుందని పోలీసులు చెబుతున్నారు. పోలీసులు భారీగా మోహరించి, 144 సెక్షన్ అమలు చేశారు. -
కాంగ్రెస్ నుంచి వైఎస్సార్ సీపీలో చేరిక
యాడికి, న్యూస్‌లైన్: కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు క్రియాశీలక నాయకులు ఆదివారం వైఎస్సార్సీపీలో చేరారు. తాడిపత్రి నియోజకవర్గ సమన్వయకర్త వీఆర్ రామిరెడ్డి, తాడిపత్రి మున్సిపాలిటీ మాజీ చైర్మన్ పేరం నాగిరెడ్డి ఆదివారం మండలంలోని ఓబుళాపురం గ్రామాన్ని సందర్భించారు. స్థానిక కాంగ్రెస్ నాయకుడు ఆదిరెడ్డి ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు. అనంతరం శంకర్‌రెడ్డి ఇంటికి వెళ్లి వీఆర్వో పుల్లారెడ్డి తదితరులతో మాట్లాడారు. అనంతరం గడపగడపకు వెళ్లి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. అనంతరం ఆదిరెడ్డి తమ్ముడు లక్ష్మిరెడ్డి, విష్ణునారాయం రెడ్డి, దామోదర్ రెడ్డిలకు వైఎస్సార్సీపీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో వారి వెంట బోగాలకట్ట వెంకటరామిరెడ్డి, కొట్టే వెంకటరామిరెడ్డి, యాపర్ల రామచంద్రారెడ్డి, కొండారెడ్డి, కాంగ్రెస్ మాజీ ఎంపీటీసీ గుర్రాల రామచంద్రుడు తదితరులు ఉన్నారు.