సాక్షి, గుత్తి రూరల్: ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు ఓ వాహనాన్ని ఓవర్‌టేక్ చేసే క్రమంలో ఎదురుగా వచ్చిన లారీ కిందకు దూసుకుపోయి సజీవ దహనమైన దుర్ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. యాడికి మండలం భోగాలకట్ట గ్రామానికి చెందిన లారీ యజమాని దిద్దేకుంట రోషిరెడ్డి (64), నగరూరుకు చెందిన నారాయణరెడ్డి (40)తో కలిసి ఆదివారం గుత్తి మండలం బాచుపల్లి బాట సుంకులమ్మ ఆలయం వద్ద స్నేహితుడు చేస్తున్న జాతరకు ద్విచక్రవాహనంపై వెళ్లారు. జాతర ముగించుకుని తిరుగు పయనమయ్యారు. గుత్తి మండలం ఎంగిలిబండ గ్రామశివారులోని 67వ నంబరు జాతీయరహదారిపై ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్‌టేక్ చేసే క్రమంలో వేగం అదుపుకాక ఎదురుగా పాలిష్ బండల లోడ్‌తో వస్తున్న లారీ కిందకు దూసుకెళ్లారు. బైక్ ట్యాంక్ పగలడం..అదే సమయంలో రాపిడికి నిప్పు రవ్వలు ఎగసి పడడంతో మంటలు క్షణాల్లో వ్యాపించాయి. ప్రమాదం పసిగట్టిన లారీ డ్రైవర్, క్లీనర్ కిందకు దూకి పరారయ్యారు. లారీ కింద చిక్కుకున్న రోషిరెడ్డి, నారాయణరెడ్డి మంటల్లో చిక్కుకుని సజీవ దహనం అయ్యారు.రోషిరెడ్డికి భార్య సావిత్రమ్మ, ఇద్దరు కుమారులు, నారాయణరెడ్డికి భార్య కుళ్లాయమ్మ, కుమారుడు, కుమార్తె ఉన్నారు. (చదవండి: పెళ్లి కావట్లేదని తాయెత్తు కోసం వెళ్లి..)
తప్పిన పెను ప్రమాదం..
ప్రమాద స్థలానికి 20 అడుగుల దూరంలోనే పెట్రోల్ బంకు ఉంది. నిప్పు రవ్వలు ఎగసి పెట్రోల్ బంకుపై పడి ఉంటే పెను ప్రమాదం జరిగి ఉండేది. అయితే మంటలు పెట్రోల్ బంకు వరకు వ్యాపించలేదు. లారీ పూర్తిగా కాలిపోయింది. గుంతకల్లు నుంచి అగ్నిమాపక వాహనం వచ్చి మంటలను అదుపు చేసింది. ఘటనా స్థలాన్ని సీఐ రాము, ఎస్‌ఐ గోపాలుడు పరిశీలించి కేసు నమోదు చేశారు. (చదవండి: బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకుల దుర్మరణం)
Comments
Please login to add a commentAdd a comment