యాడికిలో రైతు భరోసా యాత్ర ప్రారంభం.. ఉద్రిక్తత
అనంతపురం జిల్లా యాడికి నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రైతు భరోసా యాత్ర మూడోరోజు శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. అయితే, ఈ యాత్రను అడ్డుకునేందుకు టీడీపీకి చెందిన ఎంపీపీ వేలూరు రంగయ్య ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా బయల్దేరారు.
బస్టాండ్ సెంటర్‌లో రెండుపార్టీల శ్రేణులు ఎదురుపడ్డాయి. దీంతో ఘర్షణలకు తావులేకుండా చూసేందుకు పోలీసులు టీడీపీ శ్రేణులను వెనక్కి పంపారు. దీనికి నిరసనగా టీడీపీ నాయకులు బస్టాండ్ సెంటర్‌లో బైఠాయించారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో వైఎస్ జగన్ రోడ్డుషో ఆలస్యం అయ్యింది. టీడీపీ శ్రేణులను పూర్తిగా పంపించిన తర్వాతే రోడ్డుషోకు లైన్ క్లియర్ అవుతుందని పోలీసులు చెబుతున్నారు. పోలీసులు భారీగా మోహరించి, 144 సెక్షన్ అమలు చేశారు.