చేతి పంపులకు మరమ్మతులేవీ? | Hand Pumps Water Problems In Anantapur | Sakshi
Sakshi News home page

చేతి పంపులకు మరమ్మతులేవీ?

Published Mon, Nov 26 2018 12:24 PM | Last Updated on Mon, Nov 26 2018 12:24 PM

Hand Pumps Water Problems In Anantapur - Sakshi

వీరారెడ్డి పల్లె బస్టాండు వద్ద, కొట్టాపల్లెలో మరమ్మతులకు నోచుకోని చేతిపంపు

సరైన వానలు లేక ఏటేటా భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. దీంతో బోర్లు , బావులు, చెరువులు ఎండిపోతున్నాయి. వేసవికాలం పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. కొన్ని గ్రామాల్లో తాగేందుకు గుక్కెడు మంచి నీళ్ళు కూడా దొరకని పరిస్థితి. కనీసం చేతి పంపు నీటితో నైనా గొంతు తడుపు కుందామనుకుంటే అవిమొరాయిస్తున్నాయి. నిధులను అధికారులు ఎక్కడ ఖర్చుచే స్తున్నారో ఏమో తెలియదు కానీ స్వాహచేస్తున్నారనేఆరోపణలు మాత్రం వినిపిస్తున్నాయి.

సాక్షి, యాడికి: చేతి పంపుల మరమ్మతుల పేరుతో అధికారులు ధన దాహం తీర్చుకుంటున్నారు. కొంత మంది నాయకులు వీరికి సహకరిస్తున్నారు. తాడిపత్రి నియోజకవర్గంలో 4 మండలాల్లోని గ్రామాలన్నింటిలో మొత్తం దాదాపు 300 పైనే చేతి పంపులున్నాయి. వీటితో పాటు మోటార్ల ద్వారా నీరందించే బోర్లు మరో 200దాకా ఉన్నాయి. వాస్తవంగా ప్రతి 250బోర్లకు ఒక మెకానిక్‌ ఉండాలి. 500 బోర్లకు కూడా ఒక మెకానిక్‌ లేడు. దీంతో చేతి పంపుల నీటిపైనే ఆధారపడే గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. ఇక్కడ మరమ్మతులకు గురైన చేతిపంపులు బాగు చేయాలంటే సంవత్సరాలు పడుతుంది. మెకానిక్‌ల కొరత ఒక కారణమైతే వచ్చిన నిధులు కొందరు అధికారులు, అధికార పార్టీ నాయకులు స్వాహా చేయడం మరో కారణంగా కనిపిస్తోంది.

యాడికి మండలంలో 154 చేతిపంపులు ఉంటే వాటిలో 45 బోర్లు పనిచేస్తున్నాయి. మిగిలిన 89 బోర్లు మరమ్మతులకు లోనయ్యాయి. నిధులు కరిగిపోయినా పనిచేయని బోర్లు నియోజక వర్గంలో మొత్తం300 దాకా బోర్లుండగా వీటిలో చాలా బోర్లు చిన్నచిన్న మరమ్మతులతో నిరుపయోగంగా మారాయి. అయితే వీటిని ఉపయోగంలోకి తీసుకొచ్చి వేసవిలో నీటి ఎద్దడి తీర్చాలనే లక్ష్యంతో ఒక్కో బోరుకు ఏడాదికి రూ.2వేల (ఆరు నెలలకోసారి1000) చొప్పున విడుదల చేస్తోంది. ఈ సీజన్‌కు సంబంధించి ఒక్కో బోరుకు రూ.1000 చొప్పున అక్టోబర్‌లోనే ఎంపీడీఓ ఖాతాలోక్లి నిధులు విడుదలైనట్లు సమాచారం. వీటితో అదనపు పైపులు, బోరు మరమ్మతులు, మెకానిక్‌(కాంట్రాక్టర్‌æ)ల కూలీ ఖర్చులకు వెచ్చించాలి. కానీ చాలా చోట్ల బోర్ల మరమ్మతులు చేయకుండానే చేసినట్లు చూపి మింగేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సొంత అవసరాలకు సామగ్రి జిల్లాలోని అనేక మంది అధికార పార్టీకి చెందిన సర్పంచులు , చేతిపంపులకు అదనపు పైపులు అవసరమని తీసుకెళ్ళారు. తర్వాత వాటిని వేయకుండా తమ సొంతానికి వాడుకుంటున్నారు. కొందరు పశువుల పాకలకు, రేకుల షెడ్లకు వినియోగించుకుంటున్నారు. ఈ విషయం అధికారులకు తెలిసినా చూడనట్లు వ్యవహరిస్తుండటం గమనార్హం.

చాలా బోర్లు పనిచేయడం లేదు
గ్రామంలో చాలా బోర్లు పనిచేయడంలేదు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అదనపు పైపులు కావాలని అధికారులకు చెప్పినా పట్టించు కోవడంలేదు. వీరారెడ్డిపల్లె బస్టాండులోనీరు దప్పిక ఐతే రెండు కి.మీ. దూరం వరకు పోయి దప్పిక తీర్చుకోవాల్సిందే. బస్టాండు దగ్గర ఉన్న చేతిపంపును మరమ్మతు చేయిస్తే నీటిసమస్య ఉండదు.–భీమేశ్వరెడ్డి, కమలపాడు తాజా మాజీ సర్పంచు, యాడికి

సిబ్బంది లేక ఇబ్బందులు
అక్కడక్కడా చేతి పంపులు దుస్థితికి చేరిన విషయం తెలిసిందే. చేతిపంపులు దెబ్బతిన్న విషయంపై సర్వే చేయిస్తాం. ఎక్కడైనా నీరుండి బోర్లు శిథిలమై ఉంటే వాటిని మరమ్మతులు చేయించడానికి చర్యలు తీసుకుంటాం. ఐతే మరమ్మతులు చేసేందుకు అవసరమైన సిబ్బందిలేరు. వీలైనంత వరకు వాటిని మరమ్మతులు చేసేందుకు చర్యలు తీసుకుంటాం. – ప్రవీణ్‌ కుమార్‌ ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ, యాడికి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement