
మృతి చెందిన పూజిత (ఇన్‌సెట్) పూజిత (ఫైల్)
సాక్షి, అనంతపురం/ కడప కోటిరెడ్డిసర్కిల్: వారిద్దరూ చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు. యాడికిలో ఒకే బడిలో చదువుకున్నారు. ప్రాణం కంటే మిన్నగా వారి మధ్య స్నేహం చిగురించింది. ఆ స్నేహమే చివరికి వారిద్దరి ప్రాణాలను ఒకేసారి తీసుకునేటట్లు చేసింది. అనంతపురం జిల్లా యాడికి ప్రాంతానికి చెందిన ఇద్దరు స్నేహితురాళ్లు సోమవారం మధ్యాహ్నం కడప నగర పరిధిలోని భాకరాపేట రైల్వే గేటు వద్ద గూడ్స్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన కన్నవారికి తీరని శోకం మిగిల్చింది.
రైల్వే ఎస్‌ఐ రారాజు కథనం మేరకు... యాడికి మండలం కమలపాడు గ్రామానికి చెందిన కల్యాణి (18) గుత్తిలోని గేట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్ ఈసీఈ చదువుతోంది. ఈమె తండ్రి రామాంజనేయులు యాడికిలో కూల్‌డ్రింక్ షాపు నిర్వహించుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. యాడికి పట్టణంలోని హాస్పిటల్ కాలనీలో నివాసముంటున్న పూజిత (18) తాడిపత్రిలోని సరస్వతి డిగ్రీ కళాశాలలో బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదువుతోంది. వీరిద్దరూ వేములపాడు మోడల్ స్కూలులో ఇంటర్ వరకు కలిసి చదివారు.
చదవండి: (బ్యూటీ పార్లర్‌లో ఉద్యోగం అన్నారు.. రిసార్టులకు పంపి..)
ఈ క్రమంలో సోమవారం ఉదయం 9 గంటలకు యాడికిలో బయలుదేరి మధ్యాహ్నం కడపకు చేరుకున్నారు. 1.30 గంటల ప్రాంతంలో కడప సమీపంలోని భాకరాపేట (ఎర్రముక్కపల్లె) రైలు పట్టాల వద్దకు వెళ్లారు. ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుని ఆ సమయంలో వస్తున్న గూడ్స్ రైలు కిందపడ్డారు. సంఘటన స్థలంలోనే కల్యాణి మృతి చెందింది. శరీర భాగాలు విడిపోయాయి. మరో యువతి పూజిత ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుండగా రిమ్స్‌కు తరలిస్తుండగా మృతి చెందింది. ఇద్దరూ ఒకేసారి ప్రాణాలు ఎందుకు తీసుకున్నారో తెలియరాలేదు. రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. తల్లిదండ్రులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment