చిన్నారి మోక్షితతో పుష్పలత (ఫైల్) పుష్పలత పెళ్లి నాటి ఫొటో
సాక్షి, గార్లదిన్నె (అనంతపురం): అదనపు కట్నం తీసుకురాలేదన్న అక్కసుతో భార్యను, మూడు నెలల పసికందును హతమార్చిన ఘటన గార్లదిన్నె మండలం కల్లూరులో ఆదివారం వేకువజామున చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్నూలు జిల్లా బేతంచెర్ల మండలం సంకలాపురం గ్రామానికి చెందిన వెంకటేశులు, వెంకటేశ్వరమ్మ పెద్ద కుమార్తె పుష్పలత (24)ను గార్లదిన్నె మండలం కల్లూరుకు చెందిన కుమ్మర తరుణ్‌కుమార్‌కు ఇచ్చి 2020 డిసెంబర్ 24న వివాహం జరిపించారు. కట్న కానుకల కింద 30 తులాల బంగారం, రూ.10 లక్షల నగదు ఇచ్చారు. తరుణ్‌కుమార్ కల్లూరులో రైస్ మిల్లు నిర్వహించడంతో పాటు ఇటుకల వ్యాపారం కూడా చేస్తున్నాడు. పుష్పలతకు మూడు నెలల క్రితం ఆడబిడ్డ జన్మించింది. అప్పటి నుంచి అత్తింటి వారి వేధింపులు మొదలయ్యాయి. ఆడబిడ్డ పుట్టిందని సూటిపోటి మాటలు అనడంతో పాటు మరింత కట్నం తేవాలంటూ పుష్పలతను భర్త, అత్త, మామ వేధించేవారు.
చదవండి: (మహిళ, ఇద్దరు పిల్లలు చెరువులో దూకి ఆత్మహత్య.. మూడు రోజులుగా..)
ఆమె పది రోజుల క్రితం పసిబిడ్డతో కలిసి అత్తారింటికి వచ్చింది. రెండు రోజుల క్రితం పామిడి సంగమేశ్వర ఆలయంలో అభిషేకం చేయించి పాపకు మోక్షిత అని పేరు పెట్టారు. అయితే.. ఆదివారం తెల్లవారుజామున ఇంటి పైగదిలో పుష్పలత, చిన్నారి మోక్షిత విగతజీవులై కనిపించారు. ఈ విషయమై స్థానికుల నుంచి సమాచారం అందడంతో డీఎస్పీ ప్రసాద్‌రెడ్డి, సీఐ శివశంకర్ నాయక్, ఎస్‌ఐ కిరణ్‌కుమార్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. పుష్పలత తండ్రి వెంకటేశులు ఫిర్యాదు మేరకు భర్త తరుణ్‌కుమార్, మామ ఓబిలేసు, అత్త లక్ష్మిదేవి, ఓబిలేసు చిన్నల్లుడు హరిపై కేసు నమోదు చేసి.. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. భార్య పుష్పలతను గొంతు నులిమి హతమార్చినట్లు, పసికందు ముక్కును మూసి ఊపిరాడకుండా చేసి చంపేసినట్లు తరుణ్‌కుమార్ పోలీసుల ఎదుట అంగీకరించాడు.
రూ.50 లక్షలివ్వాలని వేధించారు..
అప్పులు తీర్చేందుకు రూ.50 లక్షలు తీసుకురావాలని తన కుమార్తెకు పదేపదే ఫోన్ చేసి అత్తింటివారు వేధించారని మృతురాలి తండ్రి వెంకటేశులు ఆరోపించారు. తాము కూడా అప్పుల్లో ఉన్నప్పటికీ కూతురి శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని మరో రూ.20 లక్షలు ఇచ్చామని తెలిపారు. అయినా అత్తింటి వేధింపులు ఆగలేదని, మిగిలిన డబ్బు తేవాలని ఒత్తిడి చేసేవారని వివరించారు. తన పరిస్థితి బాగోలేకపోవడంతో ఇక డబ్బివ్వలేనని చెప్పానని, దీంతో కూతుర్ని, ఆస్తికి అడ్డొస్తుందన్న కారణంతో మనుమరాలిని చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించాలని చూశారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment