
రోదిస్తున్న చిన్నారులు , సంఘటన జరిగిన ఇంటి బయట రక్తంతో పడి ఉన్న క్రికెట్ బ్యాట్
శ్రీకాకుళం పట్టణంలో ఘోరం జరిగింది. బొందిలీపురంలో అత్తా కోడళ్లు దారుణ హత్యకు గురయ్యారు. అంబేడ్కర్ జంక్షన్‌లో చెప్పుల దుకాణా న్ని నిర్వహిస్తున్న అబ్దుల్ ఖుదీష్ జిలానీ భార్య మెహర్‌ఉన్నీషా (37), తల్లి జోహాన్ బాయ్ అలియాస్ మెహర్(65)లు దుండగుల దాడిలో ప్రాణాలు కోల్పో యారు. గురువారం సాయంత్రం జిలానీ పిల్లలిద్దరూ పాఠశాల నుంచి వచ్చి తలుపులు కొట్టే సరికి ఎంతకీ తీయకపోవడంతో విషయాన్ని తండ్రికి ఫోన్ ద్వారా తెలియజేశారు. ఆయన వచ్చి చూడగా ఘోరం వెలుగు చూసింది.
శ్రీకాకుళం/శ్రీకాకుళం రూరల్: శ్రీకాకుళం నగరంలోని బొందిలీపురంలో అత్తాకోడళ్లను గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. అంబేడ్కర్ జంక్షన్‌లో చెప్పుల దుకాణాన్ని నిర్వహిస్తున్న అబ్దుల్ ఖుదీష్ జిలానీ అనే వ్యక్తి చాపురం పంచాయతీ పరిధి బొందిలీపురంలో విజయ్‌నగర్ కాలనీలోని ఓ గ్రూపు హౌస్‌లోని మూడో అంతస్తులో నివాసం ఉంటున్నాడు. ఇతను ప్రతిరోజు దుకాణానికి వెళ్లిపోగా కుమారులిద్దరూ ఉదయాన్నే స్కూల్‌కు వెళ్లిపోతారు. ఇంట్లో జిలాని భార్య మెహర్‌ఉన్నీషా(37), తల్లి జురాబాయ్(65)లు ఇంటిలోనే ఉంటారు. పిల్లలిద్దరూ ఉదయం 9 గంటలకు పాఠశాలకు వెళ్లి సాయంత్రం 5గంటలు కల్లా తిరిగి వచ్చేవారు. ప్రతీరోజులాగే గురువారం కూడా స్కూల్‌కి వెళ్లి తిరిగి వచ్చిన కుమారులు తలుపులు కొడుతుండగా ఎవ్వరూ తీయడం లేదు. ఈ విషయాన్ని తన తండ్రి జిలానీతో ఫోన్‌లో సంప్రదించగా ఎక్కడికో బయటకు వెళ్లి ఉంటారని కాసేపు ఆగమన్నాడు. తండ్రి సూచన మేరకు వారి చిన్నాన్న ఇంటికి వెళ్లి డూప్లికేట్ తాళాలు తీసుకొచ్చి తలుపులు తెరిచి చూడగా హాలులో రెండు మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఇంట్లో నగదు సుమారు రూ.4 లక్షలు, విలువైన బంగారం దోచుకెళ్లారని బాధితుడు జిలానీ పోలీసుల ముందు బోరునమన్నాడు.
చెల్లాచెదురుగా మృతదేహాలు
సంఘటన జరిగిన తీరు చూస్తే ఎన్నో అనుమానాలు కలుగుతున్నాయి. జిలానీ తన షాపుల నిమిత్తం జిల్లాలోని పలు ప్రాంతాల్లో కలెక్షన్‌లకు గురువారం ఉదయం వెళ్లాడు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో తమకు తెలిసిన బంధువు ఇంటికి వచ్చి వెళ్లినట్లు పోలీసులు వద్ద ప్రాథమిక సమాచారం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే సంఘటనా స్థలానికి రాత్రి పోలీసులు వచ్చి చూసేసరికి రెండు మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. అందులో మోహర్ ఉన్నీషా మృతదేహం హాలులో పడి ఉండగా ఆమె తలపై బలమైన గాయంతో పాటు రెండు చేతుల మణికట్లుమీద కోసి ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇక జూరాబాయ్ మృతదేహం వంటగదిలో పడి ఉంది. ఆమె తలకు, చేతులుపై బలమైన గాయాలున్నాయి.
హాల్‌లో ఉన్న ఉన్నీషా మృతదేహం, వంటగదిలో పడి ఉన్న జోహనాబాయ్ మృతదేహం
సంఘటనా స్థలంలో క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ పరిశీలన
విషయం తెలుసుకున్న స్థానిక పోలీసు ఉన్నతాధికారులు పనసారెడ్డి, భీమారావుతో పాటు క్లూస్‌టీం సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని అంతా పరిశీలించారు. ఇంతలో డాగ్‌స్కాడ్ చేరుకొని ముందుగా మృతదేహాలు ఉన్న రూములను పది నిమిషాలు పరిశీలించాక మేడమీదకు వెళ్లిన డాగ్ అక్కడ నుంచి నేరుగా విజయ్‌నగర్ కాలనీ నుంచి ద్వారకానగర్ దగ్గర సుమారు రెండు కిలోమీటర్లు దూరం వరకూ పరుగులు తీసింది.
చిందరవందరగా కాగితాలు, చెప్పులు
ఇంటికి ప్రవేశించిన పోలీసులు మూడు గదులను క్షుణ్ణంగా పరిశీలించారు. హాలులో ఒక మృతదేహం, వంట గదిలో కూరగాయాలు మధ్యలో ఇంకొక మృతదేహం పడి ఉన్నట్టు గుర్తించారు. ఇదిఇలావుండగా షోఫాసెట్‌పై రెండు సూట్‌కేసులు తెరిచి వాటిలో ఉన్న కాగితాలు, విలువైన పత్రాలన్నీ చెల్లచెదురుగా పడి ఉన్నాయి. అదేవిధంగా ఇంటి మొత్తం కారం జల్లి, నీటితో కొన్ని గదులను కూడా శుభ్రం చేసిన ఆనవాళ్ళు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జరిగిన సంఘటనను పరిశీలిస్తే మధ్యాహ్నం 2 గంటలు ప్రాంతంలో జరిగినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. రాత్రి 8గంటలు కల్లా తలుపులు తీయగా భయంకరమైన దుర్వాసన వచ్చింది. అయితే హత్య చేసిన అనంతరం బయటకు వచ్చి తాళాలు వేసి వెళ్లడంతో కుటుంబ సభ్యులు గాని బంధువులు గాని, తెలిసినవారుగాని సంఘటనలో పాల్గొన్నారా అన్న అనుమానాలను పోలీసులు వ్యక్తం చేస్తున్నారు.
కనిపించని సీసీ కెమెరాలు
సంఘటన జరిగిన గ్రూప్ హౌస్‌కు ఎక్కడా సీసీ కెమెరాలు లేవు. ఎవరు వస్తున్నారో ఎవరు వెళ్తున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. పైన జరిగిన విషయాలు కింద ఫ్లోర్ వారికి కనీసం తెలియని పరిస్థితి నెలకొంది. శ్రీకాకుళం పరిధిలో జరిగిన ఈ సంఘటన ఒక్కసారిగా నగరాన్ని ఉలిక్కి పడేలా చేసింది. స్థానికంగా ఉన్నవారంతా ఈ సంఘటనను చూసేందుకు తండోప తండాలుగా వస్తున్నారు.
కరుడుగట్టిన నేరస్థుల పనిలాసంఘటనా స్థలం
హత్యలకు పాల్పడింది కరుడుగట్టిన నేరస్తులేనా అన్న అనుమానాలను సంఘటనా స్థలం కలిగిస్తోంది. మృతదేహాల చుట్టూ కారం జల్లి ఉండడం చూస్తే డాగ్ స్క్వాడ్‌కు దొరకకుండా ఉండేందుకే ఈ పని చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. డాగ్ స్క్వాడ్ సంఘటనా స్థలం నుంచి వెనుక ఉన్న రోడ్డు మీదుగా తిలక్ నగర్ వరకు వెళ్లి అక్కడి నుంచి బొందిలీపురం స్కూల్ వరకు వెళ్లింది. అక్కడి నుంచి రెండువైపులా డాగ్ వెళ్లడంతో అక్కడినుంచి హత్యచేసినవారు రెండుగా విడిపోయి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా బొందిలీపురం వైపు డాగ్ కొంతదూరం వచ్చి మళ్లీ వెనుదిరిగి వెళ్లిపోయింది. అక్కడకు సమీపంలో సీసీ కెమెరాలు ఉండడంతో వీటిని గమనించి హత్య చేసినవారు వెనక్కు వెళ్లిపోయి ఉండవచ్చని పోలీసులు సందేహిస్తున్నారు. ఇటువంటి వాటిని పరిశీలిస్తే కరుడుగట్టిన వారే ఈ హత్యలకు పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. ఇంటిలో ఉన్న రూ. 4లక్షల నగదు, బంగారం పోయిందని జిలాని పోలీసులకు తెలిపారు. అయితే హత్య చేసిన అనంతరం బయటకు వచ్చి తాళాలు వేసి వెళ్లడంతో కుటుంబ సభ్యులు గాని బంధువులు గాని, తెలిసినవారుగాని సంఘటనలో పాల్గొన్నారా అన్న అనుమానాలను పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. సంఘటన జరిగిన ఇంటి ముందు ఓ క్రికెట్ బ్యాట్ పడి ఉండగా దానికి కూడా రక్తం ఉండడంతో దాంతో మోది హత్యచేసి ఉండవచ్చని భావిస్తున్నారు.
రోదిస్తున్న పిల్లలు
మృతురాలి పిల్లలు రోదిస్తున్న తీరు పలువురిని కలచివేసింది. మున్నీషా పెద్ద కుమారుడు జాఫర్ ఆర్‌సీఎం పాఠశాలలో పదో తరగతి చదువుతుండగా, చిన్న కుమారుడు బిషాన్ ఏడో తరగతి చదువుతున్నాడు. ముందుగా వీరిద్దరే ఇంటిలోకి ప్రవేశించి రక్తం మడుగులో పడి ఉన్న తల్లి, నాన్నమ్మ మృతదేహాలను చూడడంతో ఇప్పటికీ తట్టుకోలేకపోతున్నారు.
సంఘటనా స్థలాన్ని సందర్శించిన ఇన్‌చార్జి ఎస్పీ
ఇన్‌చార్జి ఎస్పీ టి.పనసారెడ్డి సంఘటనా స్థలాన్ని సందర్శించారు. దర్యాప్తు చేపట్టాల్సిన తీరుపై డీఎస్పీ, సీఐలకు సూచనలు ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment