
బాధితుడు సోమయ్య వద్ద ఫిర్యాదు రికార్డు చేస్తున్న ట్రైనీ ఎస్సై శ్యామల
శ్రీకాకుళం, ఇచ్ఛాపురం రూరల్: కని పెంచిన పాపానికి తండ్రిపైనే తనయులు దాడి చేశారు. ఆస్తి కోసం కన్నతండ్రి అని చూడకుండా స్పృహ కోల్పోయే వరకు విచక్షణారహితంగా చావబాదారు. ఈ దెబ్బలకు తాళలేక ఆసుపత్రి పాలైన ఘటన ఇచ్ఛాపురం మండలంలో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని టి.బరంపురం గ్రామం పాండురంగ వీధికి చెందిన కొయ్య సోమయ్యకు నలుగురు కొడుకులు. తొలి భార్యతో విడాకులు తీసుకుని మరొకరిని వివాహం చేసుకున్నాడు.
ఈ నేపథ్యంలో తొలిభార్యకు చెందిన నలుగురు కుమారులకు, రెండో భార్యకు ఆస్తిని సమానంగా పంపకాలు చేశాడు. అయితే మిగిలిన కొద్దిపాటి ఆస్తిపై తరచూ తండ్రీ కుమారుల మధ్య గొడవలు తలెత్తుతుండగా, గ్రామస్తులు పరిష్కరిస్తూ వస్తున్నారు. ఇదే విషయమై శుక్రవారం మరోమారు తండ్రితో కుమారులు పోలారావు, డొంబురు వాగ్వాదానికి దిగారు. దీంతో విచక్షణ కోల్పోయిన కుమారులిద్దరూ తండ్రిపై చేయి చేసుకున్నారు. అంతేగాకుండా బలంగా తలపై రాయితో కొట్టడంతో సోమయ్య అక్కడకక్కడే స్పృహ కోల్పోయాడు. దీంతో రెండో భార్య లక్ష్మమ్మ, అక్క సోభమ్మ ఆటోపై ఇచ్ఛాపురం సామాజిక ఆసుపత్రిలో చేర్పించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసు స్టేషన్ ట్రైనీ ఎస్సై డీ శ్యామల కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment