కిశోర్ మృతదేహంపై పడి విలపిస్తున్న తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు
శ్రీకాకుళం, లావేరు: నాగులచవితి సందర్భంగా తన కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా పుట్టలో పాలు పోశాడు. ఆనక ఎప్పటిమాదిరిగానే మద్యం షాపులో పనిచేసేందుకు వెళ్లిపోయాడు. ఇంతలోనే విద్యుత్ షాక్‌కు గురై తమ కుమారుడు మృత్యువాత పడ్డాడన్న పిడుగులాంటి వార్త విని వారు శోకసంద్రంలోకి మునిగిపోయారు. ఈ విషాద ఘటన మండలంలోని బొడ్డపాడు గ్రామంలో ఆదివారం నెలకొంది. విద్యుత్ సబ్‌స్టేషన్ షిఫ్ట్ ఆపరేటర్ ధనుంజయ్ నిర్లక్ష్యం వల్లేనని తమ కుమారుడు మృతి చెందాడని తండ్రి బాబూరావు లావేరు పోలీసులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశాడు. ఈ గ్రామానికి చెందిన ఆళ్ల కిశోర్(25)కు ఎటువంటి ఉద్యోగం రాకపోవడంతో ఆర్నెల్ల క్రితం బుడుమూరు గ్రామంలో ఓ మద్యం షాపులో పనికి కుదిరాడు.
ఈ క్రమంలో కుటుంబ సభ్యులతో నాగులచవితి పూజ చేసి, అనంతరం మద్యం షాపునకు వెళ్లాడు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఇక్కడ విద్యుత్ సబ్‌స్టేషన్ నుంచి మురపాక గ్రామానికి వెళ్తున్న హెచ్‌టీ విద్యుత్ లైన్ తీగలు తెగి పడ్డాయి. ఈ విషయాన్ని షిఫ్ట్ ఆపరేటర్‌కు కిశోర్ తెలియజేశాడు. మురపాక లైన్‌కు సరఫరా నిలిపివేస్తానని తెగిపడిన తీగలు పక్కకు తొలగించాలని షిఫ్ట్ ఆపరేటర్ సూచించాడు. ఆ విధంగా వేస్తున్న క్రమంలో విద్యుత్ సరఫరా చేశాడు. దీంతో కిశోర్ షాక్‌కు గురై సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. వెంటనే స్థానికులు ఈ విషయాన్ని మృతుడి తల్లిదండ్రులకు తెలియజేశారు. లావేరు ఏఎస్‌ఐ కృష్ణారావు, తన సిబ్బందితో వచ్చి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళంలోని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
కన్నీరుమున్నీరైన తల్లిదండ్రులు
ఎదిగొచ్చిన ఒక్కగానొక్క కొడుకు విద్యుత్‌షాక్‌తో మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న తల్లిదండ్రులు బాబూరావు, ఊర్వశి కన్నీరుమున్నీరయ్యారు. వీరితోపాటు సోదరి, బంధువులు అతడి మృతదేహంపై పడి గుండెలవిసేలా రోదించారు. గ్రామంలో అందరితో సన్నిహితంగా ఉండే యువకుడు మృతి చెందాడన్న వార్తతో గ్రామస్తులు జీర్ణించుకోలేకపోయారు.
షిఫ్ట్ ఆపరేటర్ నిర్లక్ష్యం వల్లే..
తెగిపడిన విద్యుత్ తీగలు పూర్తిగా తీసివేశారా లేదా అని షిఫ్ట్ ఆపరేటర్ తెలుసుకోకుండానే సరఫరా ఇచ్చారని, ఈ కారణంగానే తమ కుమారుడు షాక్‌తో మృతి చెందాడని, అతనిపై చర్యలు తీసుకోవాలని మృతుడు తండ్రి డిమాండు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment