ప్రాక్టికిల్స్‌.. | no preparations for practical examinations in dist | Sakshi
Sakshi News home page

ప్రాక్టికిల్స్‌..

Published Tue, Jan 9 2018 8:24 AM | Last Updated on Tue, Jan 9 2018 8:24 AM

no preparations for practical examinations in dist - Sakshi

ఇంటర్‌లో ఎంపీసీ, బైపీసీ అంటేనే ప్రయోగాల కోర్సులు. రెండేళ్ల చదువు పూర్తి చేసేలోపు భౌతిక, రసాయన, జంతు, వృక్ష శాస్త్రాలకు సంబంధించిన ప్రయోగాలు పూర్తి చేయాలి. ప్రయోగశాలకు వెళ్లి నేర్చుకోవాలి. చెట్టు, పుట్ట వెంబడి తిరిగి ఆకులు, పువ్వులు, మొక్కలు సేకరించాలి. ఇంటిలో ఉన్న బొద్దింకలతో పాటు కప్పలు, ఎర్రలు (వానపాములు) పట్టుకొని శస్త్రచికిత్సలు చేయాలి.. బొమ్మలు గీయాలి... రికార్డులు రాయాలి.. అప్పుడే ప్రాక్టికల్స్‌కు సిద్ధమైనట్టు. లేకపోతే ఫెయిల్‌.. మరో ఏడాది వేచి ఉండి ప్రాక్టికల్స్‌ రాస్తేనే ఉత్తీర్ణత.. ఇదంతా ఒకప్పటి మాట.. మరి ఇప్పుడేం జరుగుతోందంటే..

సాక్షి, సిద్దిపేట
కాలానికి అనుగుణంగా సిలబస్‌లో మార్పులొచ్చినా.. బోర్డు ఆఫ్‌ ఇంటర్మీడియట్‌ నిబంధనలు మారలేదు. అధ్యాపకులతో పాటు విద్యార్థులు ‘రెడీమేడ్‌’ ప్రయోగాలకు అలవాటు పడ్డారు. దానికి అనుగుణంగా పలు కళాశాలల్లో విద్యార్థులతో ప్రాక్టికల్స్‌ చేయించడం మరిచిపోయారు. పరీక్షలకు వచ్చే పరిశీలకులు, డిపార్టుమెంట్‌ ఆఫీసర్‌ను మచ్చిక చేసుకొని తమ విద్యార్థులకు కావాల్సినన్ని మార్కులు వేయించే పనిలో పలు ప్రైవేట్‌ కళాలల యాజమాన్యాలు ఇప్పటి నుండే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి.

ఫిబ్రవరి 2 నుంచి ఇంటర్‌ ప్రాక్టికల్స్‌
ఇంటర్మీడియట్‌ ప్రాక్టికల్స్‌ పరీక్షలు ఫిబ్రవరి 2 నుండి నిర్వహించాలని ఇంటర్‌ బోర్డు షెడ్యూల్‌ ప్రకటించింది. జిల్లా వ్యాప్తంగా 20 ప్రభుత్వ, 42 ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలలు, 14 మోడల్‌ స్కూల్స్, 12 సోషల్‌ వెల్ఫేర్‌ కళాశాలలు ఉన్నాయి. వీటి పరిధిలో ప్రథమ సంవత్సరంలో 12,101 మంది, ద్వితీయ సంవత్సరం 12,256 మొత్తం 24,357 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇందులో ఈ ఏడాది ప్రాక్టికల్స్‌ పరీక్షలకు హాజరయ్యే వారిలో 4,084 మంది ఎంపీసీ (ఫిజిక్స్, కెమిస్ట్రీ), 1,675 మంది బైపీసీ (ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజి) ప్రాక్టికల్స్‌ పరీక్షలు రాయాల్సి ఉంటుంది. అయితే వీరిలో ఇప్పటి వరకు సగానికి పైగా ప్రైవేట్‌ కళాశాలల్లో ప్రాక్టికల్స్‌ చేయించలేదనే ఆరోపణలున్నాయి.

మేనేజ్‌ చేసుకోవడమే మార్గం
విద్యార్థులతో ప్రాక్టికల్స్‌ చేయించలేదు. కానీ తమ కళాశాల విద్యార్థులకు మాత్రం స్టేట్‌ ర్యాంకులు రావాలి. అందరూ ఉత్తీర్ణులు కావాలి. అంటే ఒక్కటే ఒక్క మార్గం. ప్రాక్టికల్స్‌ పరీక్షల కోసం వచ్చే పరిశీలకులు తమకు అనువైన వారు కావాలి. అందుకోసం బోర్డు వద్దకు వెళ్లైనా అనుకూలమైన వారితో డ్యూటీ వేయించుకునే ప్రయత్నాలను పలు కళాశాలల యాజమాన్యాలు ఇప్పటికే మొదలు పెట్టినట్లు సమాచారం. అదేవిధంగా జిల్లా ఇంటర్‌ విద్యాధికారి నియమించే డిపార్టుమెంట్‌ అధికారిని కూడా తమకు అనుకూలమైన వారిని రప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. దీంతో విద్యార్థులకు ఏమీ తెలియకపోయినా.. నిర్దేశించిన మార్కులు వేయించుకోవచ్చనేది వారి ధీమా. అయితే ఇలా ఇంటర్‌లో అడ్డదారిన అధిక మార్కులు సాధించిన పలువురు విద్యార్థులు తమకున్న థియరీ పరిజ్ఞానంతో ఐఐటీ, మెడికల్, ఇంజనీరింగ్‌లో సీట్లు పొందినా.. అక్కడ ప్రాక్టికల్స్‌ చేయడం రాక, తోటి విద్యార్థుల ముందు చులకన కావడం, అవమానంగా భావిస్తూ ఉత్తమ ఫలితాలు సాధించలేక పోతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. విద్యార్థులను యంత్రం మాదిరిగా బట్టీ పట్టించి అధిక మార్కులు తెప్పిస్తున్నారని, ప్రాక్టికల్స్‌లో కూడిన బోధన లేకపోవడం విచారకరమని విద్యానిపుణులు అంటున్నారు.

సాధారణ పరిజ్ఞానం కరువు
పలువురు విద్యార్థులకు పిప్పెట్, బ్యూరెట్, ఘటం, ఆమ్లం, క్షారం, లవణం, వెర్నియర్‌ కాలిపస్, స్క్రూగేజీ, లఘులోలకం, అయస్కాంతం రకాలు, విద్యుత్‌ ప్రవాహం అంటే ఏమిటో తెలియదు. అదేవిధంగా ఏకదళ బీజం, ద్విదళ బీజం, కేసరాలు, అండాశయం, అంతర్‌ నిర్మాణాల గురించి అస్సలు తెలియని వారు కూడా ఉన్నారు. అదేవిధంగా జువాలజికి సంబంధించి డిటెక్షన్‌ అంటే తెలియదు. స్పెసిమిన్, స్లైడ్స్‌ గురించి అవగాహన లేనివారు ఉన్నట్లు పలువురు అధ్యాపకులే చెప్పడం విశేషం. దీంతో ఇటువంటి పరిస్థితిలో ఉన్న విద్యార్థులు రికార్డులు, హెర్బిరియం వంటికి రెడిమేడ్‌గా తీసుకువచ్చినా ప్రాక్టికల్స్‌ ఏం చేస్తారనేది ఆశ్చర్యకరమైన విషయం.

నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు..
జిల్లాలోని పలు ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలల్లో విద్యార్థులకు ప్రాక్టికల్స్‌ చేయించడం లేదనే ఫిర్యాదులు వచ్చాయి. ఈ విషయంపై కళాశాలల యాజమాన్యాలకు సర్క్యులర్లు పంపించాం. ప్రరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటాం. బోర్డు నిబంధనలు ఉల్లంగిస్తే చర్యలు తీసుకుంటాం.  – నర్సింహులు, జిల్లా ఇంటర్‌ విద్యాధికారి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement