ముట్టుకుంటే చిరిగిపోతుంది
తిరువనంతపురం: పెద్ద నోట్ల రద్దు అనంతరం సామాన్యుల చేతికి నోటు చిక్కడమే కష్టంగా మారింది. బ్యాంకులు, ఏటీఎంల వద్ద క్యూలలో నిలుచున్నా డబ్బు దొరికే పరిస్థితి కనిపించడం లేదు. ఎలాగోలా బ్యాంకు నుంచి 5 రెండు వేల కరెన్సీ నోట్లను పొందిన కేరళలోని ఓ మహిళకు మరో రకమైన అనుభవం ఎదురైంది. అందులో ఓ నోటు డ్రా చేసిన కొద్ది సమయానికే ముట్టుకుంటే చిరిగిపోవడం ప్రారంభించింది.
తాళిపరంబ టౌన్‌లోని ఫెడరల్ బ్యాంకు బ్రాంచ్ నుంచి పీసీ షరీఫా అనే మహిళ ఇటీవల 10 వేలు పొందింది. అందులో సీరియల్ నంబర్ 456828 ఉన్న రెండు వేల నోటు ముట్టుకుంటేనే చివర్లలో చిరిగిపోవడం ప్రారంభించింది. దీనిపై షరీఫా కుమారుడు షిమీల్ మాట్లాడుతూ.. మిగిలిన నాలుగు నోట్లు కూడా చిరిగిపోతుండటం గమనించానని, అయితే ఎలాగోలా వాటిని ఖర్చులకు వాడేశానని మీడియాతో వెల్లడించాడు. అయితే బాగా చిరిగిన నోటును ఎవరూ తీసుకోవడం లేదని, తిరిగి తీసుకోవాలని బ్యాంకు వారిని కోరగా.. వారు ఒప్పుకోలేదని తెలిపాడు. గంటల కొద్ది క్యూలో నిల్చున్న తరువాత గానీ ఈ నోట్లు దొరికాయని షరీఫా వెల్లడించింది. దీనిపై బ్యాంకు అధికారులు ఇంత వరకు స్పందించలేదు.