అక్రమ దారులు | As crumbling roads | Sakshi
Sakshi News home page

అక్రమ దారులు

Published Tue, Aug 25 2015 1:47 AM | Last Updated on Thu, Aug 30 2018 5:49 PM

అక్రమ దారులు - Sakshi

అక్రమ దారులు

నాసిరకంగా రోడ్ల నిర్మాణం
పర్యవేక్షణ తుస్..నాణ్యత నిల్
జీవీఎంసీ ఖజానా కాంట్రాక్టర్లకు ధారాదత్తం

 
రామాటాకీస్ నుంచి సీతమ్మధార అల్లూరి సీతారామరాజు విగ్రహం వరకూ రూ. 3.98 కోట్లతో హాట్‌మిక్స్ రోడ్డు నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణ పనులన్నీ అస్తవ్యస్తంగా జరుగుతున్నాయి. రోడ్డు నిర్మాణంలో ఎక్కడా నిబంధనలు పాటించడం లేదు. టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ చేపట్టాల్సిన ఈ పనిని సబ్ కాంట్రాక్టర్‌కు ఇవ్వడంతో పనుల్లో నాణ్యత వదిలేశారని అంటున్నారు. అందుకే ఈ రోడ్డు బాగోతం ముందుగానే గ్రహించిన ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు శంకుస్థాపన చేసేందుకు ముఖం చాటేశారని  అంటున్నారు.
 
విశాఖపట్నం సిటీ:  వచ్చే ఏడాది జరిగే నేవీ ఫ్లీట్ రివ్యూ కోసం నగర వ్యాప్తంగా తారు రోడ్ల నిర్మాణాలు భారీ ఎత్తున జరుగుతున్నాయి.  రూ. 50 కోట్లకు పైనే ఈ రోడ్ల కోసం జీవీఎంసీ వె చ్చిస్తోంది.  డిసెంబర్ వరకు నిరంతరం సాగే ఈ రోడ్ల నిర్మాణం కోసం రానున్న రోజుల్లో మరో రూ. 50 కోట్ల వరకు వెచ్చించేందుకు జీవీఎంసీ సిద్ధంగా ఉంది. అయితే  పనుల్లో ఎక్కడా  నాణ్యత అనే మాట ఊసెత్తకుండా పనులు జరిగిపోతున్నాయి. కమిషనర్ చూసినా, క్వాలిటీ కంట్రోల్ అధికారులు చూసినా  నాణ్యతను పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నగరంలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా రోడ్ల నాణ్యతపై  దృష్టి సారించిన దాఖలాలు లేవు. ఇంజినీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు కలిపి జీవీఎంసీ ఖజానాను కొల్లగొడుతున్నారని బహిరంగంగానే ఆరోపణలు వినిపిస్తున్నాయి.  

అసలు ఎలా రోడ్లేయాలి
రహదారులు వేసే ముందుగా ప్యాచ్ పనులను పూర్తి చేయాలి. రోడ్ల మధ్యలో ఉన్న  గోతులను శుభ్రం చేసి ఎమల్షూన్ స్ప్రే చేయాలి. ఆ తర్వాత కాస్త పెద్ద సైజ్‌లో ఉండే మెటల్ వేయాలి. సాధారణంగా 50 ఎంఎం మందం (థిక్‌నెస్) కోసం బిటుమిన్ మెకడం కాంక్రీట్ ఫస్ట్ సర్ఫేస్ వేయాలి.

ఆ తర్వాత వైప్రో రోలర్‌తో తొక్కించాలి. ఈ రోలింగ్ వల్ల భారీ వైబ్రేషన్‌తో రోడ్డుపై వేసిన బిటుమిన్ బాగా బిగుసుకుపోతుంది. దీంతో బిటుమిన్‌కు బిటుమిన్ అంటుకుపోయి రోడ్డు నునుపుగా వచ్చేస్తుంది. అప్పుడు స్టాటిక్ రోలర్‌తో మళ్లీ తొక్కిస్తారు.దానిపై మళ్లీ ఎమల్షూన్ స్ప్రే చేయాలి. ఆ తర్వాత సెమీ డెన్సిటీ బిటుమిన్ కాంక్రీట్ (ఎస్‌డీబీసీ)ను 25 ఎంఎం మందం వేస్తారు.
 అంచుల వద్ద 25 ఎంఎం ఎస్‌డీబీసీ వేసి వైప్రో రోలర్‌తో  సరిచేస్తారు. దీంతో రోడ్డు అందంగా కనిపించడంతో పాటు వర్షం పడినా రోడ్డుపై  ఒక్క చినికూ నిలవదు. మధ్యాహ్నం పూట ఎండకు మెరుస్తూ రోడ్డు చెక్కుచెదరకుండా  నాణ్యతతో ఉంటుంది. ఇలా వేసిన రోడ్డు నిర్మాణం కనీసం అయిదారేళ్ల పాటు పాడవదు. భారీ వర్షాలు పడితే గోతులు పడిన చోట మాత్రం కాస్త బిటుమిన్ లేస్తుంది. అంత కన్నా రోడ్డు పాడయ్యే అవకాశం ఉండదని  నిపుణులు చెబుతున్నారు.

ఎలా వేస్తున్నారంటే..!
 ప్యాచ్ వర్క్‌లు చేయరు. రోడ్డును మాత్రం గాలితో శుభ్రం చేస్తారు. ఆ తర్వాత ఏకంగా మెటల్ వేసుకుపోతారు. ఆ తర్వాత ఎంత మందం రోడ్డు కనిపించాలో అంతే మందం రోలర్ లో ఫిక్స్ చేయడం వల్ల అంతకన్నా గట్టిగా రోల్ చేయదు. దీంతో మందం కనిపించినా నాణ్యత అంతా గుల్ల. పైకి కనిపించినంత నాణ్యత రోడ్డులో లేకపోవడంతో వేసిన కొన్ని నెలల్లోనే తారు రోడ్డు గల్లంతవుతోంది.   
 
 తారులోనే మాయ!
 జీవీఎంసీ రోడ్ల నిర్మాణంలోని మాయ అంతా ఇంతా కాదు. తారులోనే సగం మాయ చేసి రోడ్లు నిర్మిస్తున్నారు. అయిదు శాతం బిటుమిన్(తారు)కు బదులు   3 శాతం కన్నా తక్కువే  వాడుతున్నారు. తారు రోడ్డుకు ప్రధాన శత్రువు నీరు. వర్షం పడగానే బిటుమిన్ శాతం తక్కువగా ఉన్న రోడ్డులో ఇంకిపోతుంది. ఇంకిపోయిన నీరు క్రమంగా మెటల్‌ను తారు నుంచి వేరు చే స్తుంది. దీంతో మెటల్ లేచిపోయి రోడ్డు కొద్ది రోజులకే అధ్వానంగా తయారవుతుంది.   పాత రోడ్డుకు కొత్త రోడ్డును కలిపే టేక్ కోట్ బైండింగ్ కూడా నాణ్యతా లోపం వల్ల రోడ్లు త్వరగా పాడవుతున్నాయి. హాట్‌మిక్స్ రోడ్డు వేస్తే కనీసం అయిదేళ్లు ఉండాలి. అలా లేదంటే లోపాలున్నట్టే!
 -ఆర్‌అండ్‌బీలోని క్వాలిటీ కంట్రోల్ అధికారి
 
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement