ప్రభుత్వ మందుల్లో 10 శాతం నాసిరకమే
న్యూఢిల్లీ: ప్రభుత్వం సరఫరా చేస్తున్న ఔషధాల్లో 10 శాతానికి పైగా నాసిరకమైనవని ఆరోగ్య శాఖ సర్వేలో తేలింది. రిటైల్ దుకాణాల్లోని నాసిరకం మందులతో పోల్చితే ఇవి మూడు రెట్లని తెలిసింది. ఔషధాల నాణ్యతను గుర్తించేందుకు చేపట్టిన అతిపెద్ద సర్వే ఇదేనని ప్రభుత్వం తెలిపింది. సర్వే కోసం సేకరించిన రిటైల్ దుకాణాల నమూనాల్లో 3శాతం నాసిరకమైనవని, 0.023 శాతం కల్తీవని కనుగొన్నారు.
ఔషధాల సేకరణ కోసం ఎంపిక చేసే తయారీదారుల అర్హత ప్రమాణాలకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వ ఏజెన్సీలు పునఃసమీక్షించుకోవాలని సర్వే జరిపిన ఆరోగ్య మంత్రిత్వ శాఖ పరిధిలోని స్వతంత్ర సంస్థ సూచించింది. సర్వేలో సుమారు 47,954 నమూనాలను 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 654 జిల్లాల నుంచి సేకరించారు.