ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో దిగువకు ప్రవహిస్తున్న నీటిని వీక్షించేందుకు వచ్చిన జనం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంతో పాటు ఎగువ ప్రాంతాల్లో రెండు, మూడు రోజులుగా కురుస్తున్న వానలతో నదుల్లో ప్రవాహాలు పోటెత్తుతున్నాయి. గోదావరి నది అయితే ఉప్పొంగి ప్రవహిస్తోంది. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత జూలైలోనే శ్రీరాంసాగర్ సహా గోదావరి బేసిన్ ప్రాజెక్టులన్నీ నిండిపోయాయి. గోదావరి, ఉప నదులపై ఉన్న అన్ని ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలేస్తున్నారు. మరోవైపు కృష్ణా బేసిన్‌లోనూ ప్రవాహాలు పెరిగాయి. ఎగువన కర్ణాటకలోని ప్రాజెక్టులన్నీ నిండిపోవడంతో వస్తున్న వరద అంతా శ్రీశైలం, నాగార్జునసాగర్ వైపు ప్రవహిస్తోంది. కేంద్ర జల సంఘం పరీవాహక రాష్ట్రాలకు అప్రమత్తత హెచ్చరికలు జారీ చేసింది.
గోదావరిలో ఫుల్
ఎగువ రాష్ట్రాల నుంచి పెరిగిన ప్రవాహాలు ఓవైపు.. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల మరోవైపు నదులకు వరద పెరిగింది. గోదావరిపై శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిండిపోయింది. గురువారం సాయంత్రానికి ప్రాజెక్టులో 90 టీఎంసీల సామర్థ్యానికిగాను 89.76 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. మూడు లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండటంతో.. 36 గేట్లు ఎత్తి ఐదు లక్షల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. ఈ వరద కాళేశ్వరం బ్యారేజీలను దాటి దిగువకు వెళ్లనుంది. ఇప్పటికే ప్రాణహిత ఉధృతితో మేడిగడ్డ బ్యారేజీ వద్ద 2 లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఉంది. 35 గేట్లు ఎత్తి నీటిని వదిలేస్తున్నారు. ఎస్సారెస్పీ ప్రవాహాలు చేరితే మొత్తం గేట్లన్నీ ఎత్తివేయనున్నారు. మిడ్‌మానేరు, లోయర్ మానేరు, కడెం ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేశారు.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి విడుదలవుతున్న నీరు
కృష్ణాలో జోష్: కృష్ణా నదిలో ఎగువన కర్ణాటక ప్రాజెక్టులు ఆల్మట్టి, నారాయణపూర్ నిండిపోయాయి. నారాయణపూర్ నుంచి లక్షా 28 వేల క్యూసెక్కులను వదులుతున్నారు. జూరాల, శ్రీశైలానికి వరద పెరుగుతోంది. గురువారం సాయంత్రానికి జూరాలకు 70 వేల క్యూసెక్కులు వస్తుండగా.. 69 వేల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. శ్రీశైలానికి 63 వేల క్యూసెక్కులు ఇన్‌ఫ్లో ఉండగా.. నీటి నిల్వ 215 టీఎంసీల సామర్థ్యానికిగాను 72.05 టీఎంసీలకు చేరింది. శ్రీశైలం నుంచి 21 వేల క్యూసెక్కులు నాగార్జునసాగర్‌కు చేరుతున్నాయి. కర్ణాటకలో భారీ వర్షాలు పడుతుండటంతో కృష్ణానదిలో ఒకట్రెండు రోజుల్లో మూడు నాలుగు లక్షల క్యూసెక్కుల ప్రవాహం వచ్చే అవకాశాలు ఉన్నాయని కేంద్ర జల సంఘం అంచనా వేసింది. ఇక ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మూసీ ప్రాజెక్టు నిండిపోవడంతో ఆరు గేట్లు ఎత్తి నీటిని వదులుతున్నారు. రాష్ట్రంలో మధ్యతరహా ప్రాజెక్టులన్నీ జలకళ సంతరించుకున్నాయి. గోదావరి బేసిన్‌లోని 28, కృష్ణా బేసిన్‌లోని 8 ప్రాజెక్టులు నిం డాయి. అలాగే చెరువులు అలుగు దుంకుతున్నా యి. గురువారం నాటికి 4,698 చెరువులు నిండిపో గా మరో 7,574 చెరువులు నిండిపోయే దశకు చేరా యి. మరో 9 వేలకుపైగా చెరువులు సగానికిపైగా నిండినట్టు నీటిపారుదల శాఖ వర్గాలు తెలిపాయి.