krishan River
-
Telangana: భారీ వర్షాలు.. ప్రాజెక్టులన్నీ ఫుల్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంతో పాటు ఎగువ ప్రాంతాల్లో రెండు, మూడు రోజులుగా కురుస్తున్న వానలతో నదుల్లో ప్రవాహాలు పోటెత్తుతున్నాయి. గోదావరి నది అయితే ఉప్పొంగి ప్రవహిస్తోంది. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత జూలైలోనే శ్రీరాంసాగర్ సహా గోదావరి బేసిన్ ప్రాజెక్టులన్నీ నిండిపోయాయి. గోదావరి, ఉప నదులపై ఉన్న అన్ని ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలేస్తున్నారు. మరోవైపు కృష్ణా బేసిన్లోనూ ప్రవాహాలు పెరిగాయి. ఎగువన కర్ణాటకలోని ప్రాజెక్టులన్నీ నిండిపోవడంతో వస్తున్న వరద అంతా శ్రీశైలం, నాగార్జునసాగర్ వైపు ప్రవహిస్తోంది. కేంద్ర జల సంఘం పరీవాహక రాష్ట్రాలకు అప్రమత్తత హెచ్చరికలు జారీ చేసింది. గోదావరిలో ఫుల్ ఎగువ రాష్ట్రాల నుంచి పెరిగిన ప్రవాహాలు ఓవైపు.. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల మరోవైపు నదులకు వరద పెరిగింది. గోదావరిపై శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిండిపోయింది. గురువారం సాయంత్రానికి ప్రాజెక్టులో 90 టీఎంసీల సామర్థ్యానికిగాను 89.76 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. మూడు లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండటంతో.. 36 గేట్లు ఎత్తి ఐదు లక్షల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. ఈ వరద కాళేశ్వరం బ్యారేజీలను దాటి దిగువకు వెళ్లనుంది. ఇప్పటికే ప్రాణహిత ఉధృతితో మేడిగడ్డ బ్యారేజీ వద్ద 2 లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఉంది. 35 గేట్లు ఎత్తి నీటిని వదిలేస్తున్నారు. ఎస్సారెస్పీ ప్రవాహాలు చేరితే మొత్తం గేట్లన్నీ ఎత్తివేయనున్నారు. మిడ్‌మానేరు, లోయర్ మానేరు, కడెం ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేశారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి విడుదలవుతున్న నీరు కృష్ణాలో జోష్: కృష్ణా నదిలో ఎగువన కర్ణాటక ప్రాజెక్టులు ఆల్మట్టి, నారాయణపూర్ నిండిపోయాయి. నారాయణపూర్ నుంచి లక్షా 28 వేల క్యూసెక్కులను వదులుతున్నారు. జూరాల, శ్రీశైలానికి వరద పెరుగుతోంది. గురువారం సాయంత్రానికి జూరాలకు 70 వేల క్యూసెక్కులు వస్తుండగా.. 69 వేల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. శ్రీశైలానికి 63 వేల క్యూసెక్కులు ఇన్‌ఫ్లో ఉండగా.. నీటి నిల్వ 215 టీఎంసీల సామర్థ్యానికిగాను 72.05 టీఎంసీలకు చేరింది. శ్రీశైలం నుంచి 21 వేల క్యూసెక్కులు నాగార్జునసాగర్‌కు చేరుతున్నాయి. కర్ణాటకలో భారీ వర్షాలు పడుతుండటంతో కృష్ణానదిలో ఒకట్రెండు రోజుల్లో మూడు నాలుగు లక్షల క్యూసెక్కుల ప్రవాహం వచ్చే అవకాశాలు ఉన్నాయని కేంద్ర జల సంఘం అంచనా వేసింది. ఇక ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మూసీ ప్రాజెక్టు నిండిపోవడంతో ఆరు గేట్లు ఎత్తి నీటిని వదులుతున్నారు. రాష్ట్రంలో మధ్యతరహా ప్రాజెక్టులన్నీ జలకళ సంతరించుకున్నాయి. గోదావరి బేసిన్‌లోని 28, కృష్ణా బేసిన్‌లోని 8 ప్రాజెక్టులు నిం డాయి. అలాగే చెరువులు అలుగు దుంకుతున్నా యి. గురువారం నాటికి 4,698 చెరువులు నిండిపో గా మరో 7,574 చెరువులు నిండిపోయే దశకు చేరా యి. మరో 9 వేలకుపైగా చెరువులు సగానికిపైగా నిండినట్టు నీటిపారుదల శాఖ వర్గాలు తెలిపాయి. -
విషాదం: ఒక్కసారిగా కృష్ణాలో దూకిన బీటెక్ విద్యార్థి
సాక్షి, తాడేపల్లి: స్నేహితులతోపాటు సరదాగా కృష్ణానదికి వచ్చిన బి.టెక్. విద్యార్థి అనంత లోకాలకు వెళ్లడంతో స్నేహితులు, విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు శోక సముద్రంలో మునిగిపోయారు. సేకరించిన వివరాల ప్రకారం.. విజయవాడ కృష్ణలంకకు చెందిన బి.టెక్ 4వ సంవత్సరం చదివే సాయి (20), అవినాష్ అనే స్నేహితుడు, మరో ఐదుగురితో కలిసి ఉండవల్లి-అమరావతి కరకట్ట వెంట ఉన్న ఆక్వా డెవిల్స్‌లోకి ఈతకు వెళ్లారు. అవినాష్, మరో ఐదుగురు కృష్ణానదిలోకి దిగి ఈత కొడుతుండగా సాయి గట్టు మీద నుంచొని ఉన్నాడు. మరి ఏం జరిగిందో ఏంటో తెలియదు కానీ స్నేహితులు ఈత కొట్టడం చూసి ఒక్కసారిగా గట్టు మీద నుంచి కృష్ణానది నీటిలోకి దూకాడు. దూకిన సాయి మునిగిపోయి కనిపించకపోవడంతో ఆక్వా డెవిల్స్ సిబ్బంది వెదికి, బయటకు తీయగా సాయి మృతి చెందినట్లు గుర్తించారు. ఈ ఘటనపై సాయి తల్లిదండ్రులు ఎటువంటి ఫిర్యాదు చేయలేదు. సాయి మృతదేహాన్ని స్నేహితులు విజయవాడ తీసుకువెళ్లారు. సాయి వారి తల్లిదండ్రులకు ఏకైక కుమారుడిగా తెలియవచ్చింది. నలుగురు జూదరుల అరెస్ట్ చిట్టినగర్(విజయవాడ పశ్చిమ): కొత్తూరు తాడేపల్లిలో పేకాట ఆడుతున్న నలుగురిని కొత్తపేట పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తూరు తాడేపల్లిలో కొంతమంది పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందింది. దీంతో సెక్టార్ ఎస్ఐ శేఖర్‌బాబు పేకాట శిబిరంపై దాడి చేసి నలుగురిని అరెస్టు చేయడంతో పాటు వారి నుంచి రూ. 28 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. శానిటైజర్లు విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు చిట్టినగర్: నిబంధనలకు విరుద్దంగా శానిటైజర్లు విక్రయిస్తున్న వ్యక్తిని కొత్తపేట పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. కొత్తపేటకు చెందిన పి. మురళి కొంతకాలంగా శానిటైజర్‌ను చిన్నచిన్న బాటిల్స్‌గా చేసి విక్రయిస్తున్నాడు. సమాచారం అందుకున్న సెక్టార్ ఎస్ఐ విశ్వనాథ్ నిందితుడిని అరెస్టు చేసి 80 బాటిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం చిట్టినగర్: పాముల కాలువలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభించింది. సమాచారం అందుకున్న కొత్తపేట పోలీసులు కాలువలో ఉన్న మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చారు. కాలువలో సుమారు 45 సంవత్సరాల వయస్సు కలిగిన వ్యక్తి నీటిలో కనిపించడంలో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సదరు వ్యక్తి ప్రమాదవశాత్తు కాలువలో పడి మృతి చెందాడా.. లేక ఆత్మహత్యకు పాల్పడ్డాడా అనే దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
కృష్ణా బేసిన్ ఖాళీ!
సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు మిగిల్చిన నైరాశ్యం రాష్ట్రంలోని భారీ ప్రాజెక్టులపై ఎనలేని ప్రభావం చూపుతోంది. నెల రోజులైనా వానల జాడలేకపోవడంతో రాష్ట్రంలోని ప్రాజెక్టుల్లోకి చుక్క నీరు వచ్చి చేరలేదు. సాధారణంగా జూన్‌లో ప్రవాహాలుండే గోదావరి సైతం నీటి ప్రవాహాల జాడ కానరాక నిర్జీవంగా మారగా, కృష్ణా బేసిన్లో కరువు పరిస్థితులే కళ్లకు కడుతున్నాయి. గతానికిభిన్నంగా ఎగువ కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర ప్రాజెక్టుల్లోకి నెల రోజుల్లో చుక్క నీరు రాకపోవడం దయనీయ పరిస్థితిని కళ్లకు కడుతోంది. ఇక్కడే ఏకంగా 223 టీఎంసీల మేర నీటి కొరత ఉండటం, ఇప్పటికిప్పుడు మెరుగైన వర్షాలు కురిసినా అక్కడి ప్రాజెక్టులు నిండి తెలంగాణలోని జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్‌కు నీటి ప్రవాహం రావాలంటే ఆగస్టు ఆఖరి దాకా ఆగాల్సిన దుస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే కనీస నీటి మట్టాల దిగువకు వెళ్లి ప్రాజెక్టుల్లో నీటిని తోడుతున్న నేపథ్యంలో ఆగస్టు వరకు ఆగడం రాష్ట్రానికి కొత్త చిక్కులు తెచ్చి పెట్టనుంది. ఎగువనా కరువే... కృష్ణా బేసిన్‌లోని నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో నిల్వలు ఇప్పటికే కనీస మట్టాల దిగువకు పడిపోయాయి. ఈ రెండు ప్రాజెక్టుల్లోనే ఏకంగా 368 టీఎంసీల నీటి లోటు ఉంది. గత నెల రోజుల్లో ఇక్కడ ఎలాంటి ప్రవాహాలు లేవు. ఇప్పటికే సాగర్‌లో రాజధాని తాగునీటి అవసరాల కోసం అత్యవసర పంపింగ్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్టుల్లోకి నీరు చేరాలంటే ఎగువ కర్ణాటక ప్రాజెక్టులు నిండాల్సి ఉంది. ఆల్మట్టి, నారాయణపూర్ నిండితేనే దిగువకు ఇన్‌ఫ్లో ఉంటుంది. అక్కడా లోటు వర్షపాతం కారణంగా ప్రవాహాలే లేవు. ఆల్మట్టిలో ప్రస్తుతం 129.72 టీఎంసీలకు గాను కనీస నీటి మట్టాలకు దిగువన 21.70 టీఎంసీలు, నారాయణపూర్‌లో 37.64 టీఎంసీలకు గాను 18.18 టీఎంసీ, తుంగభద్రలో 100.86 టీఎంసీలకు కేవలం 1.91 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. మొత్తంగా 223 టీఎంసీల మేర లోటు కనబడుతోంది. ఇందులో కనీసంగా 105 నుంచి 120 టీఎంసీలు చేరితే గానీ దిగువకు ఇన్‌ఫ్లో కొనసాగే అవకాశం లేదు. ముఖ్యంగా ఆల్మట్టిలో 100 టీఎంసీల నీరు చేరితే దిగువ నారాయణపూర్‌కు వదులుతారు. అక్కడ ప్రాజెక్టు నిండిన అనంతరం దిగువ రాష్ట్రానికే వదిలే అవకాశం ఉంటుంది. సాధారణంగా జూన్ రెండు, మూడో వారం నుంచే ప్రవాహాలుంటాయి. ఇంతకుముందు సంవత్సరాల్లో ఆల్మట్టికి జూన్‌లోనే 20 నుంచి 30 టీఎంసీల నీటి రాక వచ్చిన సందర్భాలున్నాయి. జూలై నుంచి అవి పుంజుకుంటే జూలై మూడో వారం నుంచి దిగువకు నీటి విడుదల జరిగేది. కానీ ప్రస్తుతం భిన్న పరిస్థితి కనబడుతోంది. గత ఏడాది జూలైతో పోలిస్తే ప్రస్తుతం ఎగువ, దిగువ ప్రాజెక్టుల్లో 60 టీఎంసీల మేర నిల్వలు తక్కువగా ఉన్నాయి. అక్కడ చుక్క నీటి ప్రవాహాలు లేకపోవడంతో ఈ నెలలో కురిసే వర్షాలపైనే ఆధారపడాల్సి వస్తోంది. ఈ నెలలో సరైన రీతిలో వర్షాలు కురిసి ప్రవాహాలు కొనసాగితే.. ఆగస్టు చివరి వారం నుంచి దిగువ ప్రాజెక్టులకు ప్రవాహాలు ఉంటాయి. లేనిపక్షంలో కృష్ణా బేసిన్లో గడ్డు పరిస్థితులు తప్పవు. భూగర్భం విలవిల రాష్ట్రంలో భూగర్భ జలాలు రోజురోజుకూ పడిపోతున్నాయి. నైరుతి రుతుపవనాల జాప్యంతో వర్షాలు లేక నీటిమట్టాలు పాతాళానికి చేరాయి. రాష్ట్ర సరాసరి భూగర్భ నీటిమట్టం ప్రస్తుతం 14.40 మీటర్లకు చేరింది. గత ఏడాది తో పోలిస్తే 2.13 మీటర్ల దిగువన భూగర్భ జలాలున్నాయి. జూన్‌కు సంబంధించి భూగర్భ జల శాఖ 589 మండలాల్లోని 941 పరిశీలక బావుల ద్వారా భూగర్భ జలమట్టాలను విశ్లేషించింది. జూన్‌లో సాధారణ వర్షపాతం 129.2 మిల్లీమీటర్లకుగానూ కేవలం 87.1 మి.మీ.లుగా నమోదైంది. 33 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. గత ఏడాది జూన్‌లో రాష్ట్ర సరాసరి నీటి మట్టం 12.27 మీటర్లుండగా, ఈ ఏడాది 14.40 మీటర్లకు చేరింది. గత ఏడాదితో పోలిస్తే 2.13 మీటర్ల మేర భూగర్భమట్టం దిగజారింది. కేవలం 4 జిల్లాల్లో 0.12 మీటర్ల నుంచి 1.03 మీటర్ల మేర పెరుగుదల కనిపించగా, 29 జిల్లాల్లో 10.70 మీ. నుంచి 0.06 మీటర్ల మేర తగ్గుదల కనిపించింది. రాష్ట్ర మొత్తంగా మెదక్ జిల్లాలో 26.5 మీటర్ల దిగువకు మట్టాలు పడిపోగా, తర్వాతి స్థానంలో సంగారెడ్డి (23.96 మీటర్లు), వికారాబాద్ (20.23 మీటర్లు) ఉన్నాయి. గొల్లుమంటున్న గోదావరి... రాష్ట్రానికి వరప్రదాయినిగా ఉన్న గోదావరికి కూడా ఈ ఏడాది నీటి ప్రవాహాలు లేవు. గోదావరి బేసిన్‌లోని ప్రధాన ప్రాజెక్టుల్లోకి ఒక్క టీఎంసీ నీరు కూడా చేరలేదు. ఎగువ మహారాష్ట్రలోని గైక్వాడ్ ప్రాజెక్టులో గతేడాదితో పోలిస్తే 83 టీఎంసీల మేర నీటినిల్వలు తక్కువ గా ఉండటం, అక్కడ అధికవర్షాలు నమోదైతేగానీ దిగువకు నీరిచ్చే అవకాశం లేకపోవడం రాష్ట్రాన్ని కలవరపెడుతోంది. సాధారణంగా కృష్ణాబేసిన్‌తో పోల్చి చూస్తే గోదావరి బేసిన్లో జూన్, జూలైలో మంచి వర్షాలుంటాయి. ఎగువన భారీ వర్షాలు కురిసినా అవి గోదావరి పరీవాహకంలో లేకపోవడంతో దిగువ ఎస్సారెస్పీ, సింగూరుకు నీటి ప్రవాహాలు పెద్దగా లేవు. నిజాంసాగర్ వట్టిపోయింది. బాబ్లీ గేట్లు సోమవారం తెరుచుకున్నా దిగువకు చుక్క వచ్చే పరిస్థితులు లేవు. గోదావరి, ప్రాణహిత కలిసే కాళేశ్వరం వద్ద సైతం గత ఏడాది ఇదే సమయానికి లక్షల క్యూసెక్కుల మేర ప్రవాహాలు ఉండగా ఈ ఏడాది కేవలం 3 వేల క్యూసెక్కులకు మించి ప్రవాహం లేదు. -
కృష్ణా అవసరం.. 431 టీఎంసీలు
సాక్షి, హైదరాబాద్: గోదావరి జలాలను కృష్ణా బేసిన్ ప్రాజెక్టులకు తరలించే ప్రక్రియలో భాగంగా రాష్ట్రానికి ఉన్న అవసరాలు, జలాల లభ్యత, ప్రస్తుత వినియోగం, గత 60 ఏళ్లుగా వచ్చిన ప్రవాహాలు తదితర లెక్కలపై తెలంగాణ అధ్యయనం మొదలుపెట్టింది. రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా ప్రణాళిక వేస్తూనే, గోదావరి నీటిని కృష్ణా బేసిన్ ప్రాజెక్టులకు ఎలా తరలించాలన్న దానిపై పరిశీలిస్తోంది. కృష్ణా బేసిన్ ప్రాజెక్టులకు గరిష్టంగా 431 టీఎంసీల మేర నీటి అవసరాలు ఉన్నాయని ఇంజనీర్ల కమిటీ గుర్తించింది. కనిష్టంగా 200 టీఎంసీల నీరు తెలంగాణ అవసరాలకు గోదావరి నుంచి కృష్ణాకు మళ్లించాల్సి ఉందని తేల్చింది. తుపాకులగూడేనికి ఎగువన ఉన్న ప్రాంతం నుంచి శ్రీశైలానికి, దుమ్ముగూడెం, పోలవరం నుంచి నాగార్జునసాగర్ వరకు తరలించే ప్రతిపాదనలపై చర్చలు ప్రారంభించింది. ఏ మార్గం అనుకూలం..? కాగా, ఏయే ప్రాంతాల్లోని ఆయకట్టుకు నీరందట్లేదు.. ప్రస్తుతం గోదావరి నీటిని ఏ మార్గాల ద్వారా తరలిస్తే రాష్ట్ర ఆయకట్టుకు ప్రయోజనకరంగా ఉంటుందన్న అంశాలపై ఇంజనీర్లు కసరత్తు చేస్తున్నారు. మంగళవారం తెలంగాణ ఇంజనీర్ల కమిటీ ఈఎన్సీ మురళీధర్ నేతృత్వంలో జలసౌధలో భేటీ అయింది. ముఖ్యంగా తుపాకులగూడేనికి ఎగువన ఉన్న ప్రాంతం నుంచి నీటిని శ్రీశైలం ప్రాజెక్టు తరలించే మార్గాలపై టోఫోషీట్ల ఆధారంగా అధ్యయనం చేశారు. ఎక్కువ ముంపు, అటవీ, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు లేకుండా, శ్రీశైలానికి దగ్గరగా ఉండే మార్గాలను అన్వేషించారు. దీంతో పాటే దుమ్ముగూడెం నుంచి సాగర్ టెయిల్‌పాండ్‌కు తరలించేందుకు గతంలో నిర్ధారించిన ముంపు ప్రాంతాలను తగ్గించి రోజుకు 2 టీఎంసీల నీటిని తరలించే మార్గాలపై చర్చించారు. పోలవరం నుంచి సాగర్‌కు నీటిని తరలించడానికి ఉన్న అవకాశాలపై మాట్లాడుకున్నారు. పోలవరం నుంచి కృష్ణా బేసిన్‌కు నీటి తరలింపు చేస్తే ఎగువ రాష్ట్రాలు కృష్ణాలో నీటిని తీసుకునే అవకాశాలు, 1978 గోదావరి బచావత్ ట్రిబ్యునల్ అవార్డులో పేర్కొన్న అంశాలపైనా చర్చించారు. అయితే ప్రతిపాదిత ప్రాంతాల్లో గోదావరిలో గడిచిన 60 ఏళ్లుగా ఉన్న నీటి ప్రవాహపు లెక్కలను ముందుపెట్టి ఒక్కో ప్రాంతం నుంచి 200 టీఎంసీల నీటిని తరలించే అలైన్మెంట్లపై సమీక్షించారు. భేటీకి అంతర్రాష్ట్ర జల విభాగం సీఈ నరసింహారావు, ఎస్ఈ మోహన్‌కుమార్, సాగర్ సీఈ నర్సింహా, సీతారామ ఎస్ఈ నాగేశ్వర్రావు, రిటైర్డ్ ఇంజనీర్లు శ్యాంప్రసాద్ రెడ్డి, వెంకటరామారావు తదితరులు హాజరయ్యారు. ఏపీ ఇంజనీర్లతో భేటీ వాయిదా.. గోదావరి జలాల తరలింపు ప్రతిపాదనలపై బుధవారం జరగనున్న ఏపీ, తెలంగాణ ఇంజనీర్ల సమావేశం వాయిదా పడింది. వారి అధ్యయనాలు ఇంకా పూర్తి కాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గోదావరి నీరే శరణ్యం.. కృష్ణా బేసిన్లో ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీల మేర నీటి కేటాయింపులు ఉండ గా, ఇందులో తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకి 512 టీఎంసీలు దక్కాయి. తెలంగాణకు కేటాయించిన 299 టీఎంసీల్లో 89 టీఎంసీల మేర చిన్ననీటి వనరుల కింద కేటాయించినవే. ఇవికాకుండా 210 టీఎంసీలతో తెలంగాణ అవసరాలు తీరవు. శ్రీశై లం, జూరాల, సాగర్‌లపై ఆధారపడి 431 టీఎంసీల మేర అవసరమైన ప్రాజెక్టులు ఉన్నాయి. శ్రీశైలంపై 256 టీఎంసీల అవసరమున్న ప్రాజెక్టులుండగా, సాగర్‌పై 174 టీఎంసీలు, జూరాలపై 88 టీఎంసీల మేర ఆధారపడ్డ ప్రాజెక్టులున్నాయి. ప్రస్తుతం కేటాయింపులు పోను అదనంగా 200 టీఎంసీల మేర నికర జలాల అవసరముంది. కర్ణా టక నుంచి దిగువకు నీటి లభ్యత లేనందున గోదావరి నీటి తరలింపే శరణ్యం కానుంది. జూరాలపై ఆధారపడ్డ అవసరాలు.. (టీఎంసీల్లో) ప్రాజెక్టు అవసరం జూరాల 17.84 ఊకచెట్టువాగు 1.9 భీమా 20 నెట్టెంపాడు 25.4 కోయిల్‌సాగర్ 3.9 మిషన్ భగీరథ 4.05 గట్టు 15 శ్రీశైలంపై.. కల్వకుర్తి 40 పాలమూరు–రంగారెడ్డి 90 డిండి 30 చెన్నై తాగునీటికి 1.67 మిషన్ భగీరథ 7.17 నాగార్జునసాగర్‌పై.. నాగార్జునసాగర్ 105.7 జంట నగరాల తాగునీరు 16.8 ఎస్ఎల్బీసీ 40 మిషన్ భగీరథ 12.14 మొత్తం 431.52 -
నదిలో నిలిచిన బల్లకట్టు: ఆందోళనలో భక్తులు
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులను తీసుకువెళ్తున్న బల్లకట్టులో సాంకేతిక లోపం ఏర్పడింది. దాంతో ఆ బల్లకట్టు కృష్ణాజిల్లా జగ్గయ్యపేట సమీపంలోని ముక్త్యాల వద్ద కృష్ణా నదిలో గురువారం నిలిచిపోయింది. అందులో ప్రయాణిస్తున్న దాదాపు 200 మంది భక్తులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. బల్లకట్టుపై ప్రయాణిస్తున్న భక్తులలో మహిళలు, వృద్దులు, చిన్నారులు ఉన్నారు. బల్లకట్టులో ఏర్పడిన సాంకేతిక లోపాన్ని నివారించేందుకు చర్యలు చేపట్టినట్లు బల్లకట్టు యజమానులు వెల్లడించారు. భక్తులంతా ముక్త్యాలలోని దేవాలయాన్ని దర్శించుకునేందుకు పయనమైయ్యారు. ఈ సందర్భంగా ఆ ఘటన చోటు చేసుకుంది.