సాక్షి, హైదరాబాద్: గోదావరి జలాలను కృష్ణా బేసిన్ ప్రాజెక్టులకు తరలించే ప్రక్రియలో భాగంగా రాష్ట్రానికి ఉన్న అవసరాలు, జలాల లభ్యత, ప్రస్తుత వినియోగం, గత 60 ఏళ్లుగా వచ్చిన ప్రవాహాలు తదితర లెక్కలపై తెలంగాణ అధ్యయనం మొదలుపెట్టింది. రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా ప్రణాళిక వేస్తూనే, గోదావరి నీటిని కృష్ణా బేసిన్ ప్రాజెక్టులకు ఎలా తరలించాలన్న దానిపై పరిశీలిస్తోంది. కృష్ణా బేసిన్ ప్రాజెక్టులకు గరిష్టంగా 431 టీఎంసీల మేర నీటి అవసరాలు ఉన్నాయని ఇంజనీర్ల కమిటీ గుర్తించింది. కనిష్టంగా 200 టీఎంసీల నీరు తెలంగాణ అవసరాలకు గోదావరి నుంచి కృష్ణాకు మళ్లించాల్సి ఉందని తేల్చింది. తుపాకులగూడేనికి ఎగువన ఉన్న ప్రాంతం నుంచి శ్రీశైలానికి, దుమ్ముగూడెం, పోలవరం నుంచి నాగార్జునసాగర్ వరకు తరలించే ప్రతిపాదనలపై చర్చలు ప్రారంభించింది.
ఏ మార్గం అనుకూలం..?
కాగా, ఏయే ప్రాంతాల్లోని ఆయకట్టుకు నీరందట్లేదు.. ప్రస్తుతం గోదావరి నీటిని ఏ మార్గాల ద్వారా తరలిస్తే రాష్ట్ర ఆయకట్టుకు ప్రయోజనకరంగా ఉంటుందన్న అంశాలపై ఇంజనీర్లు కసరత్తు చేస్తున్నారు. మంగళవారం తెలంగాణ ఇంజనీర్ల కమిటీ ఈఎన్‌సీ మురళీధర్ నేతృత్వంలో జలసౌధలో భేటీ అయింది. ముఖ్యంగా తుపాకులగూడేనికి ఎగువన ఉన్న ప్రాంతం నుంచి నీటిని శ్రీశైలం ప్రాజెక్టు తరలించే మార్గాలపై టోఫోషీట్ల ఆధారంగా అధ్యయనం చేశారు. ఎక్కువ ముంపు, అటవీ, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు లేకుండా, శ్రీశైలానికి దగ్గరగా ఉండే మార్గాలను అన్వేషించారు. దీంతో పాటే దుమ్ముగూడెం నుంచి సాగర్ టెయిల్‌పాండ్‌కు తరలించేందుకు గతంలో నిర్ధారించిన ముంపు ప్రాంతాలను తగ్గించి రోజుకు 2 టీఎంసీల నీటిని తరలించే మార్గాలపై చర్చించారు. పోలవరం నుంచి సాగర్‌కు నీటిని తరలించడానికి ఉన్న అవకాశాలపై మాట్లాడుకున్నారు. పోలవరం నుంచి కృష్ణా బేసిన్‌కు నీటి తరలింపు చేస్తే ఎగువ రాష్ట్రాలు కృష్ణాలో నీటిని తీసుకునే అవకాశాలు, 1978 గోదావరి బచావత్ ట్రిబ్యునల్ అవార్డులో పేర్కొన్న అంశాలపైనా చర్చించారు. అయితే ప్రతిపాదిత ప్రాంతాల్లో గోదావరిలో గడిచిన 60 ఏళ్లుగా ఉన్న నీటి ప్రవాహపు లెక్కలను ముందుపెట్టి ఒక్కో ప్రాంతం నుంచి 200 టీఎంసీల నీటిని తరలించే అలైన్‌మెంట్‌లపై సమీక్షించారు. భేటీకి అంతర్రాష్ట్ర జల విభాగం సీఈ నరసింహారావు, ఎస్‌ఈ మోహన్‌కుమార్, సాగర్ సీఈ నర్సింహా, సీతారామ ఎస్‌ఈ నాగేశ్వర్‌రావు, రిటైర్డ్ ఇంజనీర్లు శ్యాంప్రసాద్ రెడ్డి, వెంకటరామారావు తదితరులు హాజరయ్యారు.
ఏపీ ఇంజనీర్లతో భేటీ వాయిదా..
గోదావరి జలాల తరలింపు ప్రతిపాదనలపై బుధవారం జరగనున్న ఏపీ, తెలంగాణ ఇంజనీర్ల సమావేశం వాయిదా పడింది. వారి అధ్యయనాలు ఇంకా పూర్తి కాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
గోదావరి నీరే శరణ్యం..
కృష్ణా బేసిన్‌లో ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీల మేర నీటి కేటాయింపులు ఉండ గా, ఇందులో తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకి 512 టీఎంసీలు దక్కాయి. తెలంగాణకు కేటాయించిన 299 టీఎంసీల్లో 89 టీఎంసీల మేర చిన్ననీటి వనరుల కింద కేటాయించినవే. ఇవికాకుండా 210 టీఎంసీలతో తెలంగాణ అవసరాలు తీరవు. శ్రీశై లం, జూరాల, సాగర్‌లపై ఆధారపడి 431 టీఎంసీల మేర అవసరమైన ప్రాజెక్టులు ఉన్నాయి. శ్రీశైలంపై 256 టీఎంసీల అవసరమున్న ప్రాజెక్టులుండగా, సాగర్‌పై 174 టీఎంసీలు, జూరాలపై 88 టీఎంసీల మేర ఆధారపడ్డ ప్రాజెక్టులున్నాయి. ప్రస్తుతం కేటాయింపులు పోను అదనంగా 200 టీఎంసీల మేర నికర జలాల అవసరముంది. కర్ణా టక నుంచి దిగువకు నీటి లభ్యత లేనందున గోదావరి నీటి తరలింపే శరణ్యం కానుంది.
జూరాలపై ఆధారపడ్డ అవసరాలు.. (టీఎంసీల్లో) ప్రాజెక్టు అవసరం
జూరాల 17.84
ఊకచెట్టువాగు 1.9
భీమా 20
నెట్టెంపాడు 25.4
కోయిల్‌సాగర్ 3.9
మిషన్ భగీరథ 4.05
గట్టు 15
శ్రీశైలంపై..
కల్వకుర్తి 40
పాలమూరు–రంగారెడ్డి 90
డిండి 30
చెన్నై తాగునీటికి 1.67
మిషన్ భగీరథ 7.17
నాగార్జునసాగర్‌పై..
నాగార్జునసాగర్ 105.7
జంట నగరాల తాగునీరు 16.8
ఎస్‌ఎల్‌బీసీ 40
మిషన్ భగీరథ 12.14
మొత్తం 431.52
Comments
Please login to add a commentAdd a comment