శ్రీశైలం ప్రాజెక్టులోకి 4.13 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం
883.5 అడుగుల వద్ద 203.99 టీఎంసీలకు చేరిన నిల్వ
ప్రాజెక్టు10 గేట్లు ఎత్తి 2,75,700 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల
కుడి, ఎడమ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ 60,999 క్యూసెక్కుల నీరు కూడా దిగువకే..
నాగార్జునసాగర్ ప్రాజెక్టులోకి గంటగంటకూ పెరుగుతున్న వరద
517.2 అడుగుల వద్ద 144.22 టీఎంసీలకు చేరిన నిల్వ
సాక్షి,హైదరాబాద్/దోమలపెంట: శ్రీశైలం జలాశయం నిండుకుండలా తొణికిసలాడుతుండగా,నాగార్జునసాగర్ ప్రాజెక్టు సైతం జలకళను సంతరించుకుంటోంది. బిరబిరా కృష్ణమ్మ తరలివస్తుండడంతో నాగార్జునసాగర్‌లో గంట గంటకూ నీటినిల్వ పెరుగుతోంది. శ్రీశైలం ప్రాజెక్టులోకి మంగళవారం రాత్రి 7 గంటలకు 4,13,178 క్యూసెక్కుల నీరు చేరుతుండటంతో నీటినిల్వ 883.5 అడుగుల వద్ద 207.41 టీఎంసీలకు చేరుకుంది.
ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటం.. నీటిమట్టం గరిష్టస్థాయికి చేరింది, దీంతో శ్రీశైలం ప్రాజెక్టు 10 గేట్లు 10 అడుగుల మేర పైకి ఎత్తి 2,75,700 క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. కుడి, ఎడమ గట్టు కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ మరో 60,840 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలేస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 25 వేల క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 1,600 క్యూసెక్కుల నీటిని తరలిస్తున్నారు. శ్రీశైలం స్పిల్‌వే గేట్లు, విద్యు దుత్పత్తి చేస్తూ దిగువకు విడుదల చేస్తున్న ప్రవాహం నాగార్జునసాగర్ వైపు పరుగులు తీస్తోంది.
నాగార్జునసాగర్‌లోకి మంగళవారం సాయంత్రం 6 గంటలకు 1,55,716 క్యూసెక్కుల నీరు చేరుతుండటంతో నీటినిల్వ 517.2 అడుగుల వద్ద 144.22 టీఎంసీలకు చేరుకుంది. సాగర్ గరిష్ట నీటిమట్టం 590 అడుగులు.. పూర్తి నిల్వసామర్థ్యం 312.05 టీఎంసీలు. సాగర్ నిండాలంటే ఇంకా 170 టీఎంసీలు అవసరం. ఎగువ నుంచి వరద ప్రవాహం ఇదే రీతిలో కొనసాగితే మరో వారంరోజుల్లో నాగార్జునసాగర్ నిండే అవకాశముంది. మహారాష్ట్ర, కర్ణాటకలలో పశి్చమ కనుమల్లో వర్షాలు తెరిపి ఇవ్వడంతో ఎగువన కృష్ణా, దాని ఉపనదుల్లో వరద ప్రవాహం స్వల్పంగా తగ్గుముఖం పట్టింది.
కృష్ణా ప్రధానపాయ నుంచి ఆల్మట్టి డ్యామ్‌లోకి 3 లక్షల క్యూసెక్కుల నీరు చేరుతుండగా అంతేస్థాయిలో దిగువకు వదిలేస్తున్నారు. నారాయణపూర్ డ్యామ్‌లోకి 2.85 లక్షల క్యూసెక్కుల నీరు చేరుతుండగా 2.77 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టులోకి 2.95 లక్షల క్యూసెక్కుల నీరు చేరుతుండగా 2.85 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక కృష్ణా ప్రధాన ఉపనది తుంగభద్రలో వరద ఉధృతి కొనసాగుతోంది. తుంగభద్ర డ్యామ్‌లోకి 70 వేల క్యూసెక్కుల నీరు చేరుతుండగా.. 32వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలేస్తున్నారు.
మళ్లీ గోదావరికి పెరిగిన వరద
మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో విస్తారంగా వర్షాలు
సాక్షి, హైదరాబాద్: గోదావరినది పరీవాహక ప్రాంతంలోని మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో సోమవారం రాత్రి, మంగళవారం విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, వాగులు, వంకల్లో వరద ఉధృతి పెరిగింది. దీంతో గోదావరిలో మళ్లీ వరద ప్రవాహం పెరుగుతోంది.
భద్రాచలం నుంచి ధవళేశ్వరం వరకూ బుధవారం గోదావరి ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తుందని కేంద్ర జలసంఘం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అధికారులను హెచ్చరించింది. ప్రాణహితలో వరద పెరగడంతో కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ బరాజ్‌లోకి వరద ప్రవాహం 7.71 లక్షల క్యూసెక్కులకు పెరిగింది. అంతే స్థాయిలో దిగువకు వదిలేస్తున్నారు. దానికి ఇంద్రావతి వరద తోడవుతుండటంతో తుపాకులగూడెం(సమ్మక్క సాగర్) బరాజ్‌లోకి 9.15 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా, అంతేస్థాయిలో దిగువకు విడుదల చేస్తున్నారు.
సీతమ్మసాగర్(దుమ్ముగూడెం బరాజ్)లోకి చేరుతున్న 9.64 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. భద్రాచలం వద్దకు మంగళవారం సాయంత్రం 8.45 లక్షల క్యూసెక్కుల ప్రవాహం చేరుతుండగా.. నీటి మట్టం 43.7 అడుగులుగా నమోదైంది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టులోకి 10.08 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా, అంతే స్థాయిలో దిగువకు వదిలేస్తున్నారు.
ధవళేశ్వరం బరాజ్‌లోకి 11,26,625 క్యూసెక్కులు చేరుతుండగా.. 11,19,425 క్యూసెక్కులను 175 గేట్లు ఎత్తి సముద్రంలోకి వదిలేస్తున్నారు. బరాజ్ వద్ద నీటిమట్టం 12.6 అడుగులుగా నమోదవుతుండటంతో మొదటి ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. ఇక కూనవరం వద్ద శబరి ఉధృతితో నీటిమట్టం 39.25(సముద్రమట్టానికి) మీటర్ల వద్ద కొనసాగుతుండటంతో రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment