సాగర్‌ వైపు కృష్ణమ్మ... | Huge Flood Water Inflow To Nagarjuna Sagar Dam | Sakshi
Sakshi News home page

సాగర్‌ వైపు కృష్ణమ్మ...

Published Tue, Jul 30 2024 12:18 AM | Last Updated on Tue, Jul 30 2024 12:18 AM

Huge Flood Water Inflow To Nagarjuna Sagar Dam

శ్రీశైలం ప్రాజెక్టులోకి 4.52 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం 

879.3 అడుగుల్లో 184.70 టీఎంసీలకు చేరిన నిల్వ 

ప్రాజెక్టు మూడు గేట్లు ఎత్తి 76,056 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల 

కుడి, ఎడమ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ 61,810 క్యూసెక్కుల నీరు కూడా దిగువకే..  

దీంతో నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులోకి గంటగంటకూ పెరుగుతోన్న వరద 

512.6 అడుగులవద్ద 136.13 టీఎంసీల నిల్వ

సాక్షి, హైదరాబాద్‌/దోమలపెంట: నాగార్జునసాగర్‌ వైపు కృష్ణమ్మ బిరబిరా కదలిపోతోంది. శ్రీశైలం ప్రాజెక్టులోకి సోమవారం రాత్రి 7 గంటలకు 4,52,583 క్యూసెక్కుల నీరు చేరుతుండటంతో నీటినిల్వ 879.3 అడుగుల్లో 184.70 టీఎంసీలకు చేరుకుంది. ఎగువ నుంచి భారీ వరద వస్తుండటం.. నీటిమట్టం గరిష్టస్థాయికి చేరింది, దీంతో సాయంత్రం 4.30 గంటలకు శ్రీశైలం ప్రాజెక్టు మూడు గేట్లు 10 అడుగుల మేర పైకి ఎత్తగా, 76,056 క్యూసెక్కుల వరద కిందకు వెళ్లిపోతోంది.

కుడి, ఎడమ గట్టు కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ మరో 61,810 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలేస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ ద్వారా 23 వేల క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 1,600 క్యూసెక్కుల నీటిని తరలిస్తున్నారు. శ్రీశైలం స్పిల్‌వే గేట్లు, విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు విడుదల చేస్తున్న ప్రవాహం నాగార్జునసాగర్‌ వైపు పరుగులు తీస్తోంది. నాగార్జునసాగర్‌లోకి సోమవారం సాయంత్రం 6 గంటలకు 54,772 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటినిల్వ 512.6 అడుగుల్లో 136.13 టీఎంసీలకు చేరుకుంది.

సాగర్‌ గరిష్ట నీటిమట్టం 590 అడుగులు.. పూర్తి నిల్వసామర్థ్యం 312.05 టీఎంసీలు. సాగర్‌ నిండాలంటే ఇంకా 176 టీఎంసీలు అవసరం. ఎగువ నుంచి వరద ప్రవాహం ఇదే రీతిలో కొనసాగితే మరో ఆరేడు రోజుల్లో నాగార్జునసాగర్‌ నిండే అవకాశముంది. మహారాష్ట్ర, కర్ణాటకలలో పశి్చమ కనుమల్లో వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు కృష్ణా, దాని ఉపనదుల్లో వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. కృష్ణా ప్రధానపాయ నుంచి ఆల్మట్టి డ్యామ్‌లోకి 3 లక్షల క్యూసెక్కుల నీరు చేరుతుండగా అంతే స్థాయిలో దిగువకు వదిలేస్తున్నారు. నారాయణపూర్‌ డ్యామ్‌లోకి 2.90 లక్షల క్యూసెక్కుల నీరు చేరుతుండగా 2.70 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టులోకి 3.15 లక్షల క్యూసెక్కుల నీరు చేరుతుండగా 3.11 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

ఇక కృష్ణా ప్రధాన ఉపనది తుంగభద్రలో వరద ఉధృతి కొనసాగుతోంది. తుంగభద్ర డ్యామ్‌లోకి 1.31 లక్షల క్యూసెక్కుల నీరు చేరుతుండగా.. 1.06 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలేస్తున్నారు. తుంగభద్ర డ్యామ్‌ నుంచి దిగువకు విడుదల చేస్తున్న ప్రవాహంతో మంత్రాలయం వద్ద తుంగభద్ర నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. నీటిమట్టం 311 మీటర్లు(సముద్రమట్టానికి)గా కొనసాగుతుండటంతో మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగిస్తున్నారు.

సుంకేశుల బ్యారేజ్‌లోకి 1.51 లక్షల క్యూసెక్కుల నీరు చేరుతుండగా.. కేసీ కెనాల్‌కు 1,504 క్యూసెక్కుల నీటిని వదులుతూ మిగులుగా ఉన్న 1.48 లక్షల క్యూసెక్కులను దిగువకు వది లేస్తున్నారు. ఇటు సుంకేశుల నుంచి.. అటు జూరాల నుంచి వరద వస్తుండటంతో శ్రీశైలంలోకి చేరుతున్న ప్రవాహం గంట గంటకూ పెరుగుతోంది.

సాగర్‌లో విద్యుదుత్పాదన ప్రారంభం
నాగార్జునసాగర్‌ : శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీటిరాక మొదలు కావడంతో నాగార్జునసాగర్‌లోని ప్రధాన విద్యుదుత్పాదన కేంద్రంలో విద్యుదుత్పాదనను సోమవారం రాత్రి ప్రారంభించారు. నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు దిగువన ఉన్న టెయిల్‌పాండ్‌ నీటిసామర్థ్యం 7 టీఎంసీలుకాగా.. ఒక టీఎంసీ నీటితో తెలంగాణ ప్రభుత్వం నిత్యం విద్యుదుత్పతి చేస్తున్నది. గత మే నెలలో ఆంధ్రా అధికారులు రాత్రికిరాత్రే టెయిల్‌పాండ్‌లో గల 7టీఎంసీలలో 4 టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేశారు.

దీంతో విద్యుదుత్పాదన నిలిచిపోయింది. మరోవైపు నాగార్జునసాగర్‌ జలాశయం అడుగంటడంతో దిగువన టెయిల్‌పాండ్‌కు నీటిని విడుదల చేసే పరిస్థితిలేక విద్యుదుత్పాదన చేయలేదు. సాగర్‌లో విద్యుదుత్పాదన ద్వారా 24 వేల క్యూసెక్కుల నీటిని టెయిల్‌పాండ్‌కు విడుదల చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement