బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి నీరు సరఫరా చేసే కాకతీయ కాలువలో నీరు నిల్వ ఉంచడంతో అన్నదాతలను ఆదుకుంటుంది. దీంతో కాకతీయ కాలువ ఆధారంగా పంటలను సాగు చేస్తున్న అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాకతీయ కాలువలో వేసవిలో కూడ నీటిని నిల్వ ఉంచడంతో రైతులు పంటలకు నీరు అందించుకున్నారు. కాలువ నీటి ఆధారంగా రైతులు ఎప్పుడో కరెంటు మోటార్లను బిగించుకున్నారు. కిలోమీటర్ల మేరా పైపులైన్‌లు వేసుకున్నారు. ప్రస్తుతం కాలువలో నీరు నిల్వ ఉండటం వల్ల రైతులు మందస్తుగానే పసుపు , మక్క పంటలను సాగు చేశారు. ప్రస్తుతం కాలువ నుంచి నీటి సరఫరా చేస్తున్న నీటి ద్వారానే పంటలు సాగవుతున్నాయి.
పైపులైన్‌ల ద్వారా నీటి సరఫరా..
కాకతీయ, వరద కాలువకు ఇరువైపులా ఉన్న గ్రామాల రైతులు కాలువలకు మోటర్లు బిగుంచుకుని పైపులైన్ వేసుకున్నారు. పైపులైన్ ద్వారా నీటిని సరఫరా చేసుకుంటూ పంటలకు నీరు అందిస్తున్నారు. కొందరు రైతులు నాలుగైదు కిలోమీటర్ల వరకు పైపులైన్ వేసుకుని నీటి సరఫరా చేసుకుంటున్నారు. గత 10 రోజుల నుంచి పసుపు పంటను విత్తడంలో రైతులు బిజీగా ఉన్నారు.
రెండు కాలువల్లో నీరు...
కాకతీయ వరద కాలువల పరివాహక ప్రాంతాల్లో సమృద్ధిగా నీరు ఉండటంతో రైతులు ముందస్తుగానే పంటలను విత్తుతున్నారు. సాధారణంగా మిరుగు కార్తే వరకు పంటలు విత్తకుండ తొలకరి కోసం రైతులు ఎదురు చూస్తుంటారు. కానీ ప్రస్తుతం కాకతీయ కాలువలో, వరద కాలువల్లో భారీగా నీరు నిల్వ ఉండటం వల్ల ఎలాంటి నీటి భయం లేకుండా రైతులు ముందుగానే మక్క, పసుపు పంటను సాగు చేస్తున్నారు. కాకతీయ కాలువకు పరివాహక ప్రాంతాలుగా ఉన్న మెండోరా, ముప్కాల్, ఏర్గట్ల, కమ్మర్‌పల్లి, మండలాల రైతులు, వరద కాలువకు పరివాహక ప్రాంతాలుగా ఉన్న మోర్తాడ్, బాల్కొండ, కమ్మర్‌పల్లి మండలాల రైతులు విత్తనాలు విత్తడం ఇప్పటికే 70 శాతం పూర్తయ్యయంటే నీటి భరోసా ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి లీకేజీ రూపంలో వస్తున్న నీటిని కమ్మర్‌పల్లి మండలం ఉప్లూర్ వద్ద గేట్లు దించి కాలువలో నిల్వ ఉంచారు. వరద కాలువలో రివర్స్ పంపింగ్ ద్వారా నీటిని తరలించి కాలువలో నిల్వ ఉంచారు. దీంతో పంటలకు నీటి లోటు లేకుండ రైతులకు పూర్తి భరోసా లభిస్తుంది. రెండు కాలువల్లో నీరు రైతులకు ఎంతో ఉపయోగపడుతుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment