
గల్ఫ్ బోర్డు ఏర్పాటు, రూ.500 కోట్ల కేటాయింపులే లక్ష్యంగా పోరాడిన వలస కార్మిక సంఘాలు
ఎన్నికల హామీని విస్మరించడంపై నిరసన
మోర్తాడ్(బాల్కొండ): గల్ఫ్ వలస కార్మికులకు మరోసారి మొండిచేయి ఎదురైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. 2025–26 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో.. ఎన్నో సంక్షేమ పథకాలకు నిధులను కేటాయించిన తెలంగాణ (Telangana) రాష్ట్ర ప్రభుత్వం గల్ఫ్ వలస కార్మికుల ఆశలను తీర్చలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2023 ఎన్నికల మేనిఫెస్టోలో.. గల్ఫ్ వలస కార్మికుల అంశంపై ప్రత్యేక హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ (Congress Party) అధికారంలోకి వచ్చిన తరువాత పట్టించుకోపోవడంపై సర్వత్రా అసంతృప్తి వ్యక్తమవుతోంది.
2024–25 ఆర్థిక సంవత్సరంలో గల్ఫ్ దేశాల్లో మృతి చెందిన వలస కార్మికుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించడానికి ప్రభుత్వం రూ.7.50 కోట్లను ఖర్చు చేసింది. ఈసారి మాత్రం ఎలాంటి కేటాయింపులు లేకపోవడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గల్ఫ్ బోర్డు ఏర్పాటుతో పాటు రూ.500 కోట్ల కేటాయింపులే లక్ష్యంగా వలస కార్మిక సంఘాలు కృషి చేశాయి.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు ఆయన మంత్రివర్గ సహచరులతో అనేకమార్లు సమావేశాలను నిర్వహించారు. సీఎం కూడా గల్ఫ్ వలస కార్మికుల ఆశలు తీర్చడానికి సానుకూలంగానే స్పందించారు. తీరా బడ్జెట్‌లో కేటాయింపులు లేకపోవడం, కనీసం వలస కార్మికుల సంక్షేమం ప్రస్తావనే లేకపోవడంతో వలస కార్మికులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు.
బీఆర్‌ఎస్ బాటలోనే కాంగ్రెస్ ప్రభుత్వం..
పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ పార్టీ ఎప్పుడూ వలస కార్మికులను పట్టించుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీ తీరుపైనా అలాంటి ఆరోపణలే వినిపిస్తున్నాయి. ఎన్నికల్లో ఎన్నోమార్లు చర్చించి.. గల్ఫ్ వలస కార్మికులు, వారి కుటుంబాల ఓట్లను రాబట్టుకున్న కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లను గెలుచుకుంది. గల్ఫ్ ఓటర్ల ప్రభావం ఉన్న ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే గెలుపొందేవారు. ఒకవేళ ఓడినా.. ఓట్లలో వ్యత్యాసం తక్కువగా ఉండేది. అయినా వలస కార్మికులను కరివేపాకులాగా తీసి పారేశారని కార్మిక సంఘాలు వాపోతున్నాయి.
చదవండి: యూఏఈకి ఉచిత వీసాలు.. నకిలీ గల్ప్ ఏజెంట్లకు చెక్
ప్రభుత్వ తీరు సరికాదు
వలస కార్మికుల ఆశలు తీర్చేలా బడ్జెట్‌లో కేటాయింపులు ఉంటాయని ఆశించాం. ప్రభుత్వం ఎలాంటి కేటాయింపులు చేయక నిరాశ మిగిల్చింది. వలస కార్మికుల శ్రమకు గుర్తింపు లేకపోవడం శోచనీయం. వలస కార్మికులు పంపే విదేశీ మారకద్రవ్యం అవసరం కానీ వారి సంక్షేమం పట్టక పోవడం సరైంది కాదు.
– గుగ్గిల్ల రవిగౌడ్, చైర్మన్, గల్ఫ్ జేఏసీ
Comments
Please login to add a commentAdd a comment