బస్వాపూర్‌లో దొంగల బీభత్సం
భిక్కనూరు: మండలంలోని బస్వాపూర్ గ్రామంలో దొంగలు బీభత్సం సృష్టించారు. గ్రామంలోని తాళాలు వేసిన తొమ్మిది ఇళ్లల్లో గుర్తుతెలియని దుండగులు చొరబడి చోరీకి పాల్పడ్డారు. సుమారు రూ.15లక్షల వరకు బంగారం, నగదును ఎత్తుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. వివరాలు ఇలా.. గుర్తుతెలియని దుండగులు గురువారం అర్ధరాత్రి గ్రామంలోకి చొరబడి సీసీ కెమెరాల కేబుల్స్‌ను కత్తిరించారు. తాళాలు వేసి ఉన్న ఇళ్లను టార్గెట్‌గా చేసుకుని దొంగతనాలకు పాల్పడ్డారు. ఒక ఇల్లు తర్వాత ఇంకో ఇల్లు తాళాలు పగులగొడుతూ సుమారు తొమ్మిది ఇళ్లలో చోరీ చేశారు. దాకి రమేశ్ అనే వ్యక్తి ఇంట్లో మూడు తులాల బంగారు ఆభరణాలు, రూ.40వేల నగదు, వెండి వస్తువులను దొంగిలించారు. పక్కన ఉన్న నాగమణి ఇంట్లో మూడు తులాల బంగారం ఆభరణాలు ఎత్తుకెళ్లారు. మామిడి సత్తమ్మ ఇంట్లో అర తులం బంగారం, రూ.5 వేలు నగదు, సుజాత ఇంట్లో రూ.10వేల నగదు ఎత్తుకెళ్లారు. సువర్ణ ఇంట్లో బంగారు ఆభరణాలు, నగదు, మన్నె దర్మరాజు ఇంట్లో తులం బంగారం, రూ.50 వేల నగదు దోచుకెళ్లారు. చంద్రయ్య ఇంట్లో తులం బంగారం, రూ.పది వేల నగదు, చింత వినయ్ ఇంట్లో రూ.6 వేలు నగదు, సొన్నాయల స్వామి ఇంట్లో నగదు, ఇళ్ల ముందు ఉన్న బైకును కూడా దొంగలు ఎత్తుకెళ్లారు. మొత్తంగా సుమారు రూ.15 లక్షల విలువైన బంగారం ఆభరణాలు, నగదు ఎత్తుకెళ్లినట్టు అంచనా వేస్తున్నారు. శుక్రవారం ఉదయం సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలాలకు వెళ్లి, వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు.
బాల్య వివాహం నిలిపివేత
ఆర్మూర్‌టౌన్: పెర్కిట్‌కు చెందిన బాలికకు త్వరలో జరుగనున్న వివాహన్ని ఐసీడీఎస్ అధికారులు గురువారం రాత్రి నిలిపివేశారు. పెర్కిట్‌లో 10వతరగతి చదువుతున్న బాలికకు తల్లిదండ్రులు ఇటీవల వివాహం నిశ్చయం చేశారు. ఈ విషయాన్ని స్థానికులు 1089 టోల్‌ఫ్రీ నెంబర్‌కు సమాచారం ఇచ్చారు. వెంటనే ఐసీడీఎస్ అధికారులు జోత్స్న, షీటీం సభ్యులు పెర్కిట్‌కు చేరుకొని బాలిక తల్లిదండ్రులను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ సిబ్బంది శ్రీదేవి, తార తదితరులు పాల్గొన్నారు.
విత్తనాభివృద్ధి సంస్థకు నిధులివ్వండి
వేల్పూర్: విత్తనాభివృద్ధి సంస్థకు నిధులివ్వాలని సీఎం రేవంత్‌రెడ్డికి శుక్రవారం రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ సుంకెట అన్వేష్‌రెడ్డి విన్నవించారు. హైదరాబాద్‌లోని సీఎం నివాసంలో రేవంత్‌రెడ్డిని ఆయన మర్యాద పూర్వకంగా కలిశారు. పలు అంశాలపై చర్చించారు. అనంతరం వినతిపత్రం అందజేశారు.
తాళాలు వేసిన తొమ్మిది ఇళ్లలో చొరబడ్డ దుండగులు
సుమారు రూ.15లక్షల బంగారం, నగదు అపహరణ
బస్వాపూర్‌లో దొంగల బీభత్సం