మల్లన్నసాగర్ నుంచి కొండపోచమ్మ సాగర్‌కు వెళ్లే కెనాల్
సాక్షి, సిద్దిపేట/గజ్వేల్: కరువు నేల పరవశిస్తోంది. పడావు పడ్డ భూముల్లో సిరుల పంటలు పండుతున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లా దశాబ్దాల తండ్లాటను కాళేశ్వరం ప్రాజెక్టు తీర్చింది. మేడిగడ్డ బ్యారేజీ నుంచి సిద్దిపేట జిల్లాలోని కొండపోచమ్మ దాకా గోదావరి జలాలు ఉరకలు వేస్తున్నాయి. మండుటెండల్లోనూ చెరువులు నిండుగా కనిపిస్తున్నాయి. వర్షం వస్తేనే పారే కూడవెల్లి, హల్దీ వాగులు ఇప్పుడు కొత్త నడక నేర్చుకున్నాయి.
ఇన్నాళ్లూ వలసలు పోయిన రైతులు.. తిరిగి సొంతూళ్లకు చేరుకొని వ్యవసాయం చేసుకుంటున్నారు. సిద్దిపేట జిల్లా రంగనాయక సాగర్ నుంచి మల్లన్నసాగర్ మీదుగా కొండపోచమ్మ రిజర్వాయర్ వరకు గ్రామాల్లో ‘సాక్షి’ నిర్వహించిన క్షేత్రస్థాయి పరిశీలనలో ఇలాంటి విశేషాలెన్నో బయటపడ్డాయి. ఈ అంశాలతో ప్రత్యేక కథనం..
సిద్దిపేట జిల్లా బూర్గుపల్లిలో గోదావరి జలాల డిస్ట్రిబ్యూటరీ కెనాల్
గోదావరి పరుగులతో..
మేడిగడ్డ బ్యారేజీ నుంచి లిఫ్ట్ చేసిన గోదావరి జలాలు.. వివిధ బ్యారేజీలు, రిజర్వాయర్ల మీదుగా రంగనాయసాగర్‌కు, అక్కడి నుంచి మల్లన్నసాగర్ మీదుగా కొండపోచమ్మసాగర్‌కు చేరుతున్నాయి. రంగనాయకసాగర్ నుంచి మల్లన్నసాగర్‌కు నీటిని 2.2 కిలోమీటర్ల ఓపెన్ కెనాల్, 16.2 కిలోమీటర్ల టన్నెల్ ద్వారా తరలిస్తున్నారు. మల్లన్నసాగర్ నుంచి మెయిన్ కెనాల్ ద్వారా చెరువులను నింపుతున్నారు.
దుబ్బాక కెనాల్ ద్వారా తొగుట, సిద్దిపేట అర్బన్, రూరల్ మండలాల పరిధిలోని 36 చెరువులకుగాను ఇప్పటికే 18 చెరువులు నిండి మత్తడి దూకుతున్నాయి. మరో 18 చెరువులు మూడు, నాలుగు రోజుల్లో నిండనున్నాయి. ఇక 32 చెక్ డ్యాంలకు గాను రెండు పూర్తిగా నిండగా, మరో 30 వారం రోజుల్లో నిండే అవకాశముంది. ఈ చెరువులు, చెక్ డ్యాంల నుంచి చిన్నకాల్వల ద్వారా పంటలకు సాగు నీరు అందుతోంది. చెరువులు నిండుగా ఉండటంతో పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెరుగుతున్నాయి. గతంలో ఎండకాలం మొదలవుతుందంటేనే బోర్లు,బావులు ఎండిపోయేవని.. ఇప్పుడు బాగా నీళ్లు ఉంటున్నాయని ఆయా గ్రామాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
రెండు పంటలతో..
ఒకప్పుడు ఈ ప్రాంతంలో ఒక పంట పండటమే కష్టంగా ఉండేదని.. ఇప్పుడు గోదావరి నీళ్లు రావడంతో రెండు పంటలను సాగు చేస్తున్నామని స్థానిక రైతులు చెప్తున్నారు. రంగనాయకసాగర్ నుంచి మల్లన్నసాగర్ మధ్య ఉన్న 11 (ఇమాంబాద్, గాడిచర్లపల్లి, చిన్నగుండవెల్లి, బూర్గుపల్లి, ఎన్సాన్‌పల్లి, వెంకటాపూర్, తడ్కపల్లి, బండారుపల్లి, ఘన్‌పూర్, ఎల్లారెడ్డిపేట, తుక్కాపూర్) గ్రామాల్లో 2019–20 యాసంగిలో 6,134 ఎకరాల్లో సాగు జరగగా.. ఈసారి 9,389.25 ఎకరాలు సాగైంది. గతంలో కంటే దిగుబడి సైతం పెరిగిందని రైతులు అంటున్నారు.
కొండపోచమ్మ దారిలో..
మల్లన్నసాగర్ నుంచి 23 కిలోమీటర్ల దూరంలోని కొండపోచమ్మ సాగర్ వరకు కాల్వల ద్వారా గోదావరి నీళ్లు ప్రవహిస్తున్నాయి. ఈ కాల్వ వెంట ప్రధానంగా మంగోల్, తిప్పారం, రాంచంద్రాపూర్, కొడకండ్ల, రిమ్మనగూడ, దాతర్‌పల్లి, కోనాపూర్, అక్కారం, శ్రీగిరిపల్లి, అంగడికిష్టాపూర్, పాతూరు, పాములపర్తి, మర్కూక్ గ్రామాలు ఉన్నాయి. కొడకండ్ల బ్రిడ్జి వద్ద ఆనకట్ట కట్టి నీటిని వదులుతున్నారు. కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి సాగుకు నీళ్లు అందిస్తున్నారు.
కూడవెల్లి, హల్దీకి కొత్త కళ
గోదావరి జలాల పుణ్యామాని సిద్దిపేట జిల్లాలోని కూడవెల్లి, హల్దీవాగులు మండువేసవిలోనూ పరవళ్లు తొక్కుతున్నాయి. కూడవెల్లి వాగు గజ్వేల్, దుబ్బాక, సిద్దిపేట నియోజకవర్గాల్లో 80 కిలోమీటర్ల పొడవున ప్రవహిస్తుంది. ఈ వాగుపై మర్కుక్ మండలం ఎర్రవల్లి, నర్సన్నపేట, జగదేవ్‌పూర్, ఇటిక్యాల, అలిరాజపేట, తీగుల్, గజ్వేల్ మండలం అక్కారం, కొడకండ్ల, బూర్గుపల్లి, రిమ్మనగూడ సింగాటం, అహ్మదీపూర్ గ్రామాల పరిధిలో చెక్‌డ్యామ్‌లు, రాచకట్ట రిజర్వాయర్ ఉన్నాయి. కొన్నేళ్లుగా ఈ వాగు పరిధిలో భూగర్భ జలాలు పడిపోయి పంటలు ఎండిపోతూ వచ్చాయి. గతేడాది వేసవిలో కొండపోచమ్మ సాగర్ కాల్వ నుంచి నీటిని విడుదల చేయడంతో వాగు జలకళ సంతరించుకుంది. పంటలకు కష్టం తప్పింది. అదే తరహాలో ఈసారి ఈ నెల 19న నీటిని విడుదల చేశారు.
►గజ్వేల్, వర్గల్, తూప్రాన్, రామాయంపేట మండలాల మీదుగా ప్రవహించి మంజీరా నదిలో కలిసే మరో ప్రధాన వాగు హల్దీ. దీనిపై ఖాన్ చెరువు వద్ద జలాశయాన్ని నిర్మించారు. వేలూరు పుష్పల వాగు వద్ద, అంబర్‌పేట, నాచారం, యావాపూర్, కిష్టాపూర్, ఇస్లాంపూర్, నాగులపల్లి, తూప్రాన్, నాచారం, వేలూరు, తున్కిఖాల్సా తదితర ప్రదేశాల్లో 20 వరకు చెక్‌డ్యాంలను నిర్మించారు. వర్గల్ మండలం అవుసులోనిపల్లి వద్ద ఉన్న కొండపోచమ్మసాగర్ కాల్వ నుంచి నీటిని విడుదల చేయడంతో.. హల్దీవాగు జలకళను సంతరించుకుంది.
ఇసొంటి రోజు వస్తదనుకోలే..
నాకు రెండున్నర ఎకరాల భూమి ఉంది. బోరు వేసుకొని వ్యవసాయం చేసుకునే పరిస్థితి లేక బీడుగా వదిలేయాల్సి వచ్చింది. కొండపోచమ్మసాగర్ వచ్చాక మా బతుకు మారిపోయింది. పొలానికి కాల్వలతో నీళ్లు వస్తున్నయ్. ఎకరంలో స్వీట్‌కార్న్, మిగతా భూమిలో మిర్చి, టమాటా సాగు చేసిన. రూ.లక్షా 40 వేల దాకా ఆదాయం వస్తది. పంట మంచిగ పండితే బిడ్డ పెండ్లి చేయాలనుకుంటున్న.
–దాసరి రాములు, రైతు గంగాపూర్, మర్కూక్ మండలం
బోర్లలో నీళ్లు పెరుగుతున్నయ్
గతంలో ఎండాకాలం వస్తే బోర్లలో నీళ్లు ఉండేవి కాదు. కూరగాయలు పండించేవాళ్లం. నీళ్లు లేక తిప్పలయ్యేది. గత ఏడాది నుంచి ఆ బాధ పోయింది. బోర్లలో నీళ్లు పెరుగుతున్నయ్. నాకు ఆరున్నర ఎకరాల భూమి ఉంటే.. కాల్వ కోసం 3 ఎకరాలు తీసుకున్నరు. నా భూమి పోయినా నలుగురికి మంచి జరిగిందని అనుకున్నా. మిగిలిన భూమిలో బీన్స్,మిర్చి పంటలు సాగుచేస్తున్న.
– అన్నెబోయిన కొండయ్య, రైతు,రామచంద్రాపూర్, జగదేవ్‌పూర్ మండలం
ఇప్పుడు మొత్తం భూమి సాగు చేసుకుంటున్నా..
గతంలో ఎండాకాలంలో వ్యవసాయ బోరు పావు గంట నీళ్లు వస్తే.. మళ్లీ రెండు, మూడు గంటల పాటు నీళ్లు ఊరేదాకా బంద్ చేసేవాళ్లం. కాళేశ్వరం నీళ్లతో మా ఊరి చెరువు నింపుతుండటంతో భూగర్భ జలాలు పెరిగాయి. గతంలో రెండెకరాలకే నీళ్లు సరిపోయేవి కావు. ఇప్పుడు నాకున్న మొత్తం నాలుగు ఎకరాలు సాగు చేస్తున్నా. దిగుబడి కూడా పెరిగింది.
– శంకర్, ఎన్సాన్‌పల్లి
ఎన్నడూ ఇట్లా నీళ్లు చూడలే..
నేను 50 ఏండ్ల నుంచి వ్యవసాయం చేస్తున్న.. ఎన్నడూ ఇట్లా నీళ్లు చూడలే. రెండేళ్ల నుంచి సాగునీటికి కరువే లేదు. మా భూమిలో ఉన్న బావి, బోరు ఎండకాలం వస్తుందనగానే ఎండిపోయేవి. కాలం కాకపోతే తిండి గింజలకూ ఇబ్బంది పడేవాళ్లం. ఇప్పుడా బాధ తప్పింది.
– చెత్తిరి బాలయ్య, ఎల్లారెడ్డిపేట
Comments
Please login to add a commentAdd a comment