ముంచెత్తిన వాన..
* మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో వర్ష బీభత్సం
* పంటలకు భారీ నష్టం.. అంధకారంలో సిద్దిపేట
సాక్షి, నెట్‌వర్క్: మెదక్, రంగారెడ్డి జిల్లాలను శనివారం కూడా వర్షం ముంచెత్తింది. మెదక్ జిల్లా సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాల్లో వర్షం బీభత్సం సృష్టించింది. గాలివాన ప్రభావంతో విద్యుత్ స్తంభాలు పడిపోవడం, తీగలు తెగిపోవడంతో సిద్దిపేట పట్టణం అంధకారంలో మునిగిపోయింది. ఇక్కడ 45 నిమిషాల పాటు ఏకధాటిగా వర్షం కురిసింది. హైదరాబాద్, మెదక్, ఇతర ప్రధాన రహదారులపై రాకపోకలు స్తంభించాయి. గజ్వేల్ నియోజకవర్గంలో పంటలు దెబ్బతిన్నాయి. పలుచోట్ల వడగళ్ల వాన పడింది.
గజ్వేల్-ప్రజ్ఞాపూర్ ఆరు లేన్ల రహదారి పనుల్లో భాగంగా బిగించిన విద్యుత్ స్తంభాలు ఈదురుగాలులకు వంగిపోయాయి. రద్దీగా ఉండే రహదారిపై ఇవి వంగిపోవడంతో ప్రయాణికులు భీతిల్లారు. ట్రాన్స్‌ఫార్మర్ నేలకూలింది. అలాగే, రంగారెడ్డి జిల్లాలో పలుచోట్ల ఈదురుగాలులతో చెట్లు నేలకొరిగాయి. చేవెళ్ల మండల పరిధిలోని పలు గ్రామాల్లో భారీ వర్షానికి క్యారెట్, బీట్‌రూట్ తదితర పంటలకు నష్టం జరిగింది. మొయినాబాద్ మండలంలో పిడుగుపాటుతో 4 పశువులు మృత్యువాత పడ్డాయి. శంషాబాద్, కందుకూరు మండలాల్లో భారీ వర్షానికి మామిడికాయలు నేలరాలాయి.
కొలన్‌గూడలో వడగళ్ల ధాటికి బండ నర్సింహాకు చెందిన 5 గొర్రెలు, 5 మేకలు మృతి చెందాయి. కందుకూరు మండలం బేగంపేటలో ఈదురుగాలులకు దెయ్యాల ఐలయ్య ఇంటి పైకప్పు రేకులు లేచిపోయాయి. గ్రామంలోని వ్యవసాయ పొలంలో యాదయ్యకు చెందిన ఇల్లు కూలిపోయి ఆయన భార్య యాదమ్మకు స్వల్పగాయాలయ్యాయి. శంషాబాద్ మండలం చిన్నగోల్కొండలో దాదాపు పది ఇళ్ల రేకులు లేచిపోయాయి.